రాయచోటి: దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గుతాయని డిఆర్‌ఒ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో తన ఛాంబర్‌లో జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లాలో మలేరియా, డెంగీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.కొండయ్య, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కె.వేణుగోపాల్ పాల్గొని జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు వివరించారు. మున్సిపల్, పంచాయతీ, విద్య, మత్స్య, మైన్స్, ఫారెస్ట్ అధికారులు వైద్యారోగ్య శాఖతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలన్న అంశాలపై చర్చించారు. జిల్లాలో మలేరియా, డెంగీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో సమస్యాత్మక వార్డుల్లో ఫాగింగ్, డ్రైనేజీ మురుగునీరు చేరకుండా అపరిశుభ్రత వాతావరణం లేకుండా సానిటరీ సెక్రెటరీలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో కూడా అన్ని కంటైనర్లు ఫ్రిడ్జ్ వాటర్ కూలర్లు ఇండోర్ ప్లాంట్స్ వాడుతున్న ప్రజలకు అవగాహన కల్పించి, బాధ్యతాయుతంగా ఆయా శాఖలు తమ విధులు నిర్వర్తిస్తూ వ్యాధులు ప్రభావకుండా నిరోధక చర్యలు చేపట్టాలని అధికారులతో పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










