Dec 23,2022 20:06

పెద్దదర్గాలో ప్రార్థనలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌

ప్రత్యేక ప్రార్థనల్లో సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి-కడప అర్బన్‌/కడప/వేంపల్లె : మత సామరస్యానికి ప్రతీకగా అమీన్‌పీర్‌ పెద్దదర్గా వెలుగొందుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు శుక్రవారం దర్గాను సందర్శించారు. దర్గా ప్రతినిధులు దర్గా సంప్రదాయ లాంఛనాలతో జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. పీఠాధిపతి హరిఫుల్లా హుస్సేని, దర్గా కమిటీ సభ్యులు ఆహ్వానించారు. అనంతరం ముజావర్లు పూలు, వస్త్ర చాదర్‌, సుగంధ పరిమళాల అత్తరుతో కూడిన తట్టను ముఖ్యమంత్రికి అందజేయగా ఆయన తలపై పెట్టుకుని దర్గా లోపలికి ప్రవేశించి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా గ్రంథాలయంలో ముఖ్యమంత్రికి పీఠాధిపతుల దర్గా విశిష్టత, ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని వివరించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకైన దర్గాను సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ దర్గా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా పరిమళిస్తున్నాయంటే కులమత తేడాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా భాగస్వామ్యం కావడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. తను పుట్టిన సొంత జిల్లాలో ఇలాంటి మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భగవంతుడి ఆశీస్సులతో అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందివ్వగలుగుతున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా, కడప ఎంపీ వైఎస్‌.అవినాష్‌రెడ్డి, నగర మేయర్‌ సురేష్‌ బాబు, కలెక్టర్‌ వి.విజరు రామరాజు, ఎస్‌పి అన్బురాజన్‌, నగర పాలక కమిషనర్‌ జిఎస్‌ఎస్‌.ప్రవీణ్‌ చంద్‌, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ ఖాదర్‌ బాషా, దర్గా మేనేజర్‌ ఎస్‌ఎండి అలీఖాన్‌, ముజూవర్‌ అమీర్‌, దర్గా కో-ఆర్డినేటర్‌ కుతుబుద్దీన్‌, నగర డిప్యూటీ మేయర్‌ ముంతాజ్‌ బేగం, హజ్‌ హౌస్‌ చైర్మన్‌ గౌసుల్లాజం, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారులు, అహ్మద్‌ బాషా, షేక్‌ ఉమెర్‌, రెవెన్యూ శాఖా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మానవత్వాన్ని చాటుకున్న సిఎం జగన్‌
కడప పర్యటనలో సిఎం జగన్‌ను కలిసి తమ కుమారుడి అనారోగ్య సమస్యను భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు వివరించారు. కడపలో రోజూ కూలీపనికి వెళుతూ జీవనం సాగిస్తున్నానని, తన కుమారుడు నరసింహ (12 సంవత్సరాలు) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ ఇబ్బందిని ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన సిఎం నరసింహ కుటుంబానికి వెంటనే రూ.లక్ష ఆర్ధిక సాయం చేయాలని, ఆ బాలుడి వ్యాధికి మెరుగైన చికిత్సకు ఎంత ఖర్చు అయినా, ఎక్కడైనా సరే చేయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సిఎం స్పందనతో బాధిత కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. సిఎం ఆదేశాలతో వెంటనే రూ.లక్ష ఆర్ధిక సాయం అందించనున్న కలెక్టర్‌ విజయరామరాజు తెలిపారు.
ఇడుపులపాయలో సిఎం బస
కడప, కమలాపురం కార్యక్రమాలను ముగించుకుని శుక్రవారం సాయంత్రం 5.51 గంటలకు సిఎం జగన్‌ ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయలోనే రాత్రి బస చేశారు. హెలీప్యాడ్‌ వద్ద ఉన్న వైసిపి నేతలను పేరు పేరునా పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సిఎం ఇడుపులపాయలో బస చేయడంతో అనుమతి ఉన్న వారినే లోనికి అనుమతిస్తున్నారు. సమీపంలోని శేషాచల అడవుల్లో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు.