ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : ముదివేడు బాలెన్సింగ్ రిజర్యాయర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం ఆంద్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా పనులు పూర్తి అవుతున్నా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. వ్యవసాయ భూములుచ ఇళ్లు కోల్పోయి ఆవులు, మేకలు, గొర్రెలు, మేపుకొంటూ జీవనం సాధించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. భూమి లేని వ్యవసాయ కార్మికులు పూర్తిగా నిరాశ్రయులు అవుతున్నారని, వారిరీ పరిహారం చెల్లించాలని లేని పక్షంలో నిర్వాసితులను అందరినీ ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.రామచంద్ర, కెవిపిఎస్ జిల్లా కో - కన్వీనర్ డి.సి.వెంకటయ్య సంఘీభావం తెలిపారు. అనంతరం డిఆర్‌ఒ సత్యనారాయణ ు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నిర్వాసితులు మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, శివయ్య, రెడ్డెప్ప పాల్గొన్నారు.










