Mar 13,2022 12:46

ఓ వైపు సినిమా రంగంలో రాణిస్తూనే.. మరో వైపు వ్యాపార రంగంలోనూ అడుగులు వేస్తున్నారు నేటి సినీ తారలు.. అయితే ఇదేమీ కొత్తగా వచ్చిన ట్రెండ్‌ కానప్పటికీ ప్రస్తుతం ఇండిస్టీలో అడుగుపెట్టిన చాలా మంది కొత్తతరం నటీ, నటులు. కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉండగానే తర్వాతి జీవితాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ఆ దిశగానే బాలీవుడ్‌ నటి షెఫాలీ షా తనకు ఇష్టమైన 'జల్సా' పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇందులో ఎవరికి వచ్చిన కళను వారు ప్రదర్శించే విధంగా ప్లాన్‌ చేశారు. ఇలాంటి వాటిని దేశ వ్యాప్తంగా ప్రారంభించాలనేదే ఆమె కలగా ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

బాలీవుడ్‌ సీనియర్‌ నటి షెఫాలీ షా ఇండిస్టీలో తనకు ఎదురైన ఇబ్బందులు, అనుభవాల గురించి లేటెస్ట్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు షార్ట్‌ఫిల్మ్‌, ఓటిటీ ఫిల్మ్‌... ఇంత బిజీలోనూ అహ్మదాబాద్‌ (గుజరాత్‌) లో 'జల్సా' పేరుతో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించారు షెఫాలీ షా. టేబుల్‌ మ్యాట్స్‌, నేప్‌కిన్స్‌ ఎంపిక నుంచి గోడలపై పెయింటింగ్స్‌ వరకూ అన్నీ స్వయంగా ఆవిడే చేశారు. 'నాకు ''జల్సా'' అనే పదం చాలా ఇష్టం. అందులో ''ఉత్సాహం, ఉద్వేగం'' ఉంటాయి. నా రెస్టారెంట్‌లో బంగారం ధర ఎంత పెరిగింది? ఈ మధ్య కొత్త కారు కొన్నానులాంటి మాటలేవీ వినిపించవు. వాస్తవానికి ఇక్కడ అందరూ ఒకేచోట చేరి, తేనీరు ఆస్వాదిస్తూ... ఘుమఘుమలాడే వంట రుచులను మెచ్చుకుంటూ చూసిన నాటకం, విన్న సంగీతం, చదివిన పుస్తకం గురించి గంటలకొద్దీ మాట్లాడుకుంటారు. ఒకరి నుంచి మరొకరు విలువైన విషయాలు నేర్చుకుంటారు. మా రెస్టారెంట్లో ఉదయం పూట కమ్మని కాఫీ తాగుతూ కళ్యాణిరాగాన్ని ఆస్వాదించవచ్చు. సాయంత్రం స్నాక్స్‌తో పాటు తోలుబొమ్మలాటను ఎంజారు చేయవచ్చు. ఒక్కటా.. రెండా.... అన్నిరకాల కళలు, కళాకారులకు ఇదొక వేదిక అనుకోండి. మా రెస్టారెంట్‌లో భోజనంతో పాటు రకరకాల అనుభవాలను వడ్డిస్తాం. ఇలాంటి జల్సాలను దేశంలోని ముఖ్యనగరాల్లో ప్రారంభించాలనేది నా మరోకల' అంటున్నారు షెఫాలీ.
ఇండస్ట్రీలో ఇంతే..
   అందులో మహిళలతో పాటు ఇండిస్టీ కల్చర్‌ గురించి చెప్పుకొచ్చారు. 'నేను 27 ఏళ్లుగా ఇండిస్టీలో పని చేస్తున్నాను. యాక్టింగ్‌ టాలెంట్‌ చూసి చాలామంది పొగిడేవారు. అయితే అవన్నీ పొగడ్తలుగానే మిగిలిపో యాయి తప్పా కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. మీ కోసం మంచి కథ రాశామని ఇంతవరకు ఎవరూ నా దగ్గరకు రాలేదు. కొంతమంది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. మీతో వర్క్‌ చేయాలనుందంటూ మళ్లీ ఏవేవో కబుర్లు చెబుతారు. ఇలాంటి మాటలు వినీ వినీ బోర్‌ కొడుతుంది. ఇప్పటికైనా మాట మీద నిలబడే వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం ఇండస్ట్రీలో  స్త్రీలకు స్వేచ్ఛ దొరుకుతోంది.
    ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమైన 'హ్యూమన్‌' హిందీ వెబ్‌సిరీస్‌ మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. మెడికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో ఇద్దరు మహిళా వైద్యులు డ్రగ్‌ ట్రయల్స్‌, దాని చుట్టూ ఉండే రాజకీయ కోణం, నేరం, చంపేస్తామనే బెదిరింపులను ఎలా ఎదుర్కొన్నారనేదే కథ. అందులో డాక్టర్‌ గౌరీనాథ్‌గా నటించిన షెఫాలీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో కీర్తి కుల్హారీ స్వలింగ సంపర్కురాలైన డాక్టర్‌ సైరా సబర్వాల్‌ పాత్రలో నటించింది. ఆమె షెఫాలీ షాను ముద్దు పెట్టుకునే సీన్‌ ఉంది. 'ఈ సన్నివేశంలో ఆన్‌స్క్రీన్‌ వర్జినిటీ కోల్పోయానని అనిపించింది. గతంలో ఇలాంటి సీన్లలో ఎప్పుడూ నటించలేదు. ఓటీటీ వల్ల కలిగే ఉపయోగాలు ఈ సిరీస్‌ వల్లే తెలుసుకున్నా' అంటున్నారు షెఫాలీ షా.
అందరికీ ధన్యవాదాలు
    'కొన్ని నెలల క్రితం మా కుటుంబానికి కరోనా సోకిందనే న్యూస్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వార్త పూర్తిగా అసత్యం. అది నిజమనుకుని, త్వరగా కోలోకోవాలి అంటూ కొందరు ప్రార్థనలు చేశారు. నాకు కష్టం వచ్చిందని తెలియగానే.. ఏ సాయం కావాలన్నా చేస్తామని ముందుకొచ్చారు. నిజానికి వారిలో చాలామంది పరిచయం లేదు. ఆ సమయంలో నామీద చూపిన ప్రేమను ఎప్పటికీ మరచిపోలేను. నా కుటుంబం బాగుండాలని కోరుకున్న వారందరికీ ధన్యవాదాలు' అంటున్నారు షెఫాలీ షా.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా..
     షెఫాలీ షా సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాలో ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని షేర్‌ చేసుకుంటారు. మూవీ ట్రైలర్లు, ప్రెస్‌ కవరేజ్‌లు, పోస్టర్లు, పర్సనల్‌ మెసేజ్‌లతో పాటు ట్రెండీ ఫోటో షూట్స్‌ను ఎప్పటికప్పుడు తన అభిమానులకు షేర్‌ చేస్తుంటారు. అభిమానులూ ఆమె ప్రతి పోస్ట్‌కు మంచి రెస్పాన్స్‌ ఇస్తారు. ఇన్‌స్టాలో యువ హీరోయిన్‌లకు ఉన్నంత క్రేజ్‌ ఆమెకూ ఉంది. లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నారు. షెఫాలీ... ఢిల్లీ నిర్భయ ఘటనపై తీసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ''ఢిల్లీ క్రైమ్‌'' సినిమాలో నటించారు. ఇంకా ''మాన్‌సూన్‌ వెడ్డింగ్‌'', ''వక్త్‌'', ''దిల్‌ ధడక్నే దో'', ''ఒన్స్‌ ఎగైన్‌'' వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

పూర్తిపేరు- షెఫాలీ శెట్టి
పుట్టినతేది- 22 మే 1972
స్వస్థలం- ముంబై(మహారాష్ర)
వృత్తి - నటి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌
జీవిత భాగస్వామి- హర్ష ఛాయా
పిల్లలు- ఇద్దరు