Dec 15,2022 21:27

మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వైసిపి అసమ్మతి నేతలు

        మడకశిర :రాష్ట్ర మంత్రి, వైసిపి రాయలసీమ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుట సొంత పార్టీ నేతలు నిరసన గళం విప్పారు. ఈ ఎమ్మెల్యే తమకొద్దంటూ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ వైసిపి అసమ్మతి నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాయలసీమ వైసిపి నియోజకవర్గ సమీక్షల్లో భాగంగా గురువారం నాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. సమీక్షా సమావేశం భవనం వద్దకు ఆయన వస్తుండగా మార్గ మధ్యంలో కల్లుమరి గ్రామం జాతీయ రహదారి వద్ద మడకశిర వైసిపి అసమ్మతి నేతలు మాజీ మంత్రి నర్సేగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే వైటి.ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నళిని రంగేగౌడ్‌, సంగీతం నత్య అకాడమీ డైరెక్టర్‌ శాలిని సుధాకర్‌తో పాటు పలువురు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఆయన్ను కలిశారు. ఈ సమయంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున 'జగనన్న ముద్దు- మా ఎమ్మెల్యే వద్దు' అంటూ నినాదాలు చేశారు. దీనిపై మంత్రి వారితో మాట్లాడారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ వ్యవహరించరాదన్నారు. ఏవైనా ఉంటే మాట్లాడుకుందామని తెలియజేశారు. 'మీ ఎమ్మెల్యే పని అయిపోయింది.. వదిలేయండి' అంటూ మంత్రి అసమ్మతి నేతలకు ఒక విధమైన సంకేతం ఇచ్చారు.