అధికారంలోకి రాగానే టామోటా జాక్‌పాట్ విధానం రద్దు
అమూల్ పుంగనూరులో ఎందుకుండదు?
ముస్లింల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం
పాదయాత్రలో నారా లోకేష్
ప్రజాశక్తి-వాల్మీకిపురం/కలికిరి : మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాడుగా మారబోతోందని, నీరు అందక ఎంతో లోతు బోరు తవ్వాల్సి ఉంటుందని. రైతుకు ఒక బోరు మాత్రమే ఉండాలని ప్రభుతం అనడం సరికాదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 37వ రోజుకు చేరుకుంది. మంగళవారం కలికిరి ఇందిరమ్మనగర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కలికిరి జెఎన్‌టియు వద్ద, వాయల్పాడు మండలంలోని వాండ్లపల్లి, గంధబోయినపల్లి, బీదవారిపల్లి, చింతపర్తి, బోయపల్లి క్రాస్ వరకూ పాదయాత్ర సాగింది. 10.9 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మైనారిటీలు, రైతులు, ఎస్‌టిలతో ముఖాముఖి, విద్యార్థులతో మాటామంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ టమోటా రైతులకు గిట్టుబాటు ధర లేదన్నారు. రోజుకో విధంగా టమోటా ధర మారుతోందని తెలిపారు. టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని చెప్పారు. టమోటాలు పోయాల్సింది రోడ్ల మీద కాదని తాడేపల్లిలోని జగన్ ఇంటిముందన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు చంద్రబాబు 90 శాతం సబ్సిడీ ఇస్తే ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదని, ఎరువుల ధరలు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఒక కోర్టు దొంగన్నారు. మంత్రయ్యాక రైతులను పట్టించుకున్నాడా.? అని ప్రశ్నించారు. జగన్ వచ్చాక పవర్, క్రాప్, ఆక్వా హాలిడే వచ్చిందన్నారు. రైతులకు పార్టీలుండవనీ, రాయలసీమకు టిడిపి హయాంలో రూ.13 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. తాను 26 రైతు భరోసా కేంద్రాలు చూశాననీ ఎప్పుడు చూసినా తాళాలు వేసి ఉంటున్నాయని తెలిపారు. టమోటా రైతుల దగ్గర నుండి 100 బాక్సుల్లో 20 బాక్సులు జాక్ పాట్ తీస్తున్నారనీ, ఒక్క రైతు భరోసా ఇచ్చి సబ్సిడీలన్నీ రద్దు చేశారని యూరియా తప్ప ఆర్బీకేలో ఏమీ ఉండటం లేదని రైతులు లోకేష్ ఎదుట వాపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో జాక్ పాట్ విధానం రద్దు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. జగన్ అమూల్ తెచ్చారు కానీ అది పుంగనూరులో ఉండదన్నారు.
ముస్లింల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం
ముస్లిం మైనార్టీల అభివృద్ధికి టిడిపి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారుర. లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఉదయం నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డితో కలిసి ముస్లిం మైనార్టీల సదస్సులో పాల్గొని వారి సమస్యల పట్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులు లోకేష్‌కు వారి సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తగా వాటికి అన్నిటికీ సమాధానం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, వారికి గౌరవ ప్రదమైన స్థాయిని కల్పించిన ఘనత టిడిపిదేనని ప్రతి ముస్లిం సోదరుడు ఇది గమనించాలన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఆయన్ను పలు ప్రశ్నలు అడిగారు. ఉర్దూ మీడియం చదివి చాలా మంది యువత నేడు ఉద్యోగాలు లేక పోస్టులు భర్తీ కాక, పెళ్లిళ్లు కాక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి జ్యుడీషియల్ పవర్ ఇవ్వాలని ప్రముఖ సాహితీవేత్త వేంపల్లి అబ్దుల్ ఖాదర్ కోరారు. యువత మాట్లాడుతూ దూదేకుల కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, బయట దేశాలకు వెల్లిన వారికి ఆపద వస్తే ఆదుకోవడానికి సహకారం, ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు కొరకు నారా ప్రభుత్వం వస్తే ఏమి న్యాయం చేస్తారో చెప్పాలని కోరారు. లోకేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాగానే ఉర్దూ చదివిన వారికి డిఎస్‌సి పెట్టి పోస్టులు ఇస్తామని, ఇస్లామిక్ బ్యాంకును తప్పకుండా ఏర్పాటు చేస్తామని, విదేశాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొనే వారికోసం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎపిఎన్‌ఆర్‌టిని ఏర్పాటు చేసి దాని ద్వారా వారికి సహాయ సహకారాలు అందజేసేవారిమని, ఇప్పుడున్న ప్రభుత్వం ఆ వ్యవస్థను నాశనం చేసి ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసిందని మేము తిరిగి అధికారంలోకి రాగానే మళ్లీ ఆ బోర్డును క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. వక్ఫ్ ఆస్తులకు జ్యుడీషియల్ పవర్ తప్పనిసరిగా తీసుకువస్తామని వారికి హామీ ఇచ్చారు. సదస్సు అనంతరం పాదయాత్ర ప్రారంభించి జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా విద్యార్థులతో ముచ్చటించి కళాశాలలో సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం పార్టీని ఆదరించాలని వారికి తెలిపారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు నిజాముద్దీన్, ప్రధాన కార్యదర్శి హనీఫ్, హజరత్ ముస్తఫా, టిడిపి నాయకులు, ముస్లిం మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










