ప్రజాశక్తి-కనగానపల్లి భూకబ్జాలకు పాల్పడిన మంత్రి ఉషాశ్రీచరణ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని టిడిపి నాయకులు డిమాండ్‌చేశారు. ఈమేరకు మంత్రి ఉషాశ్రీ చరణ్ కబ్జా చేసిన భూముల పరిశీలనకు టిడిపి పిలుపునివ్వడంతో మండలంలోని బానుకోట వద్ద ఉన్న మంత్రి ఉషాశ్రీచరణ్ రిసార్ట్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి ఉషాశ్రీచరణ్ సుజలాన్ గాలిమరల భూములతోపాటు, పేద రైతుల భూములను ఆక్రమించుకుందని ఆరోపిస్తూ టిడిపి జిల్లా అధ్యక్షుడు బి.కె.పార్థసారధి, టిడిపి రాష్ట్ర ఎస్‌సి సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్‌రాజు మంత్రి రిసార్ట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ముట్టడికి బయలుదేరిన టిడిపి నాయకులు కనగానపల్లి పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా భానుకోట వద్ద ఉన్న మంత్రి రిసార్ట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అంతేగాకుండా మంత్రికి మద్దతుగా వైసిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఈనేపథ్యంలో టిడిపి నాయకులు రిసార్ట్ ముట్టడికి వస్తుండటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముట్టడికి వెళ్తున్న టిడిపి జిల్లా అధ్యక్షుడు బికె పార్థసారధితోపాటు టిడిపి నేతలను కొండపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదేవిదంగా ద్విచక్రవాహనంలో వెళ్తున్న టిడిపి రాష్ట్ర ఎస్.సి సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజును అడ్డుకుని అరెస్టు చేశారు.
అమరాపురం : రూ.కోట్ల విలువజేసే భూములను కబ్జా చేసిన జిల్లామంత్రి ఉషాశ్రీచరణ్ వెంటనే పదవికి రాజీనామా చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే ఈరన్న డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాల్లో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా భూముల కబ్జాతోపాటు ఇసుక అక్రమ రవాణా చేస్తూ దండుకుంటున్నారన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో గత టిడిపి హయాంలో సుజలాన్ గుజరాత్ విండో పార్క్ లిమిటెడ్ కంపెనీకి దాదాపు 160 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చాక ఆ భూమిని జిల్లా మంత్రి ఉషాశ్రీచరణ్ కబ్జా చేశారని ఆరోపించారు. అభివృద్ధిని విస్మరించిన మంత్రులు కేవలం కబ్జాలు, అవినీతినే అడ్డాగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గంలో నెలకొన్న కబ్జా భూములను పరిశీలించేందుకు వెళ్తున్న టిడిపి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం బాధాకరమన్నారు. కావున ప్రజలు కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రకాష్, నాగు, మంజునాథ్, దుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : భూ కబ్జాకు పాల్పడిన జిల్లామంత్రి ఉషాశ్రీచరణ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి డిమాండ్ చేశారు. శనివారం బాలాజీనగర్‌లో ఉంటున్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవిలో హుందాగా వ్యవహరించాల్సిన ఉషాశ్రీచరణ్ భూకబ్జాకు పాల్పడం హేయమైన చర్య అన్నారు. దాదాపు రూ.30కోట్ల విలువజేసే భూమిని కబ్జా చేయడంతోపాటు తన భర్త పేరు మీద పవన విద్యుత్ కంపెనీకి చెందిన 160 ఎకరాల భూమిని కారుచౌకగా రిజిస్ట్రేషన్ చేయించడం బాధాకరమన్నారు. భూకబ్జాకు పాల్పడిన మంత్రి భేషరుతుగా ప్రజలకు క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా మంత్రి భూకబ్జాకు పాల్పడిన కంబదూరు మండలం నూతిమడుగుకు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా పోలీసులు హౌస్ అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్‌మూర్తి, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు భక్తర్, పట్టణ అధ్యక్షుడు మనోహర్, మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, క్లస్టర్ ఇన్‌ఛార్జి కన్నా, జిల్లా నాయీ బ్రాహ్మణ అధ్యక్షుడు రామాంజనేయులు, నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కృష్టప్ప, నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కంబలపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు రవికుమార్, వెంకటాద్రి, రంగనాథ్, బద్రీ, దినేష్, తదితరులు పాల్గొన్నారు.
టిడిపి జిల్లా అధ్యక్షులు బికె పార్థసారధిని అరెస్టు చేసి జీపులో తీసుకెళ్తున్న పోలీసులు










