Dec 02,2020 08:30

        ఇటీవల అమెరికా, పెరూ, చిలీ, గ్రీస్‌,బ్రెజిల్‌, బ్రిటన్‌, స్పెయిన్‌, థాయిలాండ్‌ తదితర దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ వ్యాపితంగా తమకు ఇక ఎదురే లేదని విర్రవీగిన ఫాసిస్టు, మితవాద రాజకీయ శక్తులకు ఒక హెచ్చరికగా నిలిచాయి. బడా కార్పొరేట్లకు అధిక లాభాలు కట్టబెట్టే నయా ఉదారవాద విధానాలను అత్యంత కర్కశంగా అమలు చేయడంలోను, వాటికి వ్యతిరేకంగా వచ్చే అసమ్మతిపై ఉక్కుపాదం మోపడంలో మితవాద శక్తులకు వేరెవరూ సాటిరారని గత దశాబ్ద కాలం అనుభవం చాటిచెబుతోంది. నయా ఉదారవాద విధానాల మూలంగా ఆర్థిక అసమానతలు అసాధారణ స్థాయికి చేరుకున్నాయి. మరో వైపు ఉపాధి పడిపోయింది. మహిళలు, తక్కువ నైపుణ్యం గల కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. నయా ఉదారవాద దోపిడీపై ప్రజల్లో వచ్చే అసంతృప్తిని పక్కదారి పట్టించి వారి నడుమ విద్వేషాలను రెచ్చగొట్టి అధికారం చేజిక్కించుకున్నాయి మితవాదశక్తులు. అయితే ప్రజలను చీల్చి కార్పొరేట్లకు ఊడిగం చేసే వారి ఎత్తుగడలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మితవాద ప్రభుత్వాలపై ప్రజాగ్రహం                   పెల్లుబుకుతోందనడానికి ఇటీవల వివిధ దేశాల్లో ఉదృతమవుతున్న ఆందోళనలు, సమ్మెలు ఒక సంకేతం. తమ జీవన స్థితిగతులను దుర్భరంగా మార్చిన మితవాద ప్రభుత్వాలతో ప్రజలు ఎంతగా విసుగెత్తిపోయారో అమెరికాలో ట్రంప్‌ ఓటమి, బ్రెజిల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బోల్సనారో పార్టీ ఘోర పరాజయం పెరూలో వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు అధ్యక్షులు మారడం వంటివి తెలియజేస్తున్నాయి. భారత్‌లో సమ్మె జరిగిన రోజునే గ్రీస్‌లోనూ లక్షలాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి దేశవ్యాపితంగా సమ్మె చేశారు. భారత్‌లోనూ అదే పరిస్థితి. ఇక్కడ పది మాసాల వ్యవధిలోనే రెండు సార్లు కార్మికవర్గం సమ్మె చేసింది. ఇంకోవైపు వినాశకర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్దయెత్తున ఉద్యమిస్తున్నది. రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా గత అయిదు రోజులుగా వారు చేస్తున్న ఆందోళన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సమ్మెలు, ఆందోళనలు, ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో మితవాద మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు ఈ మితవాద ప్రభుత్వాలు అధికారంలో ఉన్న అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లోనే నమోదుకావడం విశేషం. కరోనా సమయంలో ఈ ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపనల్లో అత్యధిక భాగం కార్పొరేట్ల బొక్కసాలు నింపడానికే ఉపయోగపడ్డాయి తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. కరోనా సంక్షోభాన్ని ఆసరా చేసుకుని అసమ్మతిని అణచివేసేందుకు క్రూరమైన చట్టాలను ప్రయోగిస్తున్నది. మానవ హక్కులను,, ప్రజాతంత్ర హక్కులను బాహాటంగా కాలరాస్తున్నది. మిలిటరీ, పోలీస్‌, బడా కార్పొరేట్లతో కలసి మితవాద శక్తులు తమ ఎజెండాను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి.
         అదే సమయంలో మితవాద విధానాలకు ప్రపంచ వ్యాపితంగా ప్రతిఘటన పెరుగుతుండడం ఒక మంచి పరిణామం. అయితే,కొన్ని దేశాల్లో ఇది మితవాద ప్రభుత్వాలను గద్దె దించడం వరకే పరిమితమవుతున్నది. విధానాల్లో మార్పు రాకుండా కేవలం ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఉపయోగం ఉండదని పెరూ, గ్రీస్‌, థాయిలాండ్‌ అనుభవాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మితవాద శక్తులను ఓడించడంతో బాటు, నయా ఉదారవాద దోపిడీని కూడా నిర్మూలించే ప్రత్యామ్నాయం వైపు ప్రజలు ఆలోచించాలి. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఆ దిశగా తమ కృషిని ముమ్మరం చేయాలి.