మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం..
- సిపిఎం, సిపిఐ, సిఐటియు నాయకులు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా 14వ తేదీన బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకధాటిగా ఉద్యమించాలని జిల్లా సిఐటియు అధ్యక్షులు టివివి ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఇందుకూరుపేట సిపిఎం కార్యాలయంలో సిపిఎం, సిపిఐ, సిఐటియు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ బిజెపి ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య మతాల, మధ్య గొడవలు పెడుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం మనుధర్మ శాస్త్రం పేరుతో శూద్రులు, ఎస్‌సిలు, దళితులు మధ్య గొడవలు పెడుతుందన్నారు. వీటిని ఎండగడుతూ వామపక్షాలు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేస్తున్నామన్నారు. ప్రభుత్వంగ సంస్థలను ప్రయివేటు చేయడమే లక్ష్యంగా, ఆదాని, అంబానీల సంక్షేమ దిశగా బిజెపి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతి రంగాన్ని ప్రయివేటు పరం చేస్తూ అదాని, అంబానీలకు దత్తపుత్రులుగా బిజెపి వ్యవహరిస్తుందన్నారు. వీటిని ప్రశ్నించవలసిన వైసిపి, టిడిపి ప్రభుత్వాలు వీటిని ప్రశ్నించకపోగా బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్నారు. బిజెపి విధానాలకు, బిజెపిని ప్రశ్నించలేని వైసిపి, టిడిపి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో 14 తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతి వాడలో ప్రతి గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, సిపిఐ మండల అధ్యక్షులు ఎస్.కె.షాన్‌వాజ్, సిఐటియు మండల అధ్యక్షులు ఎస్.కె.చాన్‌బాషా, వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.










