మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలి సిపిఎం-సిపిఐ రాజకీయ ప్రచార భేరిలో నాయకులు
జమ్మలమడుగు రూరల్ : కార్పొరేట్ కంపెనీలకు కాపలా కాస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం వచ్చిందని సిపిఎం, సిపిఐ నాయకులు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన సిపిఐ-సిపిఎం ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక పాత బస్టాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం జమ్మలమడుగు కార్యదర్శి శివ నారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ నన్ను నమ్మండి ఈ దేశానికి కాపలాదారుడిగా వుంటానని ఎన్నికలకు ముందు ప్రగ్భలాలు పలికిన మోడీ అధికారాన్ని హస్తగతం చేసుకొన్న తర్వాత పేదల రక్తాన్ని పీల్చి కార్పొరేట్ గద్దలకు దోహదపడే విధంగా చట్టాలను చేస్తున్న జిత్తుల మారి మోడీని గద్దెదింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశాన్ని 14 మంది ప్రధానులు కాలంలో రూ.50 లక్షల కోట్లు అప్పు చేసిపోతే, మోడీ ఎనిమిది సంవత్సరాల ఏలుబడిలోనే దాదాపు లక్ష కోట్లు అప్పులు చేశారని తెలిపారు. నోట్ల రద్దు చేసి నల్లధనాన్ని వైట్ మనీగా మార్చి, పేదల అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారన్నారు. ఎపికి మోడీ ప్రభుతం చేసింది ఏమీలేదన్నారు. విభజన హామీలు ఒక్కటైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. కడప ఉక్కును ఎందుకు విస్మరించారన్నారు. విశాఖ ఉక్కు కాపాడుకుందాం, కడప ఉక్కును సాధిద్దామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ప్రసాద్, నాయకులు దాసు, ప్రసాద్‌రెడ్డి, కృష్ణారెడ్డి ,లక్ష్మి నారాయణ, శ్రీను, విజరు, దండు రవి, మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు మునిస్వామి, చెన్నయ్య, నరసింహులు, సుబ్బన్న, సుభాష్ పాల్గొన్నారు.










