Nov 19,2023 21:24

మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలో మత్స్య సంపద పెంచడంతోపాటు ఆయా చేపలను తాజాగా వినియోగదారులకు అందజేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నిర్మలాకుమారి తెలిపారు. ఇందుకు కోసం ఆక్వాహబ్‌, ఫిషింగ్‌ జెట్టీలతోపాటు కోల్డ్‌స్టోరేజీలతో కూడిన వాహనాలను కూడా మత్స్యకారులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఫిష్‌ ఆంధ్రా షాపులను కూడా జిల్లాలో విరివిగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వారం తనను కలిసిన ప్రజాశక్తికి ఆమె ముఖాముఖీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు..
జిల్లాలో మత్స్య సంపదను ఏ విధంగా పెంచుతున్నారు.?
మత్స్య శాఖ ద్వారా రెండు రూపాల్లో మత్స్య సంపద పెంపునకు కృషి జరుగుతోంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం (పిఎంఎంఎస్‌) ద్వారా శాఖా పరంగా గుర్తించిన చెరువుల్లో సీడ్‌ వేసి, చేపల వృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. రెండో పద్ధతిలో మా ఫిష్డ్‌ఫారమ్స్‌ నుంచి లైసెన్డ్‌ జలాశయాల్లో చేపపిల్లలను వేసి వృద్ధి చేస్తున్నాం.
ఏయే పథకాల ద్వారా ఎక్కడెక్కడ ఎంత మేర మత్స్స సంపద ఉంది.?
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఈ ఏడాది 16.2 లక్షల చేపలను పెంచుతున్నాం. ఒక్క బొబ్బిలి ప్రాంతంలోనే 4 లక్షల వరకు పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. తాటిపూడి ఫిష్డ్‌ఫారం నుంచి అనకాపల్లి జిల్లా రైవాడ జలాశయానికి 5 లక్షలు, విజయనగరం ఫిష్డ్‌ఫారం నుంచి వెంగళరాయసాగర్‌కు 2 లక్షల ఫిష్‌ఫింగర్స్‌ను తరలించి పెంచుతున్నాం.
మత్స్య సంపద నిల్వకు ఉన్న అవకాశాలు ఏమిటి.?
సముద్రతీరంలో, చెరువులు, జలాశయాల ద్వారా వృద్ధి చెందుతున్న మత్స్య సంపదను సురక్షితంగా నిల్వ చేయడానికి రేగిడి మండల కేంద్రంలో రూ.కోటి వ్యయంతో అధునాతన ఆక్వాహబ్‌ నిర్మాణం చేపడుతున్నాం. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తికాగానే మొత్తం మత్స్య సంపద అంతా ఇక్కడే నిల్వ ఉంటుంది. ఫిష్‌ ఆంధ్రా షాపులకు ఇక్కడి నుంచే సరఫరా చేపడతాం.
ఫిష్‌ ఆంధ్రా దుకాణాలు ఎన్ని ఉన్నాయి? వాటి లక్ష్యం ఏమిటి.?
జిల్లా వ్యాప్తంగా 64 దుకాణాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం. ఇప్పటి వరకు 62 దుకాణాలు ఏర్పాటు చేశాం. ఇందులో అన్ని రకాలైన చేపలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు ఎక్కడికక్కడ తాజాగా చేపలను అందజేయడమే దీని లక్ష్యం.
చేపల తరలింపునకు వాహన సదుపాయాలు ఎలా ఉన్నాయి.?
ఎప్పటికప్పుడు కోల్డ్‌ స్టోరేజీలు, లేదా మార్కెట్‌కు తరలించేందుకు వీలుగా ప్రభుత్వం తరపున ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను మత్స్యకారులకు సబ్సిడీపై అందజేస్తున్నాం. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 50 ద్విచక్రవాహనాలు అందజేశాం. త్రిచక్రవాహనాలు 2, నాలుగు చక్రాల వాహనాలు మూడు చొప్పున కూడా అర్హులైన మత్స్యకారులకు అందాయి.
పూసపాటిరేగ తీరంలో జెట్టీ ఎంతవరకు వచ్చింది.?
సముద్ర మత్స్యసంపదను వెలికి తీసేందుకు అనుగుణంగా పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో రూ.24.75 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ జెట్టీ నిర్మాణాన్ని ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం 6 ఎకరాల భూమి కూడా సేకరించాం. గడిచిన ఏప్రిల్‌లోనే సిఎం జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థతో ఎంఒయు కూడా కుదిరింది. త్వరలో పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
వేట నిషేధ సమయంలో నిరుద్యోగ భృతి ఎంత చెల్లిస్తున్నారు.?
మత్స్యకారుల రక్షణ రీత్యా సముద్రంలో ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజులపాటు వేట నిషేధ సమయం ఉంటుంది. ఈ సమయంలో వారి జీవన భృతి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందుతుంది. ఈ రకంగా 3522 కుటుంబాలకు వేట నిషేధభృతి అందింది.
మత్స్యకార దినోత్సవ ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి.?
ఏటా నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా తీర ప్రాంతంలో మత్స్యకార దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో మత్స్యకార కుటుంబాలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నాం.