పరిగి : మండలంలోని కొడిగెనహళ్లి ఎపిఆర్‌ఎస్ ఎక్స్‌లెన్స్ క్రీడా మైదానంలో జరుగుతున్న మండలస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. మండల వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌లో విజేతగా శ్రీరంగరాజుపల్లి జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో 16 జట్లు పాల్గొనగా ఫైనల్‌లో శ్రీరంగరాజుపల్లి, పెద్దిరెడ్డిపల్లి జట్లు పోటీపడ్డాయి. విజేతగా నిలిచిన జట్టుకు రూ.3016, రెండోస్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2016ల నగదును రిటైర్డ్ పీడీ బ్రహ్మయ్య చేతుల మీదుగా అందజేశారు. టోర్నమెంట్లో పాల్గొన్న జట్లకు దివ్య ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పరిగి వేణుగోపాలరావు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యానికి బాగా తోడ్పడుతాయని ఇటు మానసికంగా ఎదుగుదలకు ఉపకరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మురళీధర్ బాబు, పీడీలు రామాంజనేయులు, మహేష్, దీపక్, మూర్తి, నిర్వాహకులు కార్తీక్, వేణు, హరి తదితరులు పాల్గొన్నారు.










