కడప ప్రతినిధి : రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల నగారా మోగింది. మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగల్ లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల, మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ నిర్వహించనుంది. మార్చిలో ఐదుగురు ఎంఎల్‌సిలకు పదవీ కాలం ముగియనుంది. శాసనమండలి ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. గతేడాది నవంబర్ నుంచే ఎన్నికల వేడి ఊపందుకుంది. జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్రంలోని ఐదు ఎంఎల్‌సి స్థానాల్లో మూడు పట్టభధ్ర, రెండు ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు తెరలేచింది.
ఎన్నికల నిర్వహణ స్థానాలివే!
పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మార్చిలోపు పట్టభధ్ర, ఉపాధ్యాయ మండలి ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. పట్టభద్రుల నియోజకవర్గం కింద కడప-కర్నూలు-అనంతపురం, ఉపాధ్యాయ నియోజకవర్గం కింద కడప-అనంతపురం-కర్నూలు నియోజకవర్గాలకు అభ్యర్థుల నామినేషన్ చేసుకోవాలని పేర్కొంది.
ఆర్నెళ్లుగా ఆశావహుల ప్రచారం
కడప-కర్నూలు-అనంతపురం పట్టభద్ర ఎంఎల్‌సి స్థానానికి పలువురు అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం పర్వంలో నిమగమయ్యారు. ఉపాధ్యాయ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో ఆర్నెళ్లుగా ఎన్నికల బరిలో నిలిచేందుకు పలువురు నిరీక్షిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం పిడిఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ కత్తినర సింహా రడ్డికి యుటిఎఫ్, ఎస్‌టియుకు నాయకత్వం భేషర తుగా మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో ముందంజలో సాగి పోతున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పిడిఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండడం తెలిసిందే. వీరికి పోటీగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించడంలో తలమునకలుగా ఉన్నాయి. ఓటర్ల నమోదు దగ్గర నుంచి ఎన్నికల ప్రచారపర్వం వరకు ఏతరహాలో సిద్ధమవుతున్నారో తెలుస్తోంది.
ఎన్నికల బరిలో ఎవరెవరు?
గత ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నుపూస గోపాల్‌రెడ్డి గెలిచినా ఆయనపై వ్యతిరేకత పెల్లుబుకిన నేపథ్యంలో వైసిపి ఆత్మరక్షణలో పడిపోయింది. ఆయన కుమారుడు రవీంద్రారెడ్డిని రంగంలోకి దించింది. టిడిపి తరుపున భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డిని బరిలోకి దించింది. వీరిద్దరికీ పిడిఎఫ్ తరుపున అనంతపురం జిల్లాకు చెందిన పోతుల నాగరాజు నుంచి గట్టి సవాల్ ఎదురు కానున్నట్లు పరిశీలకుల అంచనా. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పిడిఎఫ్ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి బరిలో నిలవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులుగా ఎవరిని బరిలో నిలపాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల గోదా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అధికార వైసిపి ఇద్దరు యూనియన్ నాయకుల పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో ఎవరి వైపు మొగ్గాలనే ఆలోచనలు సాగిస్తోంది. గతేడాది నవంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు నుంచి అధికార, ప్రతిపక్ష, పిడిఎఫ్ అభ్యర్థులు ఎన్నికల గ్రౌండ్‌వర్క్ నిమగమైనట్లు తెలుస్తోంది. ఒకవైపు అధికార, ప్రతి పక్ష పార్టీ తరుపున కార్పొరేట్ శక్తులు, మరోవైపు పిడిఎఫ్ తరుపున యూనియన్ నాయకులు హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.










