పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నారు. ''ప్రతిపక్షాలు సభను అపవిత్రం చేశాయి'' అనేది ఆయన చెబుతున్న కారణం. ''సభలో జరుగుతున్న ఘటనలు చూసి తనకు రాత్రి నిద్ర కూడా పట్టడం లేదు'' అని ఆయన వాపోయారు.
వాస్తవంగా కన్నీటి మాటున ఆయన అసలు నిజాలు దాచాలని ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఎంత గొప్ప నటన ప్రదర్శించారో తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు.
సభను అడ్డుకుంటున్నారని వాపోతున్న పెద్ద సారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా చర్చ సందర్భంలో పార్లమెంటులో సభను పదే పదే అడ్డుకుని, ఆటంకపరచి హోదా 5 కాదు 10 సంవత్సరాలు ఇవ్వాల్సిందేనని ప్రధాన మంత్రిని ఒప్పించిన విషయం మరిచిపోయినట్లున్నారు.
బిజెపి అధికారం లోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలన్న 'కనీస విజ్ఞత'తో కూడా తమ ప్రభుత్వం వ్యవహరించనప్పుడు సైతం ఆయన కన్నీరు పెట్టుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ఆయన చలించలేదు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి తీరాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఎనిమిది నెలలుగా చలిలో, వర్షంలో, ఎండలో చావు బతుకుల మధ్య పోరాడుతున్న అన్నదాత పరిస్థితిపై ఆయన మనసు కరగలేదు. ఒక్క కన్నీటి బొట్టూ దాల్చలేదు.
పెగాసస్ స్పైవేర్‌తో చేసిన నిఘా నికృష్టపు చర్యలపైనా చర్చ జరిగి తీరాలన్న ప్రతిపక్షాల డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెట్టినప్పుడు ఆయన హాయిగా నిద్రపోయారు.
ఆక్సిజన్ కొరతతో రెండవ విడత కరోనాలో దేశంలో ఒక్కరు కూడా చనిపోలేదని'' చట్టసభల్లో అలవోకగా అసత్యాలు చెప్పి దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన ప్రభుత్వ ధోరణి పట్ల ఛైర్మన్‌కు ఎటువంటి బాధ కలగక పోవటం విచిత్రమే.
'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' అని తాను సైతం పాల్గొన్న ఉద్యమం ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను...కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయాలని పట్టుబడుతున్నప్పుడు కూడా ఆయన బాగానే నిద్రపోయారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో నెలల తరబడి కొనసాగుతున్న ఆందోళన పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీకి చేరినా, మోడీ ప్రభుత్వం అణచివేతకు దిగినా గౌరవ ఉపరాష్ట్రపతి గారు హాయిగా నిదురించారు. ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేక పోయారు.
ఆగష్టు 9 క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా 'సేవ్ ఇండియా' పేరుతో లక్షల మంది శ్రమజీవులు లక్షలమంది ''కార్పొరేట్ దోపిడీ నుండి'' తమ దుర్భర జీవితాన్ని మెరుగు చేయాలని గొంతెత్తి నినదించారు. అయినా గౌరవ ఉపరాష్ట్రపతి గారికి చీమ కుట్టినట్లు కూడా లేదు.
కరోనా సమరంలో విఫలమైన మోడీ గతంలో ప్రజల బాధలపై కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రజల ఉద్వేగంతో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్న వారు ఇటువంటి నాటకాలు ఆడుతుంటారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా జిమ్మిక్కులతో పాలన సాగించాలనుకుంటే సాగదు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు సుమా.
- కారుసాల శ్రీనివాసరావు










