Mar 20,2022 12:15

                                               ఒకే సమయంలో ఎమ్మెల్యేలుగా పనిచేశాం

'తెలుగు మహిళా శక్తికి ప్రతిరూపమైన మల్లు స్వరాజ్యం పరమపదించారని తెలిసి విచారించాను. పీడిత ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటం అనుపమానమైనది. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలిగా ఆమె అందించిన సేవలు మరువలేనివి. ఆమె, నేను ఒకే సమయంలో ఎన్నికై శాసనసభ్యులుగా కలిసి పని చేశాం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని ట్వీట్‌ చేశారు.
                      ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

''అసాధారణ కమ్యూనిస్టు విప్లవకారిణి కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం మృతికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం (1946-51) లో నిజాం నిరంకుశ పాలనలో కిరాతక రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ధీర వనిత ఆమె. పోరాట కాలంలో ఆమె తలకు పది వేల రూపాయలు వెల కట్టింది నాటి నిజాం ప్రభుత్వం. అయినా, లెక్కచేయలేదు. .ఆమె గొప్ప వక్త కూడా. అసాధారణ వాగ్ధాటితో కూడిన ఆమె ప్రసంగాలు చాలా మందిని ఉత్తేజితులను చేశాయి.
      ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ శాసన సభకు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా, తరువాత ఆమె తుధి శ్వాస విడిచేవరకు కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఉన్నారు. మనం ఒక గొప్ప వీర నారీమణిని కోల్పోయాం. విప్లవ లక్ష్యం కోసం. పేద ప్రజల అభ్యున్నతి కోసం 75 ఏళ్లుగా ఆమె విశేష కృషి చేశారు. ఆమె మృతికి నా ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు, యావత్‌ పార్టీకి సానుభూతి తెలియజేస్తున్నాను.''
                                  -సీతారాం ఏచూరి, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి

అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి స్ఫూర్తితో పన్నెండేళ్ల వయస్సులోనే మల్లు స్వరాజ్యం ఉద్యమంలోకి అడుగు పెట్టారు. ఆమెతో కలిసి ఐద్వాలో పదేళ్లు పనిచేశాను. స్వరాజ్యంగారు ఏది మాట్లాడినా స్ఫూర్తివంతంగా ఉంటుంది. బంధువుల పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలను ఏకం చేసి హక్కుల కోసం చిన్న వయస్సులోనే ఉద్యమించారు. ఆరోజుల్లో దయనీయంగా ఉన్న వ్యవసాయ మహిళా కార్మికుల్లో పాటలతో స్ఫూర్తి రగిలించి దొరల అహంకారం, అణిచివేతపై పిడికిలి బిగించింది స్వరాజ్యం. 12 సంవత్సరాల వయస్సులోనే విజయవాడలో జరిగిన సిపిఎం శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ప్రజలతో మమేకమై ఉద్యమం చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఆ అనుభవం పార్టీ నిర్మాణంలో ఎంతో దోహదపడింది. 1980 నుంచి ఐద్వాకు సుదీర్ఘకాలం సేవలందించారు. ఎమ్మెల్యేగా గెలిచిన సాదాసీదాగానే ఉండేవారు. మద్యనిషేద ఉద్యమంలో చురుకుగా పాల్గొని నెల్లూరులో భారీ సభ నిర్వహించారు. స్త్రీలకు సమాన ఆస్తిహక్కు కోసం అప్పటి ఎన్‌టిఆర్‌ ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యులుగా ఉండి రాష్ట్రమంతా పర్యటించారు. మహిళలకు మరుగు దొడ్లు కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్‌లో జరిగిన రమీజాబి, షకీలా అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పోరాటాలకు చిహ్నం మల్లు స్వరాజ్యం.
                                                                                                                                               - పుణ్యవతి

తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు నడిచిన వీరవనిత మల్లు స్వరాజ్యం. మత సామరస్యం కోసం, ప్రైవేటు, పెట్టుబడి రంగం విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ధీశాలి. నైజాం నిరంకుశ పాలనను ఎదిరించి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతరం మిగిలిన కర్తవ్యాల కోసం జీవితాంతం ఉద్యమించారు. భర్త వెంకట నర్సింహారెడ్డి, సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేద ప్రజలకు తమ సొంత భూములు పంచిపెట్టారు. రాష్ట్రాల హక్కులు కేంద్రం హరిస్తుంటే..వ్యతిరేకంగా ఆమె నినదించారు.విప్లవ ఆశయం కోసం జీవితాన్ని అంకితం చేసిన వీరవనితకు తెలుగు ప్రజల తరుపున జోహార్లు అర్పిస్తున్నాను.
                                 - పి మధు, మాజీ ఎంపి


                                                                  ముఖ్యమంత్రి సంతాపం

స్వాతంత్య్ర సమరయోధురాలు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారిణి, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర సిపిఎం ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. ఆమె అనేక సామాజిక, రాజకీయ పోరాటాలు నిర్వహించారు. స్వరాజ్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.


                           మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు

నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆమె జీవన గమనం.. గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకం. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరనిలోటు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
 

                                                   నేటి తరానికి స్ఫూర్తి : సిపిఎం రాష్ట్ర కమిటీ

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, స్వాతంత్ర సమరయోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం (91) మృతిపట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. వారి ఆశయాల సాధనకు యావత్‌ పార్టీ అంకితమై పనిచేస్తుంది. మల్లు స్వరాజ్యం తెలంగాణా సాయుధ పోరాటంలో మహిళ కమాండర్‌గా పని చేసి నాటి దొరల దురహంకారానికి, రజాకార్ల మూకల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి పోరాట స్ఫూర్తిని రగిల్చారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించినా సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి పీడిత వర్గాల తరపున, దళిత బలహీనవర్గాల తరపున ధైర్యంగా నిలబడి పోరాడారు. గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. ఆఖరి శ్వాస వరకు యావత్‌ జీవితాన్ని లక్ష్య సాధన కోసమే జీవితాన్ని అంకితం చేశారు. ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. ఆమె మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. 75 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రజాప్రస్థానంలో ఆమె రెండు సార్లు (1978, 1983లో) తుంగతుర్తి శాసన సభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐద్వా నాయకురాలిగా అనేక మహిళా సమస్యలపై పోరాటాలు చేశారు. ఆమె భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. స్వరాజ్యం కుమారుడు మల్లు నాగార్జున్‌ రెడ్డి సూర్యపేట జిల్లా కార్యదర్శిగా, చిన్నకోడలు మల్లు లక్ష్మి ఐద్వా తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మల్లు స్వరాజ్యంగారు కన్నుమూసారన్న వార్త తెలిసిన వెంటనే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆసుపత్రికి వెళ్లి స్వరాజ్యం భౌతిక కాయాన్ని సందర్శించి, ఘనంగా నివాళులర్పించారు. బాంచన్‌ దొర... అనే బలహీనుడితో బంధూకును (తుపాకీ) పట్టించిన ఘనత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంకే దక్కుతుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ తెలిపారు. ఆమె మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వేరొక ప్రకటనలో స్వరాజ్యం మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని తెలిపారు. ఆమె మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.
 

                                                                ప్రజాసంఘాల సంతాపం

మల్లు స్వరాజ్యం మృతికి ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేకపోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించాయి. ఈ మేరకు ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన ార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు, నల్లప్ప, అండ్ర మాల్యాద్రి, వై కేశవరావు, మర్రాపు సూర్యానారాయణ ప్రకటన విడుదల చేశారు. ఎపి గొర్రెలు,మేకల పెంపకందారుల సంఘం ప్రధానకార్యదర్శి ఎం రామకృష్ణ సంఘం తరపున సంతాపాన్ని ప్రకటించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ తరపున అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌జిఎం బాషా, ఎస్‌ అనిల్‌కుమార్‌ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్ర ఐద్వా ప్రధాన కార్యదర్శి కె స్వరూపరాణి సంతాపం తెలిపారు. శనివారం మధ్యాహ్నం సిఐటియు నాయకులు బాలకాశీతో కలిసి ఆసుపత్రిలో స్వరాజ్యంను పరామర్శించారు. ఆమె మరణం తీరని లోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఒకచేతితో తుపాకీ పట్టి, మరోచేతితో కుటుంబ నిర్వహణ చేస్తూనే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి మహిళా ఉద్యమ పతాకాన్ని సమున్నతంగా నిలబెట్టారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి తెలిపారు. ఐద్వా రాష్ట్ర కమిటీ తరపున సంతాపాన్ని ప్రకటించారు. స్వరాజ్యం ఉద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

                                                    మల్లు స్వరాజ్యం యువతరానికి ఆదర్శం

ఆఖరి క్షణం వరకు ప్రజాసేవకే అంకితమయ్యారు. ఆమె ఆదర్శాలకు అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీ ముందుకుపోతుంది. ఆమె ఆశయాల సాధనకోసం, అవినీతిరహిత సమాజం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ సిపిఎం పార్టీ తరుపున మల్లు స్వరాజ్యంకు జోహార్లు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నాను.
                                                                - వి శ్రీనివాసరావు,
                                                       సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి

                                                                      పవన్‌ నివాళి

'మల్లు స్వరాజ్యం మరణించారనే వార్త ఆవేదన కలిగించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన స్వరాజ్యం తెలంగాణాలోనే కాకుండా యావత్‌ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. పోరాటంలో ఆమె చొరవ, ధైర్యం అజరామరం. ఆమె మరణం ప్రజాస్వామ్యవాదులకు, పీడిత వర్గాలకు తీరనిలోటు. అమర వీరనారికి అంజలి ఘటిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.'
జనసేన అధ్యక్షులు
                   పవన్‌ కళ్యాణ్‌