Mar 19,2023 22:13

ఫొటో : మల్లు స్వరాజ్యంకు నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి
ప్రజాశక్తి-కావలి : అమరజీవి మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి సందర్భంగా ఆదివారం కావలి సిపిఎం కార్యాలయంలో పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య, నాయకులు ఎస్‌.వెంకయ్య, వి.మల్లికార్జున రావులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం 13 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కమ్యూనిస్టు ఉద్యమాలు, పోరాటాల వైపు ఆకర్షితులయ్యారన్నారు. 1945 -46 సంవత్సరంలో జరిగిన వీర తెలంగాణా సాయుధ విప్లవ పోరాటంలో అప్పటి నైజామ్‌ నవాబు అహంకారంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారన్నారు. విప్లవశంఖాన్ని వినిపించిన విప్లవ నారి అని కొనియాడారు.
మహిళలను చైతన్య పరిచి పోరాటాల్లోకి తీసుకు వచ్చి నైజాం సర్కార్‌ను గడగడలాడించిన స్వరాజ్యం తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, చెట్లల్లో గుట్టల్లో కష్టాలు పడి, పోరాటంలో పాల్గొన్నారన్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గంలో రెండు సార్లు శాసనసభకు ఎన్నికై బలహీన వర్గాలకు పేదలకు అండగా నిలిచారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యంగా మార్క్సిస్ట్‌ పార్టీ బలోపేతానికి పోరాటాలకు ఆమె ఎంతో కృషిచేసి చివరి వరకు ఎర్రజెండాను వదలని విప్లవ నాయకురాలుగా ఉన్నారన్నారు. అనంతరం ఎస్‌.వెంకయ్య, వి.మల్లికార్జునరావులు ప్రసంగించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి కిష్టయ్య, కే చెన్నయ్య, సిఐటియు నాయకులు రమేష్‌, ఎస్‌కె.మస్తాన్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పెంచల నరసింహం, పి.కోటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.