ఎవరైనా ఒక నాయకుడినో, మహాకవినో ఆదర్శంగా తీసుకోవటం అంటే అర్థం ఏమిటి? వారిని ప్రచారంలోకి తేవటానికి కావాల్సిన అర్హత ఏమిటి? ఏమిటంటే- కనీసంలో కనీసం వారు చెప్పిన ఒక్క మాటనైనా పాటించటం. వారు జీవితాంతం నడిచిన దారిని అనుసరించటం. కనీసం వారి దృక్పథాన్ని గౌరవించటం. కానీ, బిజెపి నాయకుల దారి వేరు. మత సామరస్యాన్ని బోధించిన గాంధీని దారుణంగా హతమార్చిన గాడ్సేకి గుడులు కడతారు. గాంధీ విగ్రహం ముందు దొంగ కన్నీళ్లు కారుస్తూ నివాళ్లు అర్పిస్తారు. ఆచరణలో తాము ఇష్టపడని నాయకులను సైతం తమ వారిగా ప్రచారం చేసుకొని, ప్రయోజనం పొందాలని చూస్తారు.
ఇప్పుడు మహాకవి గుర్రం జాషువా విషయంలోనూ అంతే! జాషువాది మత సామరస్య పంథా. మానవీయ మార్గం. కులమతాల పేరిట సాగే వివక్ష అంతరించిపోవాలని బలంగా కోరుకున్నాడాయన. సమాజంలో వివక్షకు కారణమేంటో స్పష్టంగా తెలిసినవాడు. సనాతన ధర్మాల పేరిట తోటి మనుషులను దూరంగా పెట్టిన దుర్వ్యవస్థను తీవ్రంగా నిరసించాడు, విమర్శించాడు. ఆయన దునుమాడిన దుర్మార్గ వ్యవస్థకు కారణం మనువాదం. తీవ్రమైన వివక్ష, అనంతమైన అంధకారం, అహంకారం పెనవేసుకొని ఉన్న మనువాదాన్ని ... ఈ ఆధునిక కాలంలోనూ బలోపేతం చేయాలనే చూస్తోంది బిజెపి. జీవితాంతం అలాంటి శక్తులపై రాజీలేకుండా అక్షరాస్త్రాలు సంధించిన కవి జాషువా. గుంటూరు సీమలో పుట్టి పెరిగాడు. ''నాలుగు పడగల హైందవ నాగరాజు'' అని కులాహంకారాన్ని చాలా బలంగా, బాహాటంగా విమర్శించాడు. మత సామరస్యాన్ని గట్టిగా కోరుకున్నాడు. ఆయన రచనలు అన్నిటా ఆ వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
'కాందిశీకుడు' ఖండకావ్యంలో ఎన్నో పద్యాలు మత మౌఢ్యాన్ని, కులాల పేరిట ఉన్న అనైక్యతనీ చీల్చి చెండాడతాయి.
''సమరస భావ నిశ్చల పరిశ్రమకు బ్ర
హ్మాండంబు లున్ముఖంబయినదాక,
వ్యత్యయంబైన తీవ్రాస్ప ృశ్యతాజాడ్య
మన్ని విధాల రూపఱినదాక,
నా జాతి నాయూరు నా దేశమని పొంగు
స్వాభిమానము శూన్యమయినదాక,
విశ్వసౌభ్రాతృంబు వెలయించు నైక్య సం
ఘవ్యాప్తి దిశల పెంపారుదాక,
జ్ఞానమత సాంఘిక స్వేచ్ఛ నల్వురకును
నేకరీతి లాభించునందాక, రాదు
భావిభారత కల్యాణ పరమ సుఖము!
కాక చల్లార దెపుడు సంగ్రామ మఖము.'' (కాందిశీకుడు .. పేజీ 136)
... ఈ పద్యంలో ఎల్లలెరగని విశ్వ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించాడు జాషువా. 'నా జాతి నా ఊరు నా దేశం' అనుకునే స్వాభిమానం పోవాలన్నాడు. అందుకే ఆయన విశ్వనరుడయ్యాడు! జ్ఞానమనే మతం, సాంఘిక స్వేచ్ఛ ఎల్లరకూ ఏకరీతిన అందేదాకా దేశానికి మేలు జరగదు అంటున్నాడు జాషువా. అలాంటి ప్రపంచమంత విశాలమైన మనిషిని గుంటూరులోని ఓ సెంటరుకు కుదించాలని ఆలోచించటం ఎంత కురచ, కుత్సిత బుద్ధియో కదా! అది కూడా ఆయన భావాలకు, బోధనలకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించే ఉన్మత్త శక్తులు చెప్పటం మరింత శోచనీయం కదా!
గాంధీ హత్యానంతరం 1948లో వెలువరించిన 'బాపూజీ' ఖండకావ్యంలో ఇలా అంటాడు జాషువా.
''అన్ని దేశాల పరిచయమయ్యెగాని
మూఢ విశ్వాసముల చావు మూడలేదు
ప్రభువు గలడని సంతృప్తి పడుటకాని
సుకము గల్పించుచున్న నమ్మకము లేదు
చెర్చిపై కన్నెఱ్ఱజేయు హైందవుని సం
ధ్యావందనమున కరంబు గలదె?
దేవాలయమును నిందించు సాహెబు గారి
యేకాంతపూజ లల్లాకు సుకమె?
పరుల దోషముల నల్లరి చేయు క్రీస్తు బో
ధకున కావల బారదైసు గలదె?
స్త్రీల విజ్ఞానంబు చిదిమి బందీజేయు
దేశాన సిరులు వర్ధిల్ల గలవె?''
''గుళ్ళు గోపురాల కొఱకు చందాలెత్తి
పొట్టబోసికొనుట పుణ్యమగునె
అన్నమునకు నీటి కంటుజాడ్యం బున్న
చుప్పనాతి మతము గొప్పదగునె?'' (బాపూజీ 159వ పేజీ)
మతం ఏదైతేనేం? మూఢ విశ్వాసాలు మూర్ఖంగా పేట్రేగిపోతుంటే - ప్రజలకు మేలెక్కడ జరుగుతుంది? ఒక మతంలోని ఆచారాన్ని మరొక మతం వారు విమర్శించినంత మాత్రాన ఆ మతం గొప్పదై పోదు. ఆ ఇంకొక మతంలోని ఆచరణ అర్థవంతం అయిపోదు. అందుకనే మతం అనేది వ్యక్తిగతమైన విశ్వాసానికే పరిమితం కావాలి. అది రాజకీయాల్లోకి రాకూడదు. మరిప్పుడు మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నదెవరు?
గాంధీని విశ్వ సామరస్య విజ్ఞాన ప్రదాతగా చూశాడు జాషువా.
''పండ్లు నూరుచున్న బహుమతంబులలోన
సహన విద్య నేర్పు సాధకుండు
భార్య బిడ్డలున్న ప్రత్యక్ష దైవంబు
కామిత ప్రదాత, గాంధి తాత'' అని భావించాడు. మరి అలాంటి గాంధీని హత్య చేసింది ఎవరు? ఆరెస్సెస్ సిద్ధాంతంతో ప్రభావితుడైన నాధూరాం గాడ్సే. ఆ గాడ్సేను ఇప్పుడు బిజెపి తదితర సంఫ్‌ు పరివార శ్రేణులు గొప్పగా కీర్తిస్తున్నాయి. పలు సందర్భాల్లో విద్వేషపూరిత విషాన్ని కక్కుతున్నాయి. కలగలిసి సాగుతున్న సమాజంలో చిచ్చు పెడుతున్నాయి. అందుకనే- 80 ఏళ్ల క్రితమే ఈ ప్రమాదం గురించి హెచ్చరించాడు జాషువా.
''గాంధి రక్తధార క్ష్మాతలంబున జింది
ప్రభవమంద డొక్క బాపుజీయు
బాపుజీకి బదులు పదివేల గోడిసేల్
బ్రబలి రందు రేమి పాప మొక్కొ ..''
నిజమే కదా! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే- పదివేల మంది గాడ్సేలు అధికార దండాన్ని ఆలంబనగా పెట్టుకొని .. విద్వేషంతో విర్రవీగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ, ప్రజలు ఆ ఉన్మాదంలో కొట్టుకుపోవటానికి సిద్ధంగా లేరు. గుంటూరు సీమలో సాగిన చారిత్రిక, సామరస్య, సమైక్య ఉద్యమాలు కళ్ల ముందు ఉన్నాయి. విద్వేషం రగిలించదల్చిన ఉన్మాద శక్తుల ఉద్దేశమేమిటో స్పష్టంగానే తెలుస్తోంది. కాబట్టి- జాషువా మాటల్లోనే - అలాంటి శక్తులకు బలమైన సమాధానం ఉంది. సమాజం అందుకోవాల్సిన సందేశమూ ఉంది.
''తల్లిదండ్రు లెపుడు బిడ్డలకు నేర్పగరాదు
కులగోత్రముల వారి గొప్పతనము
చదివింపగారాదు చదువులయ్యలు పాఠ
శాలలోన వర్ణాల గొడవ
రచియింపగారాదు రచయితల్ శాశ్వత
దాస్యంబు నిలుపు కథానకములు
సలుపరా దెట్టి ప్రచారంబు లీ దినం
బమలు నందున్న కత్రిమపు సంస్థ..'' (నేతాజీ.. పేజీ 198)
- సత్యాజీ

మతతత్వ మనస్తత్వం పోయినప్పుడే మతతత్వం పోతుంది. కాబట్టి మతతత్వాన్ని మట్టుపెట్టడమనే పని ముస్లిములు, సిక్కులు, హిందువులు, క్రైస్తవులు తదితరులుందరిదీ. భారతీయులందరిదీ. దీనికోసం వారంతా మతతత్వ దృక్పథాన్ని అధిగమించి నిజమైన జాతీయతా వాద మనస్తత్వాన్ని అలవరచుకోవాలి.
- సుభాష్ చంద్రబోస్

మతం అనేది ఆయా వ్యక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశంగాను... వివిధ మత విశ్వాసాల పట్ల సహనం కలిగి వుండే విధంగాను...మన అవగాహన ఉండాలి.
- భగత్ సింగ్










