- ఎల్‌ఐసి ఎంబెడెడ్ వాల్యూ
- రూ. 5 లక్షల కోట్లుగా నిర్థారణ
- ఇది వాస్తవాని కంటే తక్కువ : నిపుణులు
- ప్రయివేటుకు ఎస్‌సిఐ, బిపిసిఎల్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) విలువను కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసి చూపే కుట్ర చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఐసి ఎంబెడెడ్ వాల్యూ (నికర ఆస్తులు, ప్రస్తుత విలువతో కూడిన భవిష్యత్తులోని లాభాలు కలుపుకుని) రూ.5 లక్షల కోట్ల పైనా ఉంటుందని దీపమ్ సెక్రటరీ తూహిన్ కాంత పాండే తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఈ బీమా సంస్థ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానున్న నేపథ్యంలో కేంద్రం ఎల్‌ఐసి విలువను లెక్కిస్తోంది. బీమా కంపెనీలు ఐపిఒకు వచ్చినప్పుడు వాటి మిగులు లేదా నికర విలువ (ఎంబాడెడ్)ను సెబీకి సమర్పించే ఇష్యూ ప్రతిపాదిత పత్రాల్లో పొందుపర్చాల్సి ఉంటుంది. మార్కెట్ కాపిటలైజేషన్‌లో నికర విలువ అత్యంత కీలకమైంది. దీన్ని బట్టే ప్రభుత్వం ఎంత మొత్తం నిధులను సమీకరించేది ఆధారపడి ఉంటుంది. ఎల్‌ఐసి ఎంబాడెడ్ విలువను చాలా తక్కువగా లెక్కించారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ శక్తులకు చౌకగా వాటాలను అప్పగించే కుట్రలో ఇది జరుగుతుందని విమర్శిస్తున్నారు. ఓ ప్రభుత్వ రంగ సంస్థను బలిపశువును చేయడంలో ఇంత కంటే ఘోరం మరొక్కటి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ''ఎల్‌ఐసి ఎంబాడెడ్ విలువ రూ.5 లక్షల కోట్ల పైన ఉండొచ్చు. సంస్థ విలువ దీనికి బహుళ రెట్లలో ఉంటుంది.'' అని పాండే తెలిపారు. ఎంబాడెడ్ విలువ కంటే సంస్థ విలువ నాలుగు రెట్లు ఉండొచ్చని మీడియా రిపోర్టులు వస్తున్నాయి. ఎల్‌ఐసిలో వాటాల అమ్మకం ద్వారా రూ.1 లక్ష కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి ముగింపు నాటికి పిఎస్‌యుల్లో రూ.1.75 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులను విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఎల్‌ఐసిలో డిజిన్వెస్ట్‌మెంట్ చేపడుతుంది. ఎల్‌ఐసిలోని వాటాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి వీలుందని పాండే పేర్కొన్నారు.
ఎల్‌ఐసి వద్ద సరిపడ మూలధనం ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఐడిబిఐ బ్యాంక్‌లోని తన వాటాను విక్రయించే అవకాశం ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఎల్‌ఐసిలో 25 శాతం కంటే ఎక్కువ వాటాలను అమ్మకపోవచ్చని పాండే పేర్కొనడం విశేషం. ప్రభుత్వ రంగ బీమా సంస్థలో వాటాల విక్రయం వద్దని ఓ వైపున దేశ వ్యాప్తంగా పలు వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంటే.. మరోవైపు 25 శాతం వరకే విక్రయిస్తామనడం ఆందోళనకరమని ఆ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే వారం ముగింపులోపే ఐపిఒ ప్రతిపాదిత దస్త్రాలను సెబీకి సమర్పించే అవకాశం ఉందని ఇంతక్రితం రోజు పాండే పేర్కొన్నారు. కనీసం 5 శాతం వాటాలను విక్రయించే అవకాశం ఉందన్నారు. వచ్చే మార్చిలోనే ఐపిఒ ఉంటుందన్నారు.
వచ్చే ఏడాది ప్రయివేటుకు ఆ సంస్థలు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు పిఎస్‌యుల ను ప్రయివేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తూహిన్ కాంత్ పాండే తెలిపారు. ఈ జాబితాలో షిప్పింగ్ కార్పొరేషన్, బిఇఎంఎల్, బిపిసిఎల్‌లు ఉన్నాయన్నారు. 2022-23లో రూ.65వేల కోట్ల విలువ చేసే పిఎస్‌యుల వాటాలను విక్రయించనున్నామని మోడీ సర్కార్ బడ్జెట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పలు పిఎస్‌యుల్లో మైనారిటీ వాటాలను విక్రయానికి పెట్టనున్నట్లు తెలిపారు. పవన్ హాన్స్ కొనుగోలుకు ఇప్పటికే పలు బిడ్లు వచ్చాయన్నారు. తదుపరి ప్రక్రియను చేపట్టనున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇసిజిఎస్, వాప్కోస్, నేషనల్ సీడ్స్ సంస్థలు లిస్టింగ్‌కు రానున్నాయన్నారు.










