మనసున్న మారాజులు
పాతగుంటలో నిరూపితమైన వైనం
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : మానవత్వం పరిమళించింది.... మంచితనం ఇంకా బతికేఉందని పాతగుంటవాసులు నిరూపించారు. సాధారణంగా మనషి చనిపోతే అద్దె ఇంట్లో ఉంచడానికి ఆక్షేపించే కాలమిది. బయట చనిపోతే శవాన్ని ఊర్లోకి కూడా రానివ్వని కఠిన మనస్కులను మనం ఎందరినో చూశాం. అయితే అందరూ మనుషులేనని పాతగుంట గ్రామస్తులు చాటుకున్నారు. భూమిలేని ఓ నిరుపేద సోమవారం మృతిచెందాడు. తన భూమిని స్మశానంగా మార్చుకోడానికి ఓ రైతు ముందుకొచ్చారు. ఆ ఊరిలో ఓ రైతే కాదు, అందరూ అలానే ఉన్నారా? అనిపించింది. ఈ మంచిమనుష్యుల మానవత్వాన్ని సమాజానికి చాటి చెప్పే ప్రయత్నం 'ప్రజాశక్తి' తీసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పాతగుంటలో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన (బిసి) వెంకటేష్ ఆచారి (61) అలియాస్ బిల్లాచారి అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున ఇంటి వద్ద తుదిశ్వాస వదిలారు. అతనికి ఇద్దరు కొడుకులు. జీవనం నిమిత్తం తిరుపతిలో సెటిలయ్యారు. వెంకటేష్ ఆచారి, అతని భార్య సొంతూరులోనే కొయ్యపని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందాడు. కొడుకులు, బంధువుల కంటే ఆ ఊరి జనం మానవత్వం చాటారు. ఆ ఊరిలో 'రెడ్డి' సామాజికవర్గానికి చెందినవారు ఎక్కువ. వెంకటేష్ ఆచారి చనిపోయిన వెంటనే బంధువులందరికీ తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అంత్యక్రియలు జరిగితే వచ్చే బంధువుల కోసం ఊరంతా చందాలు వేసుకుని వంట చేశారు. దళితులు చనిపోతే తమ పొలాల వైపు కూడా వెళ్లకూడదని పెత్తందారులు అడ్డుకుని దాడిచేసుకుని కోర్టుకెళ్లిన వైనం మనకు తెలుసు. ఆ ఊరిలో అలా లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరు చనిపోయినా తమ పొలాలను స్మశానంగా అవకాశమిస్తున్నారు. పంట ముఖ్యం కాదని, మనుష్యులు ముఖ్యమని పొలం లేని నిరుపేదలకు ఆ ఊరి వాసులు తమ పొలాల్లో పూడ్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అలాంటి ఘటన పాతగుంటలో వెలుగుచూసింది.
మా ఊళ్లో స్మశానం 5 కిలోమీటర్లు : వెంకటేష్‌రెడ్డి, పాతగుంట
మా ఊళ్లో స్మశానం ఉంది. అయితే ఐదు కిలోమీటర్ల దూరం పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం దారి కల్పించలేదు. ఏ కులమైనా సరే మా మధ్య పెరిగారు కాబట్టి మానవత్వంతో వ్యవహరిస్తాం. ఎవరు పోయినా ఊరంతా కన్నీరవుతుంది. మా పొలంలో పూడ్చుకుంటే మా అదృష్టంగా భావిస్తాం. మా బిడ్డలు బాగుంటారని మా నమ్మకం. పొలం లేని నిరుపేదలు ఎవరు చనిపోయినా మాపొలాల్లో పూడ్చుకునేందుకు అవకాశం ఇస్తాం.
అదృష్టంగా భావిస్తున్నా : ఆనందరెడ్డి, పాతగుంట
పాతగుంటలో సోమవారం చనిపోయిన వెంకటేష్ ఆచారి అంత్యక్రియలను మా పంట పొలంలోనే పూడ్చుకోవాలని అవకాశం ఇచ్చాను. కులపరంగా మేం రెడ్డి అయినా, అతను ఆచారి అయినా మాకు బేధభావం లేదు. మా పొలంలో పూడ్చుకున్నందుకు వెంకటేష్ ఆచారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పొలంలో మరో పది రోజుల్లో వేరుశనగ పంట చేతికొస్తుంది. అయినా అవకాశం ఇచ్చాం.
స్మశానం కోసం గలాటాలు చూశా : సరస్వతి, తిరుపతి వైకుంఠపురం
ఎవరైనా చనిపోతే నా భర్త గంట ఊదేవాడు. నా భర్త వృద్ధుడు కావడంతో ఆ వృత్తిని నేను ఎంచుకున్నా. చనిపోయి మనిషి దూరమయ్యాడని కుటుంబసభ్యులు బాధపడుతుంటే, సక్రమంగా అంత్యక్రియలు జరిగేది తక్కువ. అద్దె ఇంట్లో శవం ఉంచరాదని, మా ఇంటి ముందు, పొలం వైపు శవాన్ని తీసుకెళ్లరాదని చూశాను. ఈ ఊరు చాలా ఆదర్శంగా ఉంది. బీడు పొలాలే కాకుండా, రైతులు పండించే పొలాల్లో రైతులు ముందుకు రావడం ఆదర్శనీయం.
మాకే కాదు : బొల్లెమ్మ, పాతగుంట
చనిపోయింది మా దగ్గర అన్నయ్య. మాకు సెంటు భూమి లేదు. ఎక్కడ పూడ్చాలని బాధపడుతున్నాం. మా ఊరికి చెందిన ఆనందరెడ్డి రైతు తన పొలంలో అవకాశం ఇచ్చారు. చేతులెత్తి మా కుటుంబ సభ్యులంతా దండం పెట్టాం. ఒక్క వెంకటేష్ ఆచారే కాదు, సెంటు భూమిలేని దళితులకూ భూమి ఉన్న ఆసాములు పెద్ద మనస్సుతో వ్యవహరించారు.










