Mar 15,2023 21:45

జెఎన్‌టియులో కౌంటింగ్‌కు ఏర్పాటు చేసిన టేబుళ్లు

         అనంతపురం ప్రతినిధి : అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభం కానుంది. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపులాగా కాకుండా ప్రాధాన్యతల ప్రకారం ఈ ఓట్ల లెక్కింపు ఉండటంతో సమయం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో గురువారం సాయంత్రంలోపు ఫలితాలొచ్చే అవకాశముంది. పట్టభద్రులకు సంబందించి శుక్రవారం వరకు వేచి ఉండే అవకాశముంది.
మండలి ఎన్నికలకు సంబంధించి అనంతపురం జెఎన్‌టియు కళాశాలలో ఓట్ల లెక్కింపునకు పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగాయి. ఉపాధ్యాయ నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పట్టభద్రులకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సుధీర్ఘ సమయం పట్టే అవకాశం ఉండడంతో మూడు షిప్టుల్లో ఓట్ల లెక్కింపు జరిగే విధంగా 600 మంది సిబ్బందిని నియమించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 3,30,124 ఓట్లు ఉంటే 2,44,307 ఓట్లు పోలయ్యాయి. 49 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి 28,148 ఓట్లు ఉంటే 25,884 పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 12 మంది బరిలోనున్నాయి వీరి భవితవ్యం నేడు, రేపటిలోపు తేలనుంది.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత
ఓట్ల లెక్కింపు జరుగుతున్న జెఎన్‌టియు కళాశాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లే రహదారులన్నింటిలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. లెక్కింపు కేంద్రంలోకి ఏజెంట్లు, అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపనున్నారు. తక్కిన వారికి అనుమతినివ్వడం లేదు. కేంద్రం చుట్టూ ఐదు కిలోమీటర్లలోపున్న మద్యం విక్రయ కేంద్రాలను సైతం మూసివేయించారు. 144 సెక్షన్‌ సైతం అమలు చేస్తున్నారు.
ఫలితాలపై ఎవరి అంచనాలు వారివే...
మండలి ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టమవుతుందని విపక్షాలు చెబుతుండగా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు విజయపథాన నడిపిస్తాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు తాయిలాలు అధికంగా ఇచ్చిన వారిలో అధికార పార్టీ నేతలే ఉన్నారు. శాసనసభ్యులే స్వయంగా రంగంలోకి దిగి పోలింగ్‌ వారికి అనుకూలంగా జరిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఇవి తమ మద్దతుదారుల విజయానికి దోహదం చేస్తుందని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ అంచనాలు ఎవరివి సరైనవన్నది మాత్రం మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఈ ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనా ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశం ఉండటమే ఈ ఎన్నికల ఫలితాలపై రాజకీయవర్గాల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికారపార్టీకి అనుకూలమా వ్యతిరేకత ఉందా అన్నది ఈ ఫలితాలు కొంత వరకు స్పష్టం చేయనున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.