Mar 03,2022 22:47

ఇంఫాల్‌ : మణిపూర్‌ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలకు గురువారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ నెల 5న రెండో దశలో 22 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శనివారం జరిగే ఎన్నికల్లో 8,47,400 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆరు జిల్లాలోని 1247 పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహించే ఈ రెండో దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే, తొలి దశలో ఎన్నికలు జరిగిన 12 పోలింగ్‌ స్టేషన్లల్లో ఈ నెల 5న రీపోలింగ్‌ నిర్వహించాలని ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మణిపూర్‌ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజేష్‌ అగర్వాల్‌ గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28న 38 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇవిఎంలు పనిచేయకపోవడంతోనే 5 నియోజవర్గాల్లోని 12 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అగర్వాల్‌ తెలిపారు.