ప్రజాశక్తి-నెల్లూరు :ఇటీవల గుండెపోటుకు మృతి చెందిన ఆటో కార్మికుడు ఎం.మనోహర్‌రాజుకు జిల్లా ఆటో కార్మిక సంఘం ఘన నివాళి అర్పించింది. ఆదివారం అయ్యప్పగుడి సెంటర్‌లోని ఆటో స్టాండ్ ప్రాంతంలో మనోహర్ మృతికి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య, సిఐటియు రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు కొండా ప్రసాద్, కిన్నెర కుమార్‌లు మాట్లాడుతూ మనోహర్ సేవలను కొనియాడారు. మృతుడికి తల్లి తప్ప బంధువులు ఎవ్వరూ లేని పరిస్థితి కావడంతో అయ్యప్పగుడి సెంటర్ ఆటో కార్మికులు, హౌసింగ్ బోర్డు ఆటో కార్మికులు ఆత్మీయులై అంతిమ సంస్కారాలు నిర్వహించారన్నారు. అంతే కాకుండా మృతుడి ఇంటి వద్ద కర్మక్రతువులు సైతం ఆటో కార్మికులే నిర్వహిం చారన్నారు. ఈ సంతాప సభలో ఆటో యూనియన్ నాయకులు దేవతాటి సంపత్ కుమార్ , ఎం సుధాకర్ , భవన నిర్మాణ కార్మిక సంఘం రూరల్ కార్యదర్శి ఎస్‌కె ఖలీల్ ,పులిమి నరసింహారెడ్డి , స్థానిక కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, శంకర్, పలువురు కార్మికులు పాల్గొన్నారు.










