''ఆజ్ కీ రాత్ పియా, దిల్ నా తోడో, మన్ కీ బాత్ పియా మాన్‌లో'' అంటూ ఎప్పుడో దశాబ్దాల క్రితం గీతా దత్ పాడిన హిందీ పాట టీవీలో వస్తోంది. సుబ్బారావు మంచం మీద పడుకుని కులాసాగా పాటలు వింటున్నవాడల్లా ఒక్కసారి దిగ్గున లేచాడు. ''ఏమైందండీ?'' అని ఆ పక్కనే కూచున్న భార్య సుబ్బలక్ష్మి ఆందోళన పడుతూ అడిగింది. ''ఏమీ లేదులే'' అని చెప్పేసి గబగబా తన షర్టు వేసుకుని కిందకి వెళిపోయేడు సుబ్బారావు. అతగాడు ఆ అపార్టుమెంట్ అసోసియేషన్ సెక్రటరీ.
మర్నాడు సాయంత్రం అపార్టుమెంట్స్‌లోని మహిళల సమావేశం జరిగింది. సుబ్బారావు ముఖ్యఅతిథి. మన్‌కీ బాత్‌లో తాజాగా మోడీజీ మన దేశంలోని బొమ్మల తయారీ కళ విశిష్టత గురించి చెప్పినదంతా ఆ మహిళలకి వివరించేడు. అదేదో తన మనసులోంచి వచ్చిన మాటే అన్నంతగా బాగా ఉత్తేజపడిపోయి మరీ చెప్పేడు. మొత్తానికి హాజరైన మహిళలకి ఒక విషయం అర్ధం అయింది. సెక్రటరీగారు మనల్ని అర్జెంటుగా ఓ బొమ్మల కొలువు పెట్టమంటు న్నాడు అని వారంతా గ్రహించారు. ''సరే, ఇక ఆ విషయం మాకొదిలేయండి. ఇంతకీ మీరు దానిని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఎవరిని పిలుస్తారు?'' అని సుబ్బారావుని ఆరా తీశారు. ''ఇంకెవరిని? ఆన్‌లైన్‌లో కాబట్టి మోడీజీనే పిలుస్తాం. ఆయనను ఒప్పించే పని నాకొదిలెయ్యండి'' అన్నాడు ఇటీవలే మోడీ భక్తశ్రేణిలో చేరిన సుబ్బారావు.
అపార్టుమెంటు సెల్లార్ అంతా ఖాళీ చేసేశారు. ఆ సెల్లార్ అంతా బూజులు దులిపారు. రంగులు వేశారు. మహిళలు రంగవల్లులు తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఎక్కడెక్కడ, ఎవరెవరి ఇళ్ళల్లో, ఏయే అటకలమీద బొమ్మలు ఉన్నాయో వాటన్నింటినీ కిందకి దించారు. వాటిలో బాగున్నవాటిని ఎంపిక చేశారు. సీనియర్ మహిళలు రంగంలోకి దిగారు. బొమ్మల కొలువు అంటే తెలియని కొత్త జనరేషన్ అమ్మాయిలకి బోధపరిచారు. కరోనా దెబ్బకి ఇళ్ళకే అతుక్కుపోయిన యువ మహిళలకందరికీ ఇదొక ఆటవిడుపు కార్యక్రమం అయింది. ఎంతైనా మోడీజీ తో ముడిపడి వుంది గనుక మన హడావిడిని ఎవరూ ప్రశ్నించరు అన్న ధీమా కూడా తోడైంది.
తేదీ ఖరారైంది. మొత్తానికి సుబ్బారావు సాధించేడు. మోడీజీ ఆన్‌లైన్‌లో ఈ బొమ్మల కొలువును ప్రారంభించడానికి ''దయతో'' అంగీకరించారని అపార్టుమెంటు వాసులకు మాత్రమే గాక, ఊరిలోని పెద్దలకు, రాజకీయ నాయకులకు (కమ్యూనిస్టులకు మాత్రం మినహాయింపు, అలాగే పౌర హక్కుల వారికి, కొంతమంది మాతృభాషాభిమానులకు, సెక్యులరిస్టులకు కూడా మినహాయింపే) ముఖ్యంగా పోలీసువారికి, జిల్లా కలెక్టరుదొరవారికి చెప్పాడు. దాంతో సుబ్బారావు తాత్కాలికంగానైనా హోదా పెంచుకున్నవాడయ్యేడు.
తెల్లారితే బొమ్మల కొలువు ప్రారంభోత్సవం. సుబ్బారావు మాంఛి ఊపుమీదున్నాడు. వీధి వీధంతా కాషాయ జెండాలు కట్టించేడు. తెలియని కొందరు బహుశా ఎవరైనా స్వామీజీ వస్తున్నారేమో అనుకున్నారు. అది విన్న మరికొందరు (వీరు బొత్తిగా ఆచరణాత్మకవాదులు లెండి) ''అయితే మనం ప్రసాదం పంచిపెట్టే టైముకి హాజరవుదాం'' అని ప్లాను కూడా చేసేసుకున్నారు. ఆ వీధికి అటు, ఇటు ఉన్న వీధుల్లో తాత్కాలికంగా రోడ్ల మీద అరటిపళ్ళూ, కొబ్బరికాయలు, అగరొత్తులు అమ్మే దుకాణాలు కూడా వెలిశాయి. దూరదృష్టి ఉన్న కొందరు పాత్రికేయులైతే ''ఈ మారు ఫలానా వార్డులో కార్పొరేటర్ గా సుబ్బారావుకి గనుక టిక్కెట్టు ఇస్తే గెలుపు ఖాయం'' అని వ్యాఖ్యానాలు రాసేశారు కూడా.
ఆ రోజు రాత్రి సెల్లార్ లో మహిళలనందరినీ సమావేశపరిచాడు సుబ్బారావు. మర్నాడు ఎవరెవరు ఏయే పాత్రలు పోషించాలో (కొందరు పరాకున ఉన్న మహిళలు ఇక్కడ కూడా పాత్రలుతోమే పని మాకేనా? అని ఎదురు తిరిగారు. అయితే సహనశీలి సుబ్బారావు వారికి పాత్రలు అన్న పదానికి గల నానార్ధాలను వివరించేసరికి వారంతా శాంతించారనుకోండి) స్పష్టం చేసేడు. అంతా రెడీ.
జాగ్రత్తపరుడు మన సుబ్బారావు. అందుకే ఎందుకైనా మంచిదని అన్ని ఏర్పాట్లనూ తిరిగి మరోమారు పరిశీలించేడు. అప్పుడే అతడికి అసలు బొమ్మల కొలువులో ఏయే బొమ్మలు పెట్టారో చూడనేలేదని గుర్తొచ్చింది. బొమ్మలమీద కప్పివుంచిన తెరలన్నింటినీ జాగ్రత్తగా తప్పించి చూపించమని ఆ మహిళలను అడిగేడు. వాళ్ళు అలాగే చేశారు. సుబ్బారావు గుండె గుభేలుమంది. ఆ బొమ్మలకొలువులో పెట్టకూడని బొమ్మలన్నీ ఉన్నాయి! మరీ అన్యాయం! జాతీయోద్యమ నాయకుల బొమ్మలన్నీ పెట్టేశారు. ''ఏమిటిది? ఎందుకిలా చేశారు? ఏమిటీ బొమ్మలు?'' అని గర్జించాడు. బిత్తరపోయిన మహిళలు తాము ఇదంతా తమ సీనియర్ల గైడెన్సులో చేశామన్నారు. ఆ సీనియర్లు వచ్చి ''మా తరంలో బొమ్మల కొలువంటే జాతీయోద్యమం గురించి, జాతీయ నాయకుల గురించి వివరించే బొమ్మలు తప్పనిసరిగా ఉండాల్సిందే అని చెప్పేవారు. పిల్లలకు దేశభక్తి అంటే సులువుగా బోధపడడానికి ఇదొక మార్గం అని చెప్పేవారు. ఇదిగో, మళ్ళీ మోడీజీ వచ్చాక రోజూ దేశభక్తి గురించి వింటున్నాం. అందుకే స్పెషల్‌గా దేశభక్తి థీమ్‌తో ఈ బొమ్మల కొలువుని ప్లాను చేశాం. ఏమిటి నీకొచ్చిన ఇబ్బంది?'' అని సుబ్బారావుని నిలదీశారు. సుబ్బారావు గుండెల్లో రాయి పడింది. కట్టుకున్న ఆశా సౌధాలన్నీ కూలిపోతున్న ఫీలింగ్. అక్కడే కూలబడ్డాడు.
అంతా చుట్టూ చేరి అడిగేరు ఏమైందని. ''ఆ గాంధీ, నెహ్రూ బొమ్మలేమిటి? నేతాజీ బొమ్మ ఏమిటి? భగత్‌సింగ్ బొమ్మ ఏమిటి?'' వాళ్ళు లేకుండా జాతీయోద్యమం ఏమిటని మహిళలు ఎదురు ప్రశ్నించేరు. ''పిల్లల్ని పాలిచ్చి సాకే జిజియాబాయి బొమ్మ పెట్టాలిగాని ఝాన్సీ లక్ష్మీబాయి బొమ్మ ఏమిటి? ఆ అల్లూరి సీతారామ రాజు బొమ్మ ఏమిట''న్నాడు. ''ఆ రామకృష్ణ పరమహంస బొమ్మ ఎందుకు?అతడు అన్ని మతాలూ ఒకటే నన్నాడు, అంచాత తీసెయ్య''మన్నాడు. ఇలా చెప్తూన్న సుబ్బారావుకి ఓ వాస్తవం గుర్తుకొచ్చింది. ''అసలు ఈ జాతీయోద్యమం థీమ్ ఎందుకెంచుకున్నారు? దానిని సిలబస్ లోనే తీసేశారు కదా మోడీజీ?'' అనడిగాడు. జాతీయోద్యమంలో అసలు మోడీజీ పరివారం పాల్గొనలేదని, వాస్తవానికి ఆ కాలమంతా బ్రిటిష్ ప్రభువులకు విశ్వసనీయంగా తోడ్పడ్డారని సుబ్బారావుకి తెలుసు.
తగువు మొదలైంది. జాతీయోద్యమం గురించి బొమ్మలు లేకుండా బొమ్మల కొలువు ఉండదని సదరు బొమ్మల కొలువు తాలూకు ఒరిజినల్ రాజ్యాంగ నిబంధనని పునరుద్ఘాటించారు సీనియర్లు. బ్రిటిష్ వాడి నిర్బంధ కాండను తట్టుకుంటూ ప్రజల్లో జాతీయోద్యమ భావాలను ప్రచారం చేయడానికి అవలంబించిన ఎత్తుగడలో భాగంగా బొమ్మల కొలువులు ప్రారంభం అయిన వైనాన్ని గుర్తు చేశారు. అంచేత దానికి భిన్నంగా వ్యవహరించడం కుదరదని స్పష్టం చేసి నిరసనగా వాకౌట్ చేశారు. హమ్మయ్య అనుకున్నాడు సుబ్బారావు. మర్నాడు ఫంక్షన్‌లో దీపం వెలిగించే దగ్గర పక్కనే పట్టుచీరె సింగారించుకుని నిలబడే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన పద్మావతిని పిలిచాడు. ఏదో ఒకటి చేసి మర్నాడు తనకు మోడీజీ దగ్గర మాట రాకుండా చూడాలని రిక్వెస్టు చేశాడు, ప్రాధేయపడ్డాడు (కాదు, కాదు, కాళ్ళే పట్టుకుని ఏడ్చాడు అని అభిజ్ఞవర్గాల భోగట్టా). పద్మావతి సుబ్బారావుకు హామీ ఇచ్చింది. ధైర్యంగా పోయి హాయిగా గుండెల మీద చేతులేసుకుని నిద్రపొమ్మనమని భరోసా ఇచ్చింది.
మర్నాడు టీవీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, పాత్రికేయులు, కరోనా నిబంధనలను బేఖాతరు చేసిన అధికారులు అందరూ వచ్చారు. ప్రసాదాల కార్యక్రమం లేదని తెలుసుకున్న ఆచరణాత్మక వాదులు మాత్రం బహిష్కరించారు. సీనియర్ మహిళలను ముందస్తు జాగ్రత్త చర్యల కింద మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులు గృహ నిర్బంధం చేశారని పౌరహక్కుల నాయకులు ప్రకటించారు కాని డిజిపి వెంటనే ఖండించారు.
ముహూర్తం సమీపించింది. మోడీజీ తెరమీద కనిపించగానే అందరూ కేరింతలు కొట్టారు. సుబ్బారావు నేలమీద లేనే లేడు. ఎక్కడికో వెళ్ళిపోయడనే చెప్పాలి. అక్కడ మోడీజీ స్విచ్చి నొక్కగానే ఇక్కడ బొమ్మలకు, ప్రజలకు మధ్యనున్న తెర తొలగింది. ఒక్కసారి అందరూ అవాక్కయ్యారు! రెండు నిముషాల్లో అక్కడినుంచి అధికారులు, పోలీసులు అందరూ పరార్! సుబ్బారావు ఉన్నచోటే అలాగే కూలబడిపోయేడు. బొమ్మల కొలువులో ఓ రాముడి బొమ్మ, దాని చుట్టూ అన్నీ మోడీ మాస్కులు తగిలించిన రకరకాల బొమ్మలు మాత్రం ఉన్నాయి! ''లాస్ట్ మినిట్ లో మార్పులు చేయడం ఎలా అని ఆలోచిస్తే ఈ అద్భుతమైన ఐడియా వచ్చిందండీ నాకు. దానినే పద్మావతికి చెప్పేను. ఎలా వుంది నా ఐడియా?'' అంటూ సుబ్బలక్ష్మి వచ్చింది. పాపం! ఇంకెక్కడి సుబ్బారావు?
* సుబ్రమణ్యం










