మంద కృష్ణమాదిగపై విమర్శలు తగవు
ప్రజాశక్తి-కావలి : ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అద్యక్షుడు, మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అద్యక్షుడు మంద కృష్ణ మాదిగను విమర్శించే హక్కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేదని మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఏసురత్నం, ఎంఆర్‌పిఎస్ సీనియర్ నాయుకులు చేవూరు వరప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం పట్టణంలోని ''జర్నలిస్ట్ క్లబ్''లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులపై దాడులను నిరసిస్తూ గతరెండు రోజుల క్రితం విజయవాడలో అఖిలపక్షం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అద్యక్షుడు మంద కృష్ణ మాదిగ కూడా పాల్గొన్నారని తెలిపారు. అయితే ఆ సమావేశంలో పాల్గొని మంద కృష్ణ మాదిగ కొన్ని డిమాండ్లు కూడా చేసారన్నారు. అయితే దానిని దృష్టిలో పెట్టుకొని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంద కృష్ణ మాదిగను పెయిడ్ ఆర్టిస్ట్ అనటం సిగ్గు చేటన్నారు. గతంలో ఎస్‌సి వర్గీకరణకు మద్దతు ఇచ్చి మంద కృష్ణ మాదిగను అనేక సమావేశాలకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు మంద కృష్ణమాదిగ ఎలా పెయిడ్ ఆర్టిస్ట్ అయ్యారో తెలపాలన్నారు. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను బిఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటే మంద కృష్ణమాదిగ సపోర్ట్ చేసిన విషయం మరిచి పోయారా.. అని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరిగితే దళిత సంఘాలు, దళితనేతలు ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారని తెలిపారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయన్నారు. పెద్దిరెడ్డి రాష్టానికి మంత్రిఏమో కానీ, మంద కృష్ణమాదిగకు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎంఆర్‌పిఎస్ నాయకులు ఉన్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంద కృష్ణమాదిగకు వెంటనే క్షమాపణలు చెప్పకపోతే పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతాయన్నారు. కార్యాక్రమంలో ఎంఎస్‌పి జిల్లా మహిళా అద్యక్షురాలు గౌరా జానకి, ఎంఆర్‌పిఎఎస్ పట్టణ అధ్యక్షుడు చేవూరు కిరణ్‌కుమార్, జిల్లా కో కన్వీనర్ కొణిజేటి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.










