లక్నో: ఓ గ్రామంలో పెళ్లి చేసుకోకుండా 58 ఏళ్ల ఓ వ్యక్తి, 50 ఏళ్ల ఓ మహిళ ఇద్దరూ 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వారికి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వారు ఇన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నా... పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రాలేదట. ఇంత వయసుకు వచ్చాక మరిప్పుడెందుకు వచ్చింది అంటే.. అక్కడి గ్రామస్తులే పట్టుబట్టి మరీ వారివివాహాన్ని జరిపించారట. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని రసల్‌పూర్ గ్రామానికి చెందిన నారాయణ్, రామ్‌రతి వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా 2001 నుంచి సహజీవనం చేస్తున్నారు. వీరికి 2008లో ఓ కొడుకు పుట్టాడు. అయితే గ్రామస్తులు ఎప్పటి నుంచో వీరి బంధాన్ని తప్పుపడుతూ.. వారిని పెళ్లి చేసుకోవాలంటే ఒత్తిడి తెస్తున్నారు. అలాగే వారి కుమారిడిని కూడా.. గ్రామస్తులు సూటీ పోటీ మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో గ్రామస్తులను, ముఖ్యంగా తమ కుమారుడిని సంతృప్తిపరచేందుకు వారు పెళ్లికి అంగీకరించారు. వారు పెళ్లికి ఒప్పుకోవడంతో.. గ్రామస్తులే చందాలు వేసుకుని మరీ అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిపించారు.










