మన్నవరం పాయే..!
ఎస్‌ఎస్
కెనాల్ రాదాయె..!
జగనన్న పాదయాత్ర హామీలు హుళక్కేనా..!
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
ప్రజా సమస్యలను ప్రజా క్షేత్రంలోనే తెలుసుకునేందుకు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2018లో ప్రజాసంకల్ప యాత్ర చేపట్టారు..' ఒక్క ఛాన్స్' పేరిట 2019లో అత్యధిక సీట్లతో అధికారాన్ని చేపట్టారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 2018 జనవరి 21వ తేదీన శ్రీకాళహస్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికగా రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, ప్రజలనుద్ధేశించి ఎన్నో హామీలను ఇచ్చారు..అయితే అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిపోతున్నా ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు. రాయలసీమ జిల్లాలకు వరమైన భెల్ మోగనే లేదు..! తూర్పు మండలాలను సస్యశ్యామలం చేసే ఎస్‌స్‌కెనాల్ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి..గాలేరు-నగరి పనులు ముందుకు కదల్లేదు..సీపీఎస్ కాస్త జీపీఎస్ అయ్యింది..నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి..ముట్టుకోకనే కరెంట్‌్ బిల్లులు షాక్ కొడుతున్న పరిస్థితి.
తండ్రి కల కల్లేనా..!
రాయలసీమ జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోటీ పడి మరీ మన్నవరం భెల్ పరిశ్రమను ఏపీకి వచ్చేలా చేశారు అప్పటి ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్‌రెడ్డి. మొదట్లో కడపలో పెట్టాలని డిమాండ్లు వచ్చినా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి-వెంకటగిరి మార్గంలోని మన్నవరం అనుకూలంగా ఉండటంతో ఇక్కడికి తరలించారు. ఈ నేపథ్యంలో 2010 సెప్టెంబర్ 1వ తేదీన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరం వద్ద భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ పరిశ్రమ బెల్‌కు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు. రెండు దశల్లో పరిశ్రమను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లు నిధులు కేటాయించింది. పరిశ్రమలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా 6 వేల ఉద్యోగాలు, పరోక్షంగా 10 వేల ఉద్యోగాలను కల్పించాలన్నది ముఖ్య ఉద్దేశం. అయితే ఆరంభంలో పనులు కాస్త జోరుగానే సాగినా..'రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్లు' పనులు అటకెక్కాయి. అయితే 2018లో శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభనుద్దేశించి మన్నవరం పరిశ్రమ ముందుకెళ్లకపోవడంపై అప్పటి టీడీపీ ప్రభుత్వంపై జగన్ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మన్నవరం పరిశ్రమ తనతండ్రి కలగా చెప్పుకున్నారు. టీడీపీ, బీజేపీలు నిధులు రానివ్వకుండా నీరుగార్చారంటూ ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే కేంద్రంతో కొట్లాడి పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మరి అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు గడిచిపోతున్నా హామీ సంగతేమైనట్లో జగన్‌కే ఎరుక మరి. ఇదిలా ఉంటే మన్నవరం పరిశ్రమను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గుజరాత్‌కు తరలించేసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
సా..గుతన్న ఎస్‌ఎస్ కెనాల్
తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు సాగునీరు.. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజవకర్గాల ప్రజలకు తాగునీరు అందించే సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాల్వ పరిస్థితి దారుణంగా మారింది. రూ.350 కోట్ల రూపాయల అంచనాలతో సోమశిల-స్వర్ణముఖి కాలువ నిర్మాణాలు ప్రారంభించి, దాదాపు 220 కోట్ల మేర ఖర్చుపెట్టి కొంత మేర నిర్మాణాలు పూర్తిచేసి నీటిని విడుదల చేశారు. సుమారు 70 శాతం మేర పనులు పూర్తయ్యాయి. జిల్లాలోని రాపూరు, డక్కలి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లోని లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సోమశిల - స్వర్ణముఖికాలువ పనులు చేపట్టారు. ఈ కాలువ నుంచే పరిసర ప్రాంతాల జలాశయాలను నింపి 140 గ్రామాలకు తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. సోమశిల - స్వర్ణముఖి కాలువ ఏర్పాటుకు అవసరమైన భూములు సేకరించినా, పరిహారం పంపిణీలో తీవ్ర ఆలస్యం అవుతోంది. ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో పరిహారం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాదయాత్ర సమయంలో కాలువ నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జగన్ నాలుగున్నరేళ్లు గడచినా ఎలాంటి పరిష్కారం చూపలేదనీ, కనీసం నిర్వహణకు నిధులు విడదల చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాలువ నిర్మాణాలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
అదేవిధంగా గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు 80 శాతం పూర్తయినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో అవికూడా ముందుకెళ్లని పరిస్థితి ఏర్పడింది.
షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు
కరెంట్ ముట్టుకోకనే షాక్ కొట్టే పరిస్థితి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో నెలకొన్నాయి. యూజర్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలంటే ప్రజలపై ఎడాపెడా విద్యుత్ భారాలు మోపుతున్న పరిస్థితి. ఏ నెలకు ఎంత కరెంట్ ఛార్జీ కట్టాలో సామాన్యులకు అర్థం కాని పరిస్థితి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరిచారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేతగా జగన్ శ్రీకాహస్తి బహిరంగ సభలో ప్రస్తావించారు. తానొస్తే కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాలుగున్నరేళ్లకాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడిని ఏకంగా కోలుకోనీయకుండా చేసింది. నెల బిల్లు రూ.500 వచ్చే వారికి రూ.1500, వెయ్యి వచ్చే వారికి రూ.2 వేలు ఇలా మూడింతల మేర విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయిన పరిస్థితి. తాకకుండానే బిల్లులు షాక్ కొట్టే పరిస్థితి నెలకొంది. ఇక నిత్యావసర ధరల పరిస్థితి చెప్పనలివి కాదు. నాలుగేళ్ల జగన్ పాలనలో అన్ని ధరలు కొండెక్కి కూర్చున్నాయే తప్ప కొండ దిగిన దాఖలాలు లేవు.
సీపీఎస్ కాస్త జీపీఎస్
ఒక్క అవకాశం పేరిట అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదటగా ఓట్లేసిన వారిలో ఉద్యోగులు ముందుంటారు. ప్రతిపక్షన నేతగా జగన్ వారికిచ్చిన ఓపీఎస్ హామీనే ఇందుకు కారణం. తాను అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌కు గ్రీన్ సిగల్ ఇస్తానని శ్రీకాళహస్తి సభ వేదికగా జగన్ హామీ ఇచ్చారు.సీపీఎస్ రద్దు-ఓపీఎస్ అమలును ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన జగన్ సర్కార్ నాలుగేళ్ల తర్వాత జీపీఎస్ అంటూ కొత్త పల్లవి అందుకోవడంతో అవాక్కవ్వడం ఉద్యోగులవంతైంది.










