2021 ఆగస్టు 15న ఆఫ్ఘనిస్తాన్‌లో చరిత్ర పునరావృతమైంది. ఇరవై ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా, దాని మిత్రపక్షాలు దండెత్తడంతో పదవీచ్యుతులైన తాలిబాన్లు కాబూల్‌ను తిరిగి వశపరచుకున్న రోజు ఇది. తాలిబాన్లు తిరిగి అధికారం చేపట్టడంపై అంతర్జాతీయ సమాజంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇతర పశ్చిమ దేశాలు తీసుకున్న వైఖరికి, రష్యా, చైనా తీసుకున్న వైఖరికి మధ్య తేడా ఉంది. అమెరికాతో వ్యూహాత్మక పొత్తులో భాగస్వామిగా ఉన్న భారత్ ఎటూ తేల్చుకోలేని అయోమయంలో ఉన్నది. కాబూల్ ఆకస్మిక పతనం ఊహించిందేనని, ఆఫ్ఘన్ నుంచి అమెరికా వెనక్కి తగ్గడం అనివార్యమని రష్యా, చైనాతో సహా పలు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. రెండు లక్షల కోట్ల డాలర్లు తగలేసి, 2,400 మంది అమెరికన్ సైనికులను బలిపెట్టి, లక్ష మందికి పైగా అమాయక పౌరుల ప్రాణాలను తోడేసి, వేలాది మందిని క్షతగాత్రులను చేసి, లక్షలాది మంది శరణార్థులను గావించిన ఈ సుదీర్ఘ యుద్ధం ద్వారా అమెరికా సాధించిందేమిటి? సెప్టెంబరు దాడుల అనంతరం 'ఉగ్రవాదంపై యుద్ధం' పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌పై యుద్ధానికి తెగబడిన అమెరికా ఈ ఇరవై ఏళ్లలో ఎన్ని టన్నుల బాంబులు కురిపించిందో, ఎంత మందిని నిర్బంధ శిబిరాల్లో పెట్టి చిత్ర హింసలు పెట్టిందో లెక్కలేదు. ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా యుద్ధం వల్ల ఈ కాలంలో హోమ్‌లాండ్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదం నుంచి ప్రమాదాన్ని నివారించగలిగామని బైడెన్ అనడం మునుపటి అమెరికా పాలకులు చెప్పినవన్నీ అబద్ధాలని అంగీకరించినట్లే కదా !
తాలిబాన్లను పెంచి పోషించింది అమెరికానే. 1978-90 మధ్య సోవియట్ దన్నుతో ప్రగతిశీల ప్రభుత్వాలు భూస్వామ్య వ్యవస్థపై పోరాడి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణానికి కృషి చేశాయి. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ ప్రాంతం సోషలిస్టు శిబిరం వైపు మొగ్గు చూపడాన్ని సహించలేని అమెరికా, ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఊపిరులూదింది. ఆనాటి రీగన్ ప్రభుత్వం సోవియట్ యూనియన్ దళాలకు వ్యతిరేకంగా ప్రాంతీయంగా జలాలుద్ద్దీన్ హఖాని నేతృత్వంలో ట్రైబల్ ఆర్మీని ప్రారంభించింది. మతపరమైన తీవ్రవాద సంస్థ తాలిబన్‌ను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ తోడ్పాటుతో ఏర్పాటు చేసింది. వీటికి ఆయుధాలు, డాలర్ల మూటలు ఇచ్చి ప్రోత్సహించింది. 1996లో ఆఫ్ఘన్ అధ్యక్షుడు నజీబుల్లాను ఉరి తీసి, కాబూల్ నడిబొడ్డున దీప స్తంభానికి తలకిందులుగా వేలాడదీసి తాలిబాన్లు వికటాట్టహాసం చేస్తే అమెరికా సంబరపడింది. 1996-2001 మధ్య తాలిబాన్లు సాగించిన పాలన ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను తీవ్ర కడగండ్ల పాల్జేసింది. పదేళ్ల పైబడిన బాలికలు స్కూలుకు వెళ్లడానికి వీల్లేదన్నారు. మహిళలు బురఖా ధరించాలన్న నిబంధన పెట్టారు. అన్ని రంగాల్లోను మహిళలను తక్కువ చేసి చూసే సంస్కృతిని రుద్దారు. మధ్య యుగాల నాటి ఆటవిక సంస్కృతిని తీసుకొచ్చే యత్నం చేశారు. అందుకే తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోగానే చాలామంది భయంతో విమానాశ్రయాలకు పరుగులు తీయడం, విమానాశ్రయంలో తొక్కిసలాట, కాల్పులు వంటి భయానక పరిస్థితికి ఇదే కారణం.
తాలిబాన్లు ఇప్పుడు ఎటువంటి విధానం అనుసరిస్తారనేది వేచి చూడాలి. కొత్త ప్రభుత్వంలో మహిళల ప్రాతినిధ్యం గురించి చేసిన ప్రతిపాదన ఆహ్వానించదగినదే. కానీ, విద్య, పౌరుల హక్కులు, మహిళా సాధికారత, ప్రజాస్వామిక విలువలు, విదేశాంగ విధానం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల పట్ల మోడీ ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించడానికి బదులు అమెరికాకు అనుగుణంగా నడుచుకుంటోంది. ఇది భారత ప్రయోజనాలకు తీవ్ర చేటు తెస్తుంది. తాలిబాన్లతో రష్యా, చైనా, పాకిస్తాన్ దేశాలు దౌత్య పరమైన చర్చల ద్వారా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. భారత్ ఆలస్యంగా మేల్కొంది. తాలిబాన్లతో చర్చలకు విదేశాంగ మంత్రి జైశంకర్ చివరిలో కొంత యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ లోని భారతీయులనందరిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి. ఇందులో హిందువులు, సిక్కులను తీసుకురావడానికి మొదటి ప్రాధాన్యతనిస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మతం పేరుతో వివక్ష చూపడం ఎంతమాత్రం సరికాదు.










