Jan 17,2023 21:29

ఫొటో : మాట్లాడుతున్న కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీనివాసరాజు

ముగిసిన సంక్రాంతి క్రీడా పోటీలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని చుంచులూరులో ప్రముఖ రాజకీయ నాయకులు సుబ్బరాజు, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న ముద్దులూరు వెంకటరాజు స్మారక సంక్రాంతి క్రీడాపోటీలు మంగళవారం ఎంతో ఘనంగా ముగిశాయి. హోరాహోరీగా జరిగిన క్రికెట్‌ పోటీల్లో చుంచులూరు గ్రీన్‌స్టార్స్‌ జట్టు మొదటి స్థానంతో విన్నర్స్‌ ట్రోఫీని సాధించగా, రాజుపాలెం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా రాజుపాలెం జట్టుకు చెందిన సురేష్‌, బెస్ట్‌ బౌలర్‌గా చుంచులూరు జట్టుకు చెందిన షమీర్‌ ప్రతిభ చూపారు. బాల్‌ బ్యాడ్మింటన్‌లో చుంచులూరు ఏ జట్టు మొదటి స్థానం, చుంచులూరు బి జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. బెస్ట్‌ ప్లేయర్‌గా సుమన్‌ ఎంపికయ్యారు.
అట్టహాసంగా నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ కార్డియాలజిస్ట్‌ శ్రీనివాసరాజు, ఆత్మకూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని, నేటి సమాజంలో సంప్రదాయాలు, మానవ సంబంధాలు క్రమేణా తగ్గిపోతున్నాయని, వాటిని మళ్లీ పెంపొందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం తప్పనిసరి అని, మానసిక శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని తెలియజేశారు. ప్రముఖ రాజకీయ నాయకులు సుబ్బరాజు మాట్లాడుతూ పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలని, సంక్రాంతి పండుగను అందరూ కలసి పల్లెటూర్లలో సరదాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పోటీల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం క్రికెట్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, రంగవల్లుల పోటీలు, విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలు, షటిల్‌ పోటీలలో విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పార్వతీపురం శ్రీను, సింగర్‌ రూప బృందం వారితో ప్రదర్శించబడిన జానపద పాటలు, నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సుబ్బరాజు బంధుమిత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, పరిసర గ్రామాల ప్రజలు, క్రీడాకారులు పాల్గొన్నారు.