ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : ప్రధాని మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సాయి ఆరామం అతిథి గృహంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేసి రెండేళ్లపాటు జైలు శిక్ష విధించడం చాలా దారుణమన్నారు. దేశంలో నేడు మహిళలపై మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈనెల 14 నుంచి 30 వరకు సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతున్నామన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సవతి ప్రేమ చూపి అరకొర నిధులు కేటాయించడం అన్యాయమన్నారు. జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ, పుట్టపర్తి పవిత్రతను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంట కలిపారని 30 పోలీస్ యాక్ట్ ఉన్న ఇలా జరగడం పోలీసుల వైఫల్యమే అని విమర్శించారు. ఈ సమావేశం లో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటమయ్య, అనుబంధ సంస్థల నాయకులు సురేంద్ర, జింకా చలపతి, బయన్న, నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










