Mar 20,2023 21:05

మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు

మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు
మసూరి ధాన్యం
మద్దతు ధరకే కొనుగోలు చేయాలి
-రైతు సంఘాలు డిమాండ్‌
నెల్లూరు :నెల్లూరు మసూరి ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు మద్దతు ధరకే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపి రైతు సంఘం, ఏపి కౌలు రైతు సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. సోమవారం బాలాజీనగర్‌ ప్రాంతంలోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి భవన్‌లోని జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఏపి.రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య మాట్లాడుతూ జిల్లాలో వరికోతలు ప్రారంభమైయ్యాయని, బిపిటీలు, షుగర్‌ లెస్‌ ధాన్యానికి కొనుగోలు చేసే ధర రైతాంగానికి ఊరట కలిగిస్తున్నప్పటికీ మసూరి ధాన్యం కొనుగోలు ధర తగ్గించడం, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయడంతో రైతాంగం నష్టపోతుందన్నారు.
ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మసూరి ధాన్యం కొనుగోలు మద్దతు ధరలకే కొనుగోలు చేసే విధంగా పటిష్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నారని, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ.పి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆరు లక్షల ఎకరాల్లో వరి సాగుబడి ఉందని, ఈ సాగుబడిలో కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారన్నారు. మాండూస్‌ తుఫాన్‌ కారణంగా ఈ కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని, కష్టపడి తిరిగి మరలా రెండవ సారి నారుమడులు వేసి పంట సాగుబడి చేసి ధాన్యం చేతికివచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆదుకొనే ప్రయత్నం చేయాలని డిమాండ్‌ చేశారు.ఏ.పి రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పి.శ్రీరాములు, చండ్ర రాజగోపాల్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరు లక్షల ఎకరాల్లో , అనధికారికంగా లెక్కలు తీసుకుంటే ఎనిమిది లక్షల ఎకరాల్లో వరిసాగుబడి జరుగుతుందన్నారు. దాదాపుగా 25 లక్షల పుట్ల వరిధాన్యం జిల్లాలో ఉత్పత్తి అవుతుందన్నారు. గతంలో జిల్లా రైతాంగం నుంచి 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఒకటిన్నర టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు ఆరు నెలలకు కూడా అందజేయలేదన్నారు. సివిల్‌ సప్లైస్‌ విభాగంలో వంద కోట్ల కుంభకోణం బయటపడిందన్నారు. ఈ ఏడాది వరిధాన్యంలో కొన్ని రకాలకు మద్దతు ధర లభించిందన్నారు. అకాల వర్షాల కారణంగా అనేక రకాల పంటలు వరి, మిర్చి, పొగాకు తదితర పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం ఈ నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపి కౌలు రైతు సంఘం నాయకులు పొట్టేపాళెం చంద్రమౌళి, గండవరపు బుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.