Dec 27,2021 08:35
  • ఉత్తరప్రదేశ్‌లో పడిపోతున్న గ్రాఫ్‌
  • ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తున్న అనేక అంశాలు

లక్నో: ప్రధాని మోడీ, ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగీల డబుల్‌ ఇంజిన్‌ పాలన ఢమాల్‌ అంటున్నది. వీరు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రత్యక్షంగానే ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతోపాటు ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బిజెపి పాలిత రాష్ట్రాల పాలన అభివృద్ధిని వివరించే క్రమంలో 'డబుల్‌ ఇంజిన్‌' పదాలను వాడటం కమలం పార్టీ నేతలు అధికం చేశారు. ఒక ఇంజిన్‌ కేంద్రంలోని మోడీ సర్కారు కాగా, రెండో ఇంజిన్‌ బిజెపి పాలిత రాష్ట్ర సర్కారు. ఉత్తర ప్రదేశ్‌కి సంబంధించిన ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణ, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ, వేతనాలు, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు వంటి ప్రజలను నేరుగా ప్రభావితం చేసే కీలక సమస్యలపై డబుల్‌ ఇంజిన్‌ పనితీరును గమనిస్తే క్రమంగా క్షీణిస్తున్నదని అధికారిక గణాంకాలు (రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) పేర్కొంటున్నాయి.
 

                                                      ఆర్థికవృద్ధి మందగమనం

2017 మార్చిలో బిజెపి విజయంతో యోగి ఆదిత్యనాథ్‌ యుపి సిఎంగా ఎన్నికైనప్పుడు.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి) ఆరోగ్యకరమైన 11.4 శాతం వృద్ధితో ముగిసింది. అప్పటి నుంచి ఇది క్రమంగా క్షీణిస్తూ.. 2020-21లో ఏకంగా -6.4 శాతానికి పడిపోయింది. అంతకు ముందు ఏడాది (2019-20)లో ఇది 3.8 శాతానికి తగ్గిపోయింది. 2018-19లో 6.3 శాతంగా, 2017లో 4.6 శాతంగా నమోదైంది. మోడీ-యోగీల డబుల్‌ ఇంజిన్‌ గాడి తప్పిందని స్పష్టం తెలుస్తోంది. ఆర్థిక వృద్ధి విషయంలో మోడీ సర్కారు ప్రదర్శించిన చొరవ, కార్పొరేట్‌ రంగ పెట్టుబడులపై ఆధారపడటం, యూపీలో యోగి ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లను నిర్వహించడం, వివిధ సేవలను ప్రయివేటీకరించడం వంటి చర్యల ద్వారా ఫలితం కనిపించలేదు.
 

                                                         డీఇండిస్టియలైజేషన్‌

తడబడుతున్న యూపీ ఆర్థిక వ్యవస్థలో బిజెపి డబుల్‌ ఇంజిన్‌ ప్రస్తావించని మరో విషయం పరిశ్రమ ఆర్థిక సహకారం రాష్ట్రానికి తగ్గిపోవడం. 2016-17, 2020-21 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల వాటా 35 శాతం నుంచి 31 శాతానికి తగ్గిపోయింది. అంటే దేశీ, విదేశీ భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పెద్దగా రాలేదు. సంప్రదాయ, ఇతర పరిశ్రమలను ప్రోత్సహించే వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రోడక్ట్‌ కార్యక్రమంపైనా దృష్టి సారించలేదు. పరిశ్రమ రంగంలో ఉపాధి కూడా పెరగలేదు.
 

                                                      పెరిగిన రాష్ట్ర రుణభారం

డబుల్‌ ఇంజిన్‌ పాలనలో యూపీ రుణ భారం కూడా భారీగా పెరిగింది. 2016-17లో రాష్ట్ర రుణ భారం రూ.4,73,348 కోట్లుగా ఉండగా, 2020-21లో దాదాపు 40 శాతం పెరిగి రూ.6,62,891కు పెరిగింది. దీంతో అత్యధిక రుణం ఉన్న రాష్ట్రంగా యూపీ నిలిచింది. ఈ రుణంలో నాలుగింట మూడొంతులు వాణిజ్యపరమైనది.
 

                                                       ప్రజల నెత్తిన ధరాఘాతం !

మార్కెట్‌లో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. యోగి పాలన మొదలైనప్పటి నుంచి సగటు వార్షిక ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 2.4 శాతం నుంచి 2020-21లో 6.1 శాతానికి పెరిగింది. కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉపాధి పోవడానికి తోడు ద్రవ్యోల్బణం పెరుగుదల కుటుంబాలను ఆర్థిక కూపంలో పడేసింది. దీని కారణంగా విద్య, వైద్యం, ఆహారం సహా అనేక ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.

                                                  అతి తక్కువగా గ్రామీణ వేతనాలు

గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2021లో యూపీలో పురుష కార్మికుల సగటు రోజువారీ వేతనం రూ.274.5గా ఉంది. అధికారికంగా ప్రకటించిన రేట్లు దీని కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇది భారత దేశ సగటు (రూ.309.9) కంటే తక్కువగా ఉంది. దేశంలో అత్యల్ప వేతనాలు అందిస్తున్న రాష్ట్రాల్లో యూపీ కంటే ఐదు రాష్ట్రాల్లోనే తక్కువగా ఉంది. దేశంలోనే అత్యధికంగా యూపీలో 1.99 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారని 2011 జనాభా లెక్కలు పేర్కొంటున్నాయి. మోడీ-యోగీల డబుల్‌ ఇంజిన్‌ పాలన వైఫల్యం చెందిం దని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.