- చెదురుమదురుగా ఘర్షణలు
- పోలింగ్ సిబ్బంది ఒకరు మృతి
ఇంఫాల్ : మణిపూర్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల్లో సోమవారం సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 78.03శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడా చెదురుమదురుగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చర్చందాపూర్ జిల్లా తిపారుముఖ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులకు హాజరైన రాష్ట్ర పోలీసు సిబ్బందిలో ఒకరైన నరోమ్ ఇబచౌబా ప్రమాదవశాత్తూ జరిగిన కాల్పుల్లో మరణించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ అగర్వాల్ చెప్పారు. కాంగ్‌పోక్పి జిల్లాలో అత్యధికంగా 82.97శాతం పోలింగ్ నమోదవగా, ఇంఫాల్ వెస్ట్‌లో 82.19, ఇంపాల్ ఈస్ట్‌లో 76.64, చర్చాందాపూర్‌లో 74.45శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. 38 నియోజకవర్గాల్లోని1721 పోలింగ్ స్టేషన్లలో మొత్తమ్మీద ప్రశాంతంగానే పోలింగ్ జరిగిందని అగర్వాల్ తెలిపారు. అక్కడక్కడా కొనిు సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. మూడు నియోజకవర్గాల్లో ఇవిఎంలను ధ్వంసం చేశారు, ఏడు పోలింగ్ స్టేషన్లలో ఇవిఎంల ధ్వంసానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కొన్నిచోట్ల పోలింగ్ సరళి మందకొడిగా సాగిందని చెప్పారు. చర్చందాపూర్ జిల్లాలో రెండు రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలో ఒకరు గాయపడ్డాడు. ఇంఫాల్ వెస్ట్‌లో ఎన్‌సిపి అభ్యర్థి వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కాంగ్‌పోక్పి జిల్లాలో బూత్ స్వాధీనానికి ప్రయత్నించారంటూ కాంగ్రెస్, బిజెపిని విమర్శించింది. ఆ నేపథ్యంలో జనాలను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు ఒక చోట గాల్లోకి కాల్పులు జరిపాయి.
ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, స్పీకర్‌లతో సహా పలువురు ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. 2017 ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీల మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తోంది.










