Aug 10,2021 06:03

    కప్పుడు యువత మద్యపానం, ధూమపానం తదితర చెడు వ్యసనాలపాలై ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు. ఇప్పుడు యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. దీనివల్ల వీరికి తాత్కాలిక ఆనందం కలుగుతున్నా...వాస్తవ పరిస్థితుల నుంచి తప్పించుకోడానికి ఉపయోగపడుతున్నా...అది ఇంటిని, ఒంటిని, కుటుంబాన్ని ధ్వంసం చేస్తుంది. నిజానికి ఇది ఒక వ్యసనం కింద మారనంత వరకూ ఇందులోంచి బైట పడడం అంత కష్టమేమీ కాదు. ఆఫ్ఘనిస్తాన్‌, మయన్మార్‌, కొలంబియా, మెక్సికో, పాకిస్తాన్‌తో పాటు ఇండియాను మాదక ద్రవ్య వాణిజ్య కూడలిగా అమెరికా ప్రభుత్వ నివేదిక ఒకటి గతంలో పేర్కొంది. అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ, బ్రిటన్‌ జాతీయ నేర విభాగం, రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌, ఆస్ట్రేలియా మాదక ద్రవ్య నియంత్రణ విభాగాలు ఎక్కడికక్కడ ఉచ్చు బిగిస్తుండటం వల్ల దక్షిణ అమెరికా లోని మత్తు పదార్థాల తయారీ ముఠాలు భారత్‌ వైపు దృష్టి సారిస్తున్నట్లు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. వాటి ఎజెండాను అమలు కానిస్తే దేశానికి అంతకు మించిన విపత్తు మరొకటి ఉండదు.
        ఇటీవల మన సినీ పరిశ్రమకు కూడా మాదక ద్రవ్యాల వినియోగంతో సంబంధాలు వున్నాయనే వార్తలు వచ్చాయి. 2020 ప్రపంచ డ్రగ్‌ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 269 మిలియన్‌ ప్రజలు 2018 నాటికి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తేలింది. 2009తో పోల్చుకుంటే ఇది 30 శాతం ఎక్కువ. హైదరాబాద్‌, ముంబై వంటి మహా నగరాలలో యువత డ్రగ్స్‌కి బానిసలు అవుతున్నారు. ఓటమిని తట్టుకోలేక, చదువులు బుర్రకు ఎక్కక, చెడు స్నేహాలు...వంటి అనేక కారణాల వల్ల వీరు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారు. వీరు ప్రారంభంలో సరదాగా డ్రగ్స్‌ తీసుకొంటారు. లేదా ఎవరైనా వీరికి అలవాటు చేస్తారు. కొన్ని విద్యాలయాలు కూడా డ్రగ్స్‌ వినియోగ కేంద్రాలుగా మారుతున్నాయి. విదేశాల నుంచి కూడా మన దేశానికి డ్రగ్స్‌ అక్రమ రవాణా జరుగుతోంది. కొకైన్‌ వంటి నిషేధిత డ్రగ్స్‌ నుండి మరికొన్ని అనుమతి ఉన్న మందులను కూడా అవసరం లేకపోయినా వాడటం, లేదా పరిమితికి మించి వాడటం వల్ల తీవ్ర స్థాయిలో మానసిక సమస్యలు వస్తాయి. విచక్షణ కోల్పోతారు. మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర చెడు ప్రభావం పడుతుంది. ఫలితంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారు హింసాత్మక ప్రవృత్తిని పెంచుకుంటారు. కొన్నిసార్లు ఆత్మహత్యకు పాల్పడతారు.
     మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల వచ్చే నష్టాలను వివరించడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. పాఠశాల స్థాయిలో తప్పనిసరిగా పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలి. ప్రభుత్వాలు కూడా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. విద్యాలయాల్లో యువతకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. తద్వారా కొంత వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు.
 

- యమ్‌. రామ్‌ ప్రదీప్‌,
సెల్‌ : 9492712836