అనంతపురం ప్రతినిధి : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన శాసనమండలి ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో సజావుగా, ప్రశాంతంగానూ జరిగాయి. కొన్ని కేంద్రాల్లో స్వల్పంగా నిర్వహణ లోపాలు కొట్టుచ్చినట్టు కనిపించాయి. 1400 మంది ఓటర్లు ఉన్న చోట కూడా ఒకే పోలింగ్ కేంద్రమే కావడంతో అటువంటి చోట రద్దీ కనిపించింది. కొన్ని చోట్ల మాత్రం సాధారణ పోలింగే జరిగింది. తాడిపత్రిలో 146 పోలింగ్ బూత్‌లో వైసిపి ఏజెంటు ఓటర్లు జాబితా తీసుకెళ్లడంతో కొంత సేపు వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలింగ్‌కు 15 నిమిషాలు అంతరాయం ఏర్పడింది. ఆతరువాత అధికారుల జొక్యంతో సద్దుమణిగింది. బెళుగుప్పలోనూ వైసిపి, టిడిపి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. ఒకటి, రెండు చోట్ల ఓట్ల గల్లంతు సమస్య కూడా వచ్చింది. హిందూపురంలో తేజారెడ్డి అనే వ్యక్తి పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటు వేయడానికి విమానంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేశారు. అయితే జాబితాలో ఓటు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతపురం నగరంలోని కెఎస్‌ఆర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలోనూ ఇదే రకంగా చోటు చేసుకోవడం బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిదులు, రాజకీయ ప్రముఖులు కూడా క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారు. అనంతపురం నగరంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితోపాటు పలువురు ప్రముఖులందరూ ఓటు వేశారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్‌కుమార్, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలు క్యూలైన్‌లో నిల్చొని ఓటు వేశారు.
పట్టభద్రులకు 65.92 శాతం పోలింగ్
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కడప, అనంతపురం, కర్నూలు నియోజకవర్గం పరిధిలో 65.92 శాతం ఓట్లు పోలయ్యాయి. అనంతపురం జిల్లాలో 67.13 శాతం, సత్యసాయి జిల్లాలో 75.32 శాతం, కడప జిల్లాలో 60.89 శాతం, అన్నమయ్య జిల్లాలో 68.31 శాతం, కర్నూలు జిల్లాలో 59.37 శాతం, నంద్యాల జిల్లాలో 70.90 శాతం పోలింగ్ జరిగింది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం పరిధిలో మొత్తం 89.38 శాతం పోలింగ్ జరిగింది. అనంతపురం జిల్లాలో 87.31 శాతం సత్యసాయి జిల్లాలో 92.71 శాతం, కడప జిల్లాలో 85.24 శాతం, అన్నమయ్య జిల్లాలో 93.36 శాతం, కర్నూలు జిల్లాలో 90.26 శాతం, నంద్యాల జిల్లాలో 93.63 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
నేడు 'అనంత'జెఎన్‌టియుకు బ్యాలెట్ బాక్సులు
పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం పరిధి మొత్తం ఆరు జిల్లాల్లో ఉండటంతో పోలింగ్ పూర్తయిన తరువాత సోమవారం రాత్రి బ్యాలెట్ బాక్సులను ఆయా జిల్లాల్లోని స్ట్రాంగ్ రూములకు చేరుస్తారు. వీటిని అక్కడి నుంచి మంగళవారం ఉదయం అనంతపురం నగరంలోని జెఎన్‌టియు కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రానికి చేర్చనున్నారు. మంగళవారం ఉదయమే పోలింగ్‌కు సంబంధించిన స్క్రూటీనీ సైతం మంగళవారం నాడు కలెక్టరు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.నాగలక్ష్మి సమక్షంలో జరుగనుంది.










