Nov 03,2020 07:07

         పాఠశాలల్లో రేషనలైజేషన్‌ కోసం పాఠశాల విద్యాశాఖ అక్టోబరు 12న జీఓ 53 ఉత్తర్వులు విడుదల చేసింది. 2017 నాటి ఉత్తర్వులు మార్పు చేస్తూ నూతన స్టాఫ్‌ పాటర్న్‌ ఉత్తర్వులు ఇచ్చింది. 2017లో రేషనలైజేషన్‌ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇందులో ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు. అప్పటి యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్షునిగా నేను, ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం ఆ కమిటీలో ఉన్నాము. ఎక్కువ ప్రాథమిక పాఠశాలలు ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులతోనే నడవడం సరైన విధానం కాదని, తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుడుగా ఐదుగురు ఉపాధ్యాయులతో ప్రతీ గ్రామానికి ఒక పాఠశాలను అభివృద్ధి చేయాలనే అభిప్రాయం బలంగా వినిపించాము. నాడు విద్యాశాఖ అధికారులు ఈ ప్రతిపాదన అంగీకరించారు. దీనితో ప్రాథమిక పాఠశాలలు, యు.పి పాఠశాలలు, ఉన్నత పాఠశాలలకు రివైజ్డు స్టాఫ్‌ పాటర్న్‌ రూపొందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలకు 20 పైన విద్యార్థులకు ఇద్దరు, 80 వరకు ముగ్గురు, 80 విద్యార్థులు దాటితే ఐదుగురు, 131 నుండి 6 ఉపాధ్యాయుల పోస్టులు మంజూరు చేశారు. ఈ మోడల్‌ స్కూళ్ల కాన్సెప్ట్‌ 2017-20 మూడు విద్యా సంవత్సరాలు అమలు జరిగింది. విద్యాశాఖ, దీన్ని సమీక్ష చేసి ఉంటే బాగుండేది. ప్రస్తుతం 3884 మోడల్‌ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుత రేషనలైజేషన్‌లో 80 మంది పిల్లలు దాటితే ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్న చోట రెండు పోస్టులు రద్దు అవుతాయి. 80 మంది పైబడి విద్యార్థులున్న పాఠశాలలు ప్రస్తుతం 2499 ఉన్నాయి. ప్రస్తుత రేషనలైజేషన్‌ వలన ఈ పాఠశాలలో సుమారు 5500 పోస్టులు తగ్గించడం జరుగుతుంది.

విద్యాహక్కు చట్టం                                     2017                                               2020
                                                131-160           5+1                151-200            5+1
121-200           5+1                   81-130             5                   121-150              5
 91-120              4                     61-80               3                     91-120              4
61-90                 3                     20-60               2                     61-90                3
60 వరకు              2                    19 వరకు            1                     20 వరకు            2

           పై పట్టికను పరిశీలిస్తే 2017 నాటి స్టాఫ్‌ పాటర్న్‌లో విద్యార్థి ఉపాధ్యాయుల సంఖ్య సమంజసంగా, బాగున్నట్లు అనిపిస్తుంది. ఇది ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20గా లేకున్నా మెరుగ్గా ఉంది. నాణ్యమైన విద్య, సిసిఇ బోధనా పద్ధతిలో 1:20 నిష్పత్తి ఉండాలనే డిమాండు నేడు వస్తున్నది. అయితే పాఠశాల విద్యాశాఖ మొత్తం ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి 1:19గా ఉన్నాయని చెబుతుంది. మొత్తం విద్యార్థుల సంఖ్యను బట్టిగాక, పాఠశాలల వారీగా నిష్పత్తి చూడడమే సమంజసంగా ఉంటుంది.
2017 నుండి 2020 మధ్య ఈ మూడేళ్ళ కాలంలో బదిలీలు, రేషనలైజేషన్‌ జరగలేదు. ప్రస్తుతం విద్యాశాఖ రేషనలైజేషన్‌, బదిలీలలో స్టాఫ్‌ పాటర్న్‌ మార్పు చేస్తూ జీఓ 53 ఉత్తర్వు ఇచ్చింది. మోడల్‌ స్కూళ్ల కాన్సెప్టు పాటర్న్‌ ప్రకారం తగినన్ని ఉపాధ్యాయుల పోస్టులు లేవని, విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని, ఏజన్సీ ప్రాంతంలో అసలు ఉపాధ్యాయులే లేరని, విద్యాహక్కు చట్టం పేర్కొన్నట్లే రేషనలైజ్‌ చేస్తామని మోడల్‌ స్కూళ్ళకు మంగళం పాడింది. అన్నీ మోడల్‌ స్కూళ్లుగా రూపొందిస్తామని చెబుతుంది. 2017 స్టాఫ్‌ పాటర్న్‌ను కొనసాగించాలని, పాఠశాలల్లో అక్టోబరు 31 నాటి ఎన్‌రోల్‌మెంట్‌ పరిగణలోకి తీసుకొని రేషనలైజేషన్‌ చేయాలని, విద్యార్థులు పెరిగిన పాఠశాలకు పోస్టులు మంజూరు చేయాలని పిడియఫ్‌ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండు చేస్తున్నాయి. రెండు మూడు దఫాలుగా చర్చలు జరిగినా ఆర్‌టిఇ ప్రకారమే రేషనలైజేషన్‌ చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
            పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాలు, కరోనా పరిస్ధితుల నేపథ్యంలో పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగింది. పెరిగిన ఈ పిల్లలను నిలబెట్టుకోవాలంటే పిల్లలు పెరిగినచోట తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చూడాలి. గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా ఎలిమెంటరీలో పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. పిల్లలు తగ్గారని ఉపాధ్యాయులను తగ్గించారు. ఉపాధ్యాయులు లేరని పిల్లలు ఇంకా తగ్గిపోయారు.
                                      ఉపాధ్యాయుల పోస్టులు ఎట్లా మాయమయ్యాయి ?
            2000 సంవత్సరం నుండి ఇంగ్లీషు, ఫిజిక్స్‌ పోస్టుల మంజూరుకు, హైస్కూళ్ళలో ఎస్‌జిటి పోస్టులన్నిటినీ అప్‌గ్రేడ్‌ చేసేందుకు, గ్రేడ్‌-2 ప్రాధానోపాధ్యాయుల పోస్టుల మంజూరుకు, పండిట్లు, పిఇటి అప్‌గ్రెడేషన్‌కు...ఎస్‌జిటి పోస్టులను రద్దు (సప్రెస్‌) చేస్తూ వచ్చారు. ఈ 20 ఏళ్ళలో హైసూళ్ళలో పోస్టులు పెరిగాయి. మొత్తం ఉపాధ్యాయుల పోస్టులు 2 లక్షలు ఉంటే ఎలిమెంటరీలో 76 వేల పోస్టులకు తగ్గిపోయాయి. హైస్కూలు అవసరాలకు పోస్టులు మంజూరు చేయకుండా కింది ఎస్‌జిటి పోస్టులు రద్దు చేసి పై పోస్టులు అప్‌గ్రేడ్‌ చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
                                                  తక్షణం 2020 డిఎస్‌సి వేయాలి
          పాఠశాలల్లో పిల్లల పెరుగుదలకు అనుగుణంగా రేషనలైజేషన్‌, టీచర్ల నియామకాలు జరగాలి. డిఎస్‌సి భర్తీ అయ్యేలోగ ఖాళీ పోస్టులన్నింటిలో తక్షణమే అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు చేయాలి. ఆ విధంగా మాత్రమే ప్రభుత్వ విద్యారంగం బలపడే పరిస్ధితి ఉంది.
                                                రెండు, మూడేళ్ళకోసారి డిఎస్‌సి
          ప్రమోషన్లు, పదవీ విరమణలు, మరణాల వలన ఖాళీ అయ్యే పోస్టులు ప్రతీ సంవత్సరం భర్తీకాక పోవడంతో ప్రస్తుత విద్యాశాఖ లెక్కల ప్రకారం 7774 ఏకోపాధ్యాయ పాఠశాలలుగా, 1286 పాఠశాలు నో టీచర్‌ స్కూళ్ళు డిప్యుటేషన్‌పై నడుస్తున్నాయి. ప్రతి డిఎస్‌సి కి 2, 3 సంవత్సరాలు గ్యాప్‌ రావడంతో ఉపాధ్యాయుల కొరతతో పాఠశాలలు నడుస్తున్నాయి. గత విద్యా సంవత్సరం 20 వేల ఖాళీలతో గడిచిపోయింది. సంవత్సరాల తరబడి డిఎస్‌సి లు వేయకపోవడం వలన రూ. వేల కోట్ల విద్యా బడ్జెట్‌ను ప్రభుత్వం మిగుల్చుకుంటోంది.


(వ్యాసకర్త ఎమ్మెల్సీ ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, సెల్‌ : 9490300570)

ఐ.వెంకటేశ్వరరావు