మొక్కుబడిగా మండల సమావేశం
- ప్రజాసమస్యల పరిష్కారంలోఅధికారులు నిర్లక్ష్యం
- ఎంపిటిసిలు, సర్పంచ్‌లు అసంతృప్తి
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సాధారణ మండల సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపిపి గంగవరపు లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఏఈ జయరామిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీల్లో సిసిరోడ్లు మంజూరు కాగా కొన్నిచోట్ల పనులు పూర్తి కాగా మరికొన్ని చోట్ల త్వరలో పనులు మొదలు పెట్టనున్నట్లు తెలియజేశారు. మండలంలో 16 రైతుభరోసా కేంద్రాలు మంజూరు అయ్యాయని, వాటిలో 14 ఆర్‌బికెలు పూర్తయ్యాయన్నారు. ఎంపి నిధులతో 8ఆర్‌ఒ ప్లాంట్లు పూర్తి చేశామని, రెండు పంచాయతీల్లో త్వరలో పనులు చేపడతామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రవితేజ తెలియజేశారు. అన్నదాతలు విచ్చల విడిగా మందులు వాడుతున్నారని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలని వ్యవసాయాధికారి రామ్మోహన్ అన్నారు. పత్తిలో గులాబీ పురుగు నివారణకు జాగ్రత్తలు వహించాలన్నారు. పిఎం కిసాన్, రైతు భరోసా నగదు రాని రైతులు ఈ-కెవైసి చేయించుకుంటే త్వరలో విడుదల కానున్న 14వ విడత నగదు జమవుతుందన్నారు. కొన్నిచోట్ల శనగ పంట వేశారని, మర్రిపాడు సొసైటీ కేంద్రంలో శనగలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరులను మార్చి నుండి పనులు జరుగుతాయని, అన్ని పంచాయతీల్లో పనులు ముమ్మరంగా ప్రారంభించేందుకు గ్రామపంచాయతీ సర్పంచ్లు సహకరించాలని ఏపీవో సునీల్ కుమార్ కోరారు. ఏపిలకుంట ఎంపిటిసి హజరత్ రెడ్డి మాట్లాడుతూ 5నెలల నుండి హెల్పర్ లైన్మెన్ లేక పంచాయతీ ప్రజలు కరెంటు సమస్యలతో రైతులు అల్లాడుతున్నారని విద్యుత్తు ఉపకేంద్రం ఏఈ పట్టించుకోవడంలేదని అధికారులను నిలదీశారు. గ్రామంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించిన పరిష్కరించడం లేదన్నారు. గ్రామానికి చెందిన సన్నకారు రైతును తమ పొలంలోకి వెళ్లనీయకుండా ఓ వ్యక్తి అడ్డుకోగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి కాళ్లమీద పడి తమ ఆవేదనను వివరించగా వెంటనే సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అధికారులు వచ్చి చూశారు కానీ సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. తమ గ్రామ సమస్యలను పరిష్కరించకుండా అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని ఎంపిటిసి ఆగ్రహించారు. మండల కార్యాలయాలలో అధికారులు రైతులకు ఏమి చేయడం లేదని, చిన్నపిల్లల స్కూల్ వద్ద పేడది బ్బలు ఉండగా వాటిని తొలగించేందుకు కృషి చేయాలని పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని గ్రామ సచివాలయాలలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఉన్ననూ ఫీల్డ్ మీదకు వెళ్లి రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.










