'ఒక మంత్రిగారు పని మీద ఒక గ్రామం మీదుగా వెళుతుంటాడు. అతనికి దాహం కావడంతో దగ్గరలో వున్న పొలంలోకి వెళ్లాడు. మంత్రి గారికి రైతు తన చెరకు తోట నుండి తాజాగా కొన్ని చెరకు గడలు తెచ్చి రసం తీసిచ్చాడు. తీయని చెరకు రసం తాగిన తర్వాత మంత్రి గారి కళ్లు ఏపుగా పెరిగిన చెరకు తోటపై పడ్డాయి. ఈ పంట నుండి ఎంత పన్ను వసూలు చేయొచ్చునో మనసులోనే లెక్కలు వేసుకుంటాడు. తర్వాత ఇంకొంచెం చెరకు రసం ఇమ్మంటాడు. ఈసారి తెచ్చిన చెరకురసం అంతకు ముందు వున్నంత తీయగా లేదు. మంత్రి ఆశ్చర్యంతో తన సందేహాన్ని వెలిబుచ్చాడు. 'మీ మనసులో అసూయ ప్రవేశించిన వెంటనే చెరకు రసం తన తియ్యదనాన్ని కోల్పోయింది ప్రభూ' అంటాడు వినయంగా. చందమామ కథల్లోని ఈ కథ నీతి...చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయని'. ఆలోచన మనిషి బుద్ధికి చెందిన విశేష లక్షణం. భూమి మీద మానవుల ఆలోచనా విధానం మూలంగా మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఆలోచనా విధానం... ఆ వ్యక్తి మంచి, చెడుల మధ్యనున్న విచక్షణను బట్టి తెలుస్తుంది. 'ఇరుకు మెదడు మురికిగా ఆలోచిస్తుంది...' అంటారో రచయిత. కాలంతోపాటు కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలు చిగురిస్తూనే ఉంటాయి. మనం రోజూ వింటున్న 'స్టార్టప్'లకు మూలం వినూత్న ఆలోచనలే! ఆ ఆలోచనలకు సరైన ఆచరణ తోడైతే...అది పొద్దున్నే విచ్చుకున్న ఎర్ర మందారంలా మనోహరంగా ఉంటుంది. పురోగమనానికి ఆచరణ కీలకం.
ఒక ఆలోచన నీ జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. అంటే- నీ ఆలోచనే... నీ భవిష్యత్తు. మన ఆలోచన మనం వున్న స్థితిని నిర్ణయిస్తుంది. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే సరైన ఆలోచనకు ఎంతో ప్రాధాన్యత వుంటుంది. ఓ చెడ్డ ఆలోచన...మనం ఉన్న స్థితి నుంచి అథ:పాతాళానికి తోసేస్తుంది. మంచి ఆలోచన జీవితాన్ని మార్చడమే కాదు... మనం చేరాల్సిన గమ్యాలను, లక్ష్యాలను చేరడానికి అవసరమైన మార్గాన్ని చూపుతుంది. 'నూరు పూలు వికసించనీ... వేయి ఆలోచనలు సంఘర్షించనీ' అంటాడు మావో. మన ఆలోచనలను బట్టే మన మాటలు, చేతలు వుంటాయి. ఆలోచనలను అమలు చేయడం ఆచరణ అయితే, సరైన ఆలోచనలకు కూడా ఆచరణే ముఖ్యం. ఆచరణ లేని ఆలోచన సువాసన లేని పూవు లాంటిది. అందుకే అన్నిటికీ ఆచరణే గీటురాయి. మంచి ఆలోచన... ఆశావాద దృక్పథాన్ని పాదుకొల్పుతుంది. ఆలోచనలు... ఆచరణల మేళవింపు ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. అలాగే, ఏ మనిషికైనా జీవితంలో సవ్యమైన ఆలోచనలు, పారదర్శకమైన సంబంధాలు అవసరం. 'మంచి మిత్రుడు తన స్నేహితుని ఆలోచనలకు సవ్యమైన మార్గం చూపుతాడు..' అని పెద్దలు చెబుతారు. అలాంటి సవ్యమైన ఆలోచనలే పురోగమనం వైపు పయనిస్తాయి.
'చారిత్రక విభాతసంధ్యల/ మానవకథ వికాస మెట్టిది?/ ఏ దేశంలో ఏ కాలంలో/ సాధించిన దేపరమార్థం?' అన్న జిజ్ఞాస మొదలైంది కూడా ఒక ఆలోచనతోనే. నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు సగటున 6,200 ఆలోచనలు చేస్తామట. కెనడా లోని క్వీన్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం మనిషి ఆలోచనా శక్తిపై అనేక పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి 'థాట్ వర్మ్' ప్రాసెస్ అని పేరు పెట్టారు. మనిషి జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన ఒకే ఒక ఆయుధం 'ఆలోచన'. ఆ ఆలోచనలు మంచివైతే మన పయనం మంచి వైపు సాగుతుంది. అవే ఆలోచనలు చెడ్డవైతే వినాశనానికి దారితీస్తాయి. 'చిచ్చుబుడ్డీ పేలుతుంది - చిచ్చరకన్నూ పేలుతుంది/ ఎండుగడ్డీ మండుతుంది - బడబాగ్నీ మండుతుంది/ రెంటిలోనూ మంటలున్నారు - రెంటికీ ఎన్నెన్నో అంతరాలున్నారు/ జాతర చూపే దొకటి - చైతన్యం రేపేదొకటి/ క్షణమాత్రం ఒకటి - అనంతకాల సందీప్తం ఒకటి' అంటాడు సినారె. ఇవి రెండూ రెండు విరుద్ధ భావాలకు ప్రతీకలు. రెండు స్వభావాలు, రెండు ఆలోచనల మంటలు. ఒకటి తాటాకు మంటల్లా గప్పున ఆరిపోతాయి. రెండోవి చైతన్యం రేపే మంటలు. ఇవి అనంతకాల సందీప్తాలు. ఒక మంచి ఆలోచన వేల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. 'ప్రపంచ ఆలోచన దినోత్సవం' సందర్భంగా మంచి ఆలోచనలు చేద్దాం...వెలుగు పువ్వులను పంచుదాం.










