ప్రజాశక్తి-తిరుపతి : హిజాబ్ వివాదం చిచ్చురేపుతున్న తరుణంలో తిరుపతికి చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. వేర్వేరు మతపరమైన నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ, ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తూ, అనుసరిస్తూ... దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష భావాలకు సమాధానంగా నిలుస్తున్నారు. వారే హిందూ, ఇస్లాం మతాలకు చెందిన తిరుపతి వాసులు మునిరత్నమ్మ, నాదిరా భాను. మునిరత్నమ్మ రంజాన్ మాసంలో ఉపవాసముంటే, భాను వెంకటేశ్వరుడిని దర్శించుకోవడంతోపాటు శనివారం పాదరక్షలు ధరించరు, మాంసాహారం ముట్టరు. ఈ ఇద్దరు ఒంటరి తల్లులు తమ పిల్లలను గ్రాడ్యుయేషన్ వరకు చదివించి, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు. మునిరత్నమ్మ తన భర్త పెన్షన్‌తో జీవిస్తున్నారు. స్వయం శక్తి సంఘం (ఎస్‌హెచ్‌జి) సలహాదారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు. స్థానిక దర్గాను క్రమం తప్పకుండా సందర్శించి, తన స్నేహితురాలితో కలిసి నమాజ్ చేస్తారు. ''నేను ఖురాన్ నుంచి పద్యాలను కూడా చదివాను, అయితే నాకు అర్థం కాలేదు'' అని మునిరత్నమ్మ చెప్పారు. ఈ స్నేహితులిద్దరూ తమ రెండు కుటుంబాల సభ్యులతో కలిసి పండుగలు జరుపుకుంటారు. భాను మహిళా ఎస్‌హెచ్‌జికి రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్నారు. టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌సి వరకు చదివారు. తన నలుగురు పిల్లల్లో ముగ్గురు అమ్మాయిలు. వారందరినీ గ్రాడ్యుయేషన్ వరకూ చదివించారు. ఏటా 'వైకుంట ఏకాదశి'నాడు తిరుమల సందర్శించడంతోపాటు 'పురత్తాసి' మాసం (బ్రహ్మోత్స వాలు జరిగే కాలం)లో ఉపవాసం ఉంటారు. 13 ఏళ్ల క్రితం వ్యక్తిగత విభేదాల వల్ల తన భర్తతో విడిపోయారు. తన పిల్లలను ఒంటరిగా పెంచడం కష్టమని అనిపించినప్పుడు, జీవితం దయనీయ స్థితిలో ఉన్నప్పుడు ఆ కష్టాలను ఎదుర్కోడానికి మానసిక శక్తిని ఇవ్వాలని వెంకటేశ్వరుడిని కోరానని భాను చెప్పారు. ''జీవితం భరించదగినదిగా మారడంతో, నాలో ధైర్యం పెరిగింది. విశ్వాసం కూడా పెరిగింది'' అని ఆమె తెలిపారు. ''వెంకటేశ్వర స్వామిపై చాలా నమ్మకం ఉంది. శనివారాల్లో పాదరక్షలు ధరించను, సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాను. శాఖాహారమే తింటాను. అలిపిరి పాదాలు వద్ద ప్రార్థన చేస్తాను. ప్రతి నెలా తిరుమల ఆలయాన్ని సందర్శిస్తాను'' అని ఆమె తెలిపారు. కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై, నాదిరా మాట్లాడుతూ ''అన్నింటికంటే విద్యే ప్రధానమైనది. మనం హిజాబ్ ధరించడం ద్వారా మన విశ్వాసాన్ని అనుసరించాలి, అది విభేదాలను సృష్టిస్తే తరగతి గదిలో అనుసరించాల్సిన అవసరం లేదు'' అని అభిప్రాయపడ్డారు.










