ప్రధాని 'మన్ కీ బాత్' కబుర్లను వినేందుకు తొలి నెలల్లో చాలా మంది ఆసక్తిని ప్రదర్శించారు. ఇప్పుడు కూడా వింటున్నవారు ఉండవచ్చు. చివరికి ఇది మామూలు విషయంగా మారింది. అయితే ఆగస్టు 30 నాటి 'మన్ కీ బాత్'ను అభిమానించిన వారి కంటే తిరస్కరించిన వారే ఎక్కువగా ఉండటం ఇప్పుడు సంచలన వార్త. గంట గంటకూ తిరస్కరించిన వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని అధికారిక ఛానల్‌లో అభిప్రాయాలు వెల్లడి చేసే అవకాశాన్నే నిలిపివేయటం మరింత పెద్ద సంచలన వార్త. మీడియాలో దీని మీద అనేక వార్తలు వచ్చాయి. కొన్ని సంస్ధలు కనపడీ కనపడకుండా వార్తలను ఇచ్చాయి. 'లాజికల్ ఇండియన్ డాట్ కామ్' అనే వెబ్‌సైట్ దీని గురించి ప్రచురించిన ఒక కథనం గురించి చూద్దాం. నీట్, జేఈఈ పరీక్షల మీద తలెత్తిన ఆగ్రహం కారణంగా బీజేపీ యూ ట్యూబ్ ఛానల్లో అత్యంత అనిష్టత లేదా అయిష్టత చూపిన వీడియోగా ప్రధాని 'మన్ కీ బాత్' తయారైందనే శీర్షికతో కథనాన్ని వెలువరించింది. దానికి దృష్టాంతంగా విద్యార్థుల ట్వీట్లు కొన్నింటిని ఉటంకించింది.
'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు చెందిన 'ముంబై మిర్రర్' కూడా ప్రముఖంగానే దీన్ని విశ్లేషించింది. 'మన్ కీ బాత్' వీడియో విడుదల అయిన 24 గంటల తరువాత వివరాలను చూస్తే బిజెపి ఛానల్‌లో 79 వేల మంది ఇష్టత చూపారని, 5.34 లక్షల మంది అయిష్టత చూపారని పేర్కొన్నది. ప్రధాన మంత్రి అధికారిక యూ ట్యూబ్ ఛానల్లో 39 వేల మంది ఇష్టత, 85 వేల మంది అయిష్టత చూపారని పేర్కొన్నది. సోమవారం రాత్రి పది గంటల సమయానికి బిజెపి ఛానల్లో 29 లక్షల మంది చూస్తే వారిలో అభిమానించిన వారు 1.2 లక్షలు, అయిష్టత వ్యక్తం చేసిన వారు 7.4 లక్షలని 'ది ప్రింట్' తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి సోమవార మంతా బీజేపీ అభిమానులు పని కట్టుకొని అభిమానం వ్యక్తం చేసిన తరువాత పరిస్థితి ఇది అని గమనించాలి.
ఇక వ్యాఖ్యల విషయానికి వస్తే మచ్చుకు కొన్ని చూద్దాం. 'ప్రియమైన ప్రధాని గారూ...మీరు జేఈఈ, నీట్ గురించి మాట్లాడతారని నేను అనుకున్నాను. నాకు ఒక సంవత్సరాన్ని వృధా చేసినందుకు కతజ్ఞతలు'' అని లాజికల్ ఇండియన్ పేర్కొన్నది. '2019లో నా కుటుంబం ఆయనకు ఎందుకు ఓటు చేసిందా అని ఇప్పుడు నేను విచారిస్తున్నాను. ఇంత హీనమైన ప్రధానిని ఎన్నడూ చూడలేదు. హెచ్‌ఆర్‌డీ మంత్రి 80 శాతం మంది విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారని చెబుతున్నారు. దీని అర్ధం మేము పరీక్షలను కోరుకుంటున్నామని కాదు. ఈ మనిషికి నేను మరోసారి ఓటు వేయను' అని కిరణ్ మోరే అనే విద్యార్థి ట్వీట్ చేసినట్లు 'ముంబై మిర్రర్' పేర్కొన్నది. 'మీరు నా దేశాన్ని నాశనం చేశారు. మీ పార్టీకి ఓటు వేసినందుకు ప్రతిక్షణం విచారిస్తాం. నా జీవిత కాలంలో ఈ కుహనా నటుడ్ని సమర్ధించను', 'కుర్రాళ్లూ...ఈ ఏడాదిని ఎన్నడూ మరిచి పోవద్దు. మోడీ ప్రభుత్వం 30 లక్షల మంది విద్యార్థుల ఆర్తనాదాలను, డిమాండ్లను ఎలా అణచివేసిందో కూడా మరవ వద్దు.2024లో మనమేమిటో చూపాలి' అన్న ట్వీట్లను కూడా 'ముంబై మిర్రర్' ప్రచురించింది. ప్రధాని తన మనసులోని మాటలో లక్షలాది మంది విద్యార్థులు, వారి తలిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోలేదన్నది పైన పేర్కొన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థుల్లో ఆగ్రహం కారణంగా ఇలాంటి స్పందన వచ్చిందని ఇదేదో తాత్కాలికం అన్నట్లుగా చిత్రించే యత్నం కనిపించింది. విద్యార్థులైనా మరొకరైనా బీజేపీ, మోడీ అధికారిక చానళ్లలో ఖాతాదారులుగా చేరిన వారు మోడీ అభిమానులే కదా! అదైనా నరేంద్ర మోడీకి ప్రతికూల స్పందనే కదా! ఈ స్పందనతో బీజేపీ నేతల మైండ్ బ్లాంక్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే కాస్త బాణీ మార్చారు. మోడీ వీడియో మీద అయిష్టతకు కారణం కాంగ్రెస్ అన్నారు. అధికార ప్రతిపక్ష స్ధాయి కూడా లేని కాంగ్రెస్‌కు అంత పలుకుబడి ఉందా లేక నరేంద్ర మోడీ వెలుగు ఆరిపోతోందా? అభిప్రాయాలను ఇలా తారుమారు చేయటం సాధ్యం అయితే గతంలో బిజెపి కూడా నరేంద్ర మోడీకి అనుకూలంగా అదే పని చేసినట్లే కదా!
సామాజిక మాధ్యమాల్లో బిజెపి కి మద్దతు బండారం ఏమిటో అమెరికా పత్రిక 'వాల్‌స్ట్రీట్ జర్నల్' బయట పెట్టింది. తాజాగా మరికొన్ని వివరాలను వెల్లడించింది. బిజెపి కి 2014 ఎన్నికల్లో తాము ప్రచారం చేశామని ఫేస్‌బుక్ భారత అధికారిణి అంఖీదాస్ పేర్కొన్న విషయాన్ని 'వాల్‌స్ట్రీట్ జర్నల్' ఆగస్టు 30 వ తేదీ వార్తలో పేర్కొన్నది. బీజేపీ రాజకీయవేత్తలు, వ్యక్తిగతంగా హిందూ మతవాదులు, బృందాల విద్వేష ప్రచారానికి నిబంధనల ఉల్లంఘన నిబంధనను పాటించవద్దని తమ సిబ్బందికి అంఖీదాస్ ఆదేశాలు ఇచ్చినట్టు గతంలో అదే పత్రిక వెల్లడించింది. మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకు నిబంధనల ఉల్లంఘన రూల్స్‌ను వర్తింపచేస్తే ఫేస్‌బుక్ వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయి కనుక చూసీ చూడనట్లు వ్యవహరించాలని ఆమె అదేశించినట్లు బయట పడింది. అదలా ఉంచితే, ఆగస్టు నెల 'మనసులోని మాట''లో మోడీ చెప్పిందేమిటి? సెప్టెంబర్‌ను పోషకాహార నెలగా పరిగణిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సుభాషితం చెప్పారు.
ప్రపంచ ఆకలి సూచిక 2019లో ప్రపంచం లోని 117 దేశాలలో మన దేశం 102వ స్ధానంలో ఉంది. నరేంద్ర మోడీ గారి మంచి రోజులు ప్రారంభమైన ఐదు సంవత్సరాల తరువాత ఉన్న పరిస్ధితి ఇది. ఆరు నుంచి 23 నెలల వయస్సు ఉన్న పిల్లల్లో కేవలం పది శాతం మందికి మాత్రమే కనీసంగా పెట్టాల్సిన ఆహారం అందుబాటులో ఉన్నది. 1991లో ఆహార లభ్యత తలకు 186.2 కిలోలు కాగా 2016లో 177.9 కిలోలకు తగ్గింది. 2015లో చైనాలో 450 కిలోలు, బంగ్లాదేశ్‌లో 200 కిలోలు, అమెరికాలో 1,100 కిలోలు ఉంది. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్ధ సమాచారం ప్రకారం కూరగాయల వినియోగంలో 2017లో చైనా సగటున ప్రతి ఒక్కరూ 377 కిలోలతో ప్రపంచంలోనే అగ్రస్ధానంలో ఉండగా మన దేశంలో 79.86 కిలోల వినియోగం ఉంది. ఈ స్ధితిలో ఒక నెలను పోషకాహార మాసంగా ప్రకటించటం ఏమిటి ?
ప్రధాని నోటి నుంచి మరొక ఆణిముత్యం 'కుక్కలను, అదీ దేశీయ జాతులను పెంచండి' అని. ఒక వైపు దేశ ఆర్థిక వ్యవస్ధ ఎంతగా దిగజారనుందో ప్రభుత్వం లెక్కలు ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు ప్రధాని నోటి నుంచి ఇలాంటి సందేశం రావటంతో జనం విస్తుపోతున్నారు. దేశంలో ఎలుకలు రైతుల పంట పొలాల్లో తరువాత గోదాముల్లో ఆహార ధాన్యాలను ఎంత నష్టపరుస్తున్నాయో తెలిసిందే. పది నుంచి 20 శాతం వరకు ఉంటుందంటున్న ఆ నష్టాన్ని అరికట్టేందుకు ఎలుకల నివారణ సాధ్యం కాకపోతే పిల్లులను పెంచాలని పిలుపు ఇచ్చినా ఒక అర్ధం వుంటుంది గానీ కుక్కలను అదీ దేశీయ కుక్కలను పెంచాలనటం ఏమిటో అర్ధం కాదు. కుక్కలు దేశీయమా విదేశీయమా అని కాదు, పోలీసు, మత్తు పదార్ధాలు, ఇతర అవాంఛనీయ కార్యకలాపాలను పసిగడతాయా లేదా అన్నది ముఖ్యం. ఇక్కడ కూడా జాతీయ భావనలను చొప్పిస్తున్నారా?
కరోనా నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకొని అత్యవసరమైన వాటికే ఖర్చు చేస్తున్నారని ప్రపంచం నలుమూలల నుంచి వార్తలు వస్తున్న సమయంలో ప్రపంచం కోసం బొమ్మలను తయారు చేయాలని, మార్కెట్‌ను సొంతం చేసుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. వాటిని కొనుగోలు చేసేవారు ఉండాలి కదా! బొమ్మల కంటే సెల్‌ఫోన్ల మార్కెట్ ఎక్కువ, ఇంకా అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ వదలి ప్రధాని ఒక్క బొమ్మల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమే. బొమ్మలైనా, మరొకటైనా తయారు చేయవద్దని గత ఆరు సంవత్సరాలలో మన దేశంలోని వారిని ఎవరు అడ్డుకున్నారు. అదేమీ కొత్తగా పెరుగుతున్న మార్కెట్ కాదే! నిజంగా అలాంటి మార్కెట్, ఎగుమతి అవకాశాలు ఉంటే మన దేశంలోని తయారీదారులు ప్రధాని పిలుపు ఇచ్చే వరకు ఆగుతారా?
కరోనాకు ముందు, కరోనా సమయంలో, తరువాత కూడా తమ ప్రభుత్వం చేయబోయే పనుల గురించి నరేంద్ర మోడీ, మంత్రులు ఎన్నడూ దాచుకోలేదు. రైళ్లు, విమానాశ్రయాలు, బ్యాంకులు, బీమా, చమురు సంస్ధలు, గనులు, ప్రభుత్వ రంగ సంస్ధలు, ఇలా ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రతిదానిని ప్రయివేటీకరణ చేయటం గురించి నిరంతరం చెబుతూనే ఉన్నారు. వీటన్నింటినీ వదిలించుకున్న తరువాత నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు ఇంక చేసేదేమి ఉంటుంది? ఆరేళ్ల క్రితం ఒకసారి, ఏడాది క్రితం మరోసారి అధికారం కావాలని నరేంద్ర మోడీ ప్రజలను కోరింది దేనికి? ప్రజలు ఆయనను చూసి దేనికి ఓటు వేశారు? ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ లేదా ప్రధాన సమస్యలను వదలి ఇలాంటి కబుర్లను 'మన్ కీ బాత్'లో చెబితే వినటానికి సిద్ధంగా లేరనేందుకు తాజా 'మన్ కీ బాత్' వీడియోపై వెల్లడైన వ్యతిరేక స్పందన ఒక సూచిక.
* ఎం. కోటేశ్వరరావు (వ్యాసకర్త సెల్: 8331013288)










