- విదేశాలకు కడప అరటి ఎగుమతులు
- టన్ను ధర రూ.25 వేలు
చాపాడు : మన ప్రాంత అరటి అంతర్జాతీయ మార్కెట్‌లోనూ సత్తా చాటుతోంది. ఎగుమతులను పెంచుకుంటూ రైతులకు భరోసా కల్పిస్తోంది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ కొనుగోలుదారులు, అమ్మకందారులతో ఇప్పటికే ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35 వేల టన్నుల అరటి పండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో అరటి సాగుదారులకు మరింత ప్రయోజనం కలగనుంది. రాష్ట్రంలో 63.84 లక్షల టన్నుల అరటి పండ్లు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో ఒక్క వైఎస్సార్ కడప జిల్లా నుంచే 23,15,300 టన్నుల దిగుబడి వస్తోంది. ఒక్క పులివెందులలోనే 1,100 హెక్టార్లలో అరటి సాగవుతుండగా ఇక్కడి పంటకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు కూడా లబిస్తున్నది. సాధారణంగా అరటి పండ్లు 6, 7 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. మన జిల్లాలో సాగు అయ్యే పండ్లు 14 రోజుల వరకు నిల్వ ఉంటున్నాయని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. టిష్యూకల్చర్ వచ్చాక పండ్లలో నాణ్యత పెరిగిందని సూచిస్తున్నారు. కడప జిల్లాలో సాగైయ్యే అరటిలో 80 శాతం చెన్నై, బెంగళూరు నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో 1,12,995 హెక్టార్లలో అరటి సాగవుతోంది. ఏటా 63,84,730 టన్నుల అరటి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అరటి సాగవుతుండగా విస్తీర్ణం, ఉత్పత్తిలో కడప ప్రథమ స్థానంలో ఉంది. కడప జిల్లాలో పులివెందుల, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గంలో అధికంగా అరటి సాగు అవుతున్నది. మధ్య ప్రాచ్య దేశాలైన యూఏఈ, బెహ్రయిన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్ దేశాల్లో మన అరటికి మంచి డిమాండ్ ఉంది.గ్రీన్ కావెండిష్ ప్రీమియమ్ రకాలు ఆ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2016-17లో 246 టన్నుల అరటి పండ్లు ఎగుమతి కాగా, 2017-18లో 4,300 టన్నులు, 2018-19లో 18,500 మెట్రిక్ టన్నులకు ఎగుమతులు పెరిగాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35 వేల మెట్రిక్ టన్నుల అరటి పండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు మార్కెట్‌ను విస్తరించేందుకు వీలుగా డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ఏడాది కడప జిల్లా పులివెందులలో అరటి పరిశోధనా కేందం ఏర్పాటుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు. దీని కోసం ప్రభుత్వం 70 ఎకరాల భూమిని, పరిశోధనల కోసం 628 ఎకరాల భూమిని కేటాయించింది.
ఇతర రాష్ట్రాలకూ ఆంధ్రా అరటి....
కోస్తా, రాయలసీమలో పండించే అరటి ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్తుంది. దిల్లీ, రాజస్థాన్, ఒడిశా, బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు ఆంధ్రాలో పండించే అరటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని అరటి హౌల్ సేల్ వ్యాపారులు సూచిస్తున్నారు. కడప జిల్లాలో సాగయ్యే అరటి మంచి నాణ్యతతో ఉండటంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో దీనికి బాగా డిమాండ్ ఉంది. మార్కెట్ సీజన్ల వారీగా ఉంటుంది. జులై నుంచి నవంబర్ వరకూ రేటు బాగా పలుకుతుంది. వేసవిలో మార్కెట్ సాధారణంగా ఉంటుంది. విదేశాలకు ఎగుమతిని చేసే అరటికి సాగు దశలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు తగినట్లుగా ఏపీ రైతులు వ్యవహరిస్తున్నారు. సౌదీ, దుబారు వంటి దేశాలకు అరటి ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంటుదని వ్యాపారులు పేర్కొంటున్నారు.
సబ్సిడీలు దక్కడం లేదు..
అరటి సాగు చేసే వారిలో సాధారణ రైతాంగం ఎక్కువగా ఉంటున్నారు. అయితే ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు, వివిధ పథకాలు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలకు, ఇతర ఎగుమతిదారులకు ఉపయోగపడుతున్నాయి తప్ప సామాన్య రైతులకు పెద్దగా ప్రయోజనం దక్కడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. అరటి పంట వాతావరణ మార్పుల మీద ఆధారపడి ఉంటుందని, గాలుల తీవ్రత ఎక్కువైతే పంట మీద ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. పంట కాపాడుకోవడానికి కట్టెల సాయంతో మొక్కను నిలబెట్టుకోవాల్సి వస్తుందని, కానీ కష్టపడి పండించిన తర్వాత ధరలు గిట్టుబాటు కావడం లేదని ప్రభుత్వమే పంట కొనుగోలు చేసి ఎగుమతి చేస్తే ఉపయోగంగా ఉంటుదని, సబ్సిడీలు ఇచ్చి, పంటకి మార్కెట్ కల్పిస్తే అరటి రైతుకి ఢోకా ఉండదని అని రైతులు అభిప్రాయపడుతున్నారు.
పెరుగుతోన్న అరటి పంట విస్తీర్ణం..
ఎగుమతులతో విదేశాల్లో ఆంధ్ర అరటికి డిమాండ్ కనిపిస్తోంది. అయితే సాధారణ రైతుకి మరింత తోడ్పాటు అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. అది జరిగితే అరటి సాగులో కడప రైతులు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.










