Dec 24,2021 21:15
  • కేంద్రం ఆపేసిన పథకాలు రాష్ట్రంలో అమలు

ప్రజాశక్తి-ప్రత్యేక ప్రతినిధి అమరావతి : రానున్న ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్‌ కూర్పు ఎలా ఉండాలి, ఏయే అంశాల ప్రాతిపదికన బడ్జెట్‌ను సిద్ధం చేయాలను విషయాలను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న పథకాలు అదనంగా అవసరమైన చోట కొత్త పథకాలను పేర్కొనడంతో పాటు, అవి ఎందుక అవసరమో సవివరంగా పేర్కొన్నాలని వివిధ శాఖల అధికారులకు తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం సూచించింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆపేసిన పథకాలనూ అవసరమైతే రాష్ట్రంలో అమలు చేయాల్సిఉంటుందని, వాటికి అవసరమైన నిధుల వివరాలను సూచించాలని పేర్కొంది. కొత్త పథకాల ప్రకటన, కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు, నవరత్నాలు, ఎన్నికల హామీలు, సవరణ బడ్జెట్‌ వంటి అంశాలపై ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపించాలని ఆర్ధికశాఖ నిర్దేశించింది. వివిధ శాఖలు తమతమ బడ్జెట్‌ ప్రతిపాదనలు ఫిబ్రవరి మధ్య నాటికి అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో చేసిన వ్యయాన్ని అనుసరించి కొత్తగా నిధులు కోరాలని తేల్చిచెప్పింది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, అక్కడి నుంచి వస్తున్న నిధులకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉండాలని స్పష్టం చేసింది.

పథకాల రద్దు, విలీనం
కొన్ని సాగుతున్న పనులు, పథకాలు, కార్యక్రమాలపై సంబంధిత శాఖాధిపతులు అధ్యయనం చేసి, వేటిని, ఎలా కొనసాగించాలన్న కోణంలో కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అవసరం లేవనుకున్న పథకాలను రద్దు చేయడం, లేదా ఇతర పధకాల్లో వాటిని విలీనం చేయడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ఉన్న వనరుల మేరకు పథకాలను సజావుగా అమలు చేసే కోణంలోనే ఈ అధ్యయనం ఉండాలని నిర్దేశించారు.
20 శాతం ఆదా
జీతాలు మినహా మిగిలిన రెవెన్యూ వ్యయంలో కనీసం 20 శాతం ఆదా జరిగేలా ప్రతిపాదనలు ఉండాలని ఆర్ధికశాఖ పేర్కొంది. ఈ మేరకు శాఖాధిపతులు దృష్టి సారించాలన్నారు. ఈ విషయాన్ని అధికారులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రధానంగా భవనాలు, అద్దెలు, పన్నులు, కార్ల వినియోగం, పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం, నీరు, విద్యుత్‌ వాడకం వంటి ఖర్చులపైనా దృష్టిసారించి, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ పేర్కొంది.
మళ్లీ ఛైల్డ్‌, జెండర్‌ బడ్జెట్‌
ఈసారి బడ్జెట్‌లో కూడా జెండర్‌ బడ్జెట్‌, ఛైల్డ్‌ బడ్జెట్‌ అమలు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆర్ధికశాఖ కోరింది. సున్నా నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కావాల్సిన పథకాలపై దృష్టి సారించాలని పేర్కొంది. జెండర్‌ బడ్జెట్‌ను రెండు విభాగాలుగా సిద్ధం చేయాలని పేర్కొంది. మహిళ, బాలికలకు 100 శాతం మేలు కలిగేలా, 30 నుంచి 99 శాతం వరకు నిధుల కేటాయింపులు జరిగేలా చూడాలని నిర్దేశించారు.