Jan 04,2023 22:37

చాదర్‌ను తీసుకెళుతున్న కలెక్టర్‌, తదితరులు

ప్రజాశక్తి పెనుకొండ : చారిత్రాత్మక ప్రాంతమైన పెనుకొండ లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాబయ్య స్వామి దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి ఏటా బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంతో పాటు కర్నాటక తమిళనాడు, కేరళ , మహారాష్ట్ర ,తెలంగాణ రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. బాబయ్య స్వామి మహోత్సవం వంశపారంపర్యంగా దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది పెనుకొండ లో బాబయ్య స్వామి దర్గా ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.
గంధం వేడుకలను ధర్గా నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తూవుంటారు. బాబయ్య స్వామి ఉరుసు సందర్భంగా దర్గా వంశపారంపర్య పీఠాధిపతి తాజ్‌ బాబా కాబోయే దర్గా పీఠాధిపతి నజర్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం ఉంటుంది. అదేవిధంగా తాజ్‌ బాబా ఆధ్వర్యంలో నిర్వహించే సర్వమత సమ్మేళనంలో వివిధ మత పీఠాధిపతులు హాజరై హిందూ ముస్లిం బేధాలు లేకుండా నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ సెమినార్‌ను కూడా నిర్వహిస్తారు.
బాబయ్య స్వామి దర్గాను సందర్శించిన కలెక్టర్‌
బాబయ్య స్వామి దర్గాను జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కె.కార్తిక్‌ సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి తాజ్‌ బాబా, కాబోయే పీఠాధిపతి సలావుద్దీన్‌ బాబా ల ఆధ్వర్యంలో ఫకీర్ల విన్యాసాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం సందల్‌ మహల్‌ నుండి చాదర్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గా సమాధికి సమర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా పెనుకొండ బాబయ్య దర్గా విరజిల్లుతోందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 750వ వార్షిక గంధము, ఉరుసు ఉత్సవ వేడుకల భాగంగా పీఠాధిపతి తాజ్‌ బాబా ఆహ్వానం మేరకు రావడం జరిగిందన్నారు. ఎంతో భక్తి విశ్వాసాలతో కుల మతాలకు అతీతంగా ప్రజల నుండి పూజలు అందుకుంటున్న దర్గా ఉత్సవ వేడుకలు జయప్రదం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి తనయుడు సలావుద్దీన్‌ బాబా నేతత్వంలో అతిథులకు ఆత్మీయ సత్కారం చేశారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ స్వర్ణలత, మునిసిపల్‌ కమిషనర్‌ వంశీకష్ణ భార్గవ్‌, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమ్మద్‌ రఫీ, వక్ఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఇమ్రాన్‌, మస్తాన్‌ బాబా, తదితరులు పాల్గొన్నారు.