Nov 01,2023 23:05

ప్రజాశక్తి -ముమ్మిడివరం
వేటపై ఆధారపడిన దళితులను మత్స్యకార సొసైటీలో చేర్చాలని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి కోరారు. ఈ విషయంపై ముమ్మిడివరం ఎయిమ్స్‌ కాలేజీ వద్ద ఉన్న మత్స్యకార జిల్లా కార్యాలయంలో జెడి షేక్‌ లాల్‌ మహ్మద్‌తో బుధవారం చర్చలు జరిపారు. ఆండ్రా మాల్యాద్రి మాట్లాడుతూ బైలా ప్రకారం మత్స్యకార సొసైటీలో దళితులను చేర్చు కోవడం లేదన్న విషయాన్ని అధికారులకు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎందుకు పట్టించుకోవడంలేదని జెడిని నిలదీశారు. జిఒ నెంబర్‌ 221 ఉన్నప్పటికి అమలు జరిగేటట్టు చూడడంలో అధికారులు వైఫల్యం కనబడుతోందన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ దళితులు అణిచివేతకు గురవుతున్నారని అన్నారు. వారికి ఉన్న హక్కులు కాపాడవలసిన వారే కాల రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మత్సకార సొసైటీలో వేటపై ఆధారపడి జీవిస్తున్న దళిత కుటుంబా లందరినీ సొసైటీలో చేర్చాలని జెడితో చర్చించారు. జిల్లా మత్స్యకార జెడి స్పందిస్తూ మహిళలకు వేరేగా, పురుషులను వేరేగా మత్స్యకార సొసైటీలో చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వేటమీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో వారి జాబితా ఇస్తే అమలు అయ్యేటట్టు చూస్తామనిఅని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌, బిఎస్‌పి నియోజకవర్గ అధ్యక్షులు బడుగు భీమేశ్వరరావు, సామాజిక కార్యకర్త గుదే వెంకటేశ్వరరావు, కప్పల సత్యనారాయణ, ఆయితాబత్తుల ధనబాబు, దొంతుకూరు, కందికుప్ప, అడవిపేట, కప్పలవారి పేట, గ్రామాల నుంచి దళిత నాయకులు హాజరయ్యారు.