Dec 31,2021 08:36
  • పిఆర్‌సిపై పురోగతి లేదు
  • 14.29 శాతమే ఫిట్‌మెంట్‌
  • సంఘాలతో ఆర్థికశాఖ సమావేశాలు
  • 3 న కార్యాచరణ ప్రకటించనున్న స్ట్రగుల్‌ కమిటీ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పిఆర్‌సిపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నిర్వహించిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ (జెఎస్‌వి) సమావేశం మరోసారి చర్చలతోనే ముగిసింది. సచివాలయంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ 16 ఉద్యోగ సంఘాలను మూడు గ్రూపులుగా విభజించి గురువారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. పిఆర్‌సి, మానిటరీ బెనిఫిట్‌ అమలు తేదీలు, నగదు రూపేణా ఎప్పటి నుంచి ఉద్యోగులకు అందజేయాలనే అంశాలపై వారి మధ్య చర్చలు జరిగాయి. అయితే, సమావేశాల్లో పిఆర్‌సిపై ఎలాంటి పురోగతి లేదు. గతంలో మాదిరే 14.29 శాతం ఫిట్‌మెంట్‌నే మరోసారి ప్రస్తావించడంతో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో స్ట్రగుల్‌ కమిటీ జనవరి మూడో తేదీన సమావేశమై పిఆర్‌సిపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎపి జెఎసి, ఎపి జెఎసి అమరావతి తెలిపాయి. ఎపి ఎన్‌జిఒ, ఎపి రెవెన్యూ తదితర ఉద్యోగ సంఘాల నాయకులతో ఆర్థికశాఖ అధికారులు తొలుత సమావేశాలు నిర్వహించారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సేవలు) పి చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ ప్రతిపాదనలను నాయకుల ముందుంచారు. ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తున్నందున, కొద్దిమేర పెంచి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారని వారు తెలిపారు. కొత్తగా రూపొందించిన ప్రతిపాదనలను వారు ఉద్యోగ సంఘాలకు వివరించారు. ఆ ప్రతిపాదనలపై ఉద్యోగ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎలాంటి ఫలితం లేకుండానే చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో సంప్రదింపులు, చర్చలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంటాయన్నారు. ఉద్యగులకు సాధ్యమైనంత త్వరగా పిఆర్‌సిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. పలు అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
 

                                                        చర్చల పేరుతో కాలయాపన

ఈ సందర్భంగా ఎపి జెఎసి చైర్మన్‌ బండి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ, అధికారుల తీరును నిరసించారు. వారం పది రోజుల్లో పిఆర్‌సి ఇస్తామని సిఎం జగన్‌ తిరుపతిలో ప్రకటించినా, నేటికీ అది కార్యరూపం దాల్చలేదన్నారు. ఆ తర్వాత 72 గంటల్లో పిఆర్‌సి ఎంతో ప్రకటిస్తామన్నారని, అది కూడా లేకుండా మరోసారి సమావేశాలకు రమ్మన్నారని చెప్పారు. సమావేశంలో పిఆర్‌సి ఎంత ఇస్తారో చెప్పకుండా, ఆర్థిక పరమైన అంశాలను వివరించారని తెలిపారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప ఫలితం ఉండటం లేదని వ్యాఖ్యానించారు. జనవరి 3న స్ట్రగుల్‌ కమిటీ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎపి జెఎసి అమరావతి చైర్మన్‌, ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చాయని, ఫిట్‌మెంట్‌ కూడా 39 శాతం, 43 శాతం ఇచ్చాయని చెప్పడం సరికాదన్నారు. చర్చల్లో పురోగతి ఉంటుందంటేనే పిలవాలని, లేదా సిఎం జగన్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రూ.75 వేల కోట్లను ఉద్యోగుల కోసమే ఖర్చు చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగుల కోసం 32 శాతమే ఖర్చు చేస్తున్నారన్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడా తగ్గలేదని, ప్రభుత్వం చెప్పే విషయాలన్నీ సత్యదూరమని పేర్కొన్నారు. ఫిట్‌మెంట్‌ ఎంత ఇస్తారంటే, మళ్లీ మొదటికే రావడం చూస్తే, అధికారులు ఈ విషయాన్ని ఇప్పటి వరకు సిఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లలేదనే విషయం అర్థమవుతోందన్నారు. జిపిఎఫ్‌ సొమ్ము రూ.2,100 కోట్లను పక్కతోవ పట్టించారని, ఇప్పటి వరకు ఏడు డిఎలను చెల్లించలేదని, డిఎ బకాయిలు రూ.6 వేల కోట్లు ఉన్నాయన్నారు. పిఆర్‌సితోపాటు సిసిఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదన్నారు. ప్రభుత్వ కార్యాచరణ ఇలానే ఉంటే, తదుపరి కార్యాచరణకు వెళ్లక తప్పదని బొప్పరాజు హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెఆర్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ, ఐఎఎస్‌ అధికారులకు సకాలంలో జీతాలు అందుతున్నాయని, వారికి తమ బాధలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సమావేశంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె వెంకట్రామిరెడ్డితోపాటు ఇతర ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
 

                                         పిఆర్‌సిపై కాలయాపన చర్చలు వద్దు: యుటిఎఫ్‌

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను నిరాశకు గురిచేస్తూ 11వ పిఆర్‌సి అమలుపై చర్చల పేరుతో కాలయాపన చేయడాన్ని యుటిఎఫ్‌ నిరసించింది. పిఆర్‌సి అమలుపై స్పష్టత ఇవ్వాలని ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ రిపోర్టు ఇచ్చి ఏడాది గడుస్తున్నా గోప్యంగా ఉంచారని తెలిపారు. అధికారుల కమిటీ చేసిన సిఫార్సుల మేర 14.29 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్‌సి అమలు చేస్తామని, దానిపై సంఘాల అభిప్రాయాలు చెప్పాలని పదేపదే చర్చల పేరుతో కాలయాపన చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, ఆదాయంలో ఎక్కువ శాతం ఉద్యోగుల జీతాలకే చెల్లిస్తున్నామని, తప్పుడు లెక్కలు చెప్పడాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో పోల్చుతూ ఫిట్‌మెంట్‌ నిర్ణయించడం సరైంది కాదని పేర్కొన్నారు. 2018 జులై 1 నుంచి 11వ పిఆర్‌సి 55 శాతం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్‌ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు సాంకేతికత తెలియకపోవడం వల్ల హామీ ఇచ్చామని, సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పడం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. అధికారుల కాలయాపన చర్చలకు స్వస్తిపలికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని, ఇచ్చిన హామీల మేరకు 11వ పిఆర్‌సి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ రద్దు, కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టాలని, బకాయిల చెల్లింపుపై స్పష్టమైన వైఖరి చెప్పాలని కోరారు. లేదంటే జనవరి 2 తరువాత జెఎసి ఐక్యవేదిక పిలుపు మేరకు పోరాటాలకు అందరూ సిద్ధం కావాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.