Nov 07,2021 13:21

చల్లంపాళ్యం రాజుకి లేకలేక మగబిడ్డ పుట్టాడు. రాజకుమారుడిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. పని చేస్తే, బిడ్డ ఎక్కడ కందిపోతాడోనని రాజు, రాణిలు పనులు చెప్పేవారు కాదు. తిని తిరగడం మాత్రమే పనిగా పెట్టుకున్న యువరాజు బియ్యం బస్తాలా తయారయ్యాడు. కూర్చుంటే లేవలేని స్థితికి వచ్చాడు.
    ఒకరోజు యువరాజు గుర్రంపైన అడవికి వేటకి బయలుదేరాడు. తోడుగా వెళ్లి రమ్మని రాజు, రాణిలు మంత్రిని పురమాయించారు. గుర్రంపైన మూడొంతుల స్థలం యువరాజుకే సరిపోవడంతో పక్కగా, నక్కి నక్కి కూర్చున్నాడు మంత్రి. కానీ శరీరం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం గురించి యువరాజుకి చెప్పే అవకాశం కలిగినందుకు ఆయన సంతోషించాడు. అడవిలో కొద్దిదూరం వెళ్లాక పచ్చటి లేతగడ్డి మధ్యలో కుందేళ్లు పడుకొని ఉన్నాయి. అయినా ఆహారాన్ని తినడం లేదు. 'కళ్ల ముందు ఆహారం కనిపిస్తున్నా అవెందుకు తినడం లేదు?' అని యువరాజు అడిగాడు. ఇదే అదనుగా భావించిన మంత్రి 'అవి మనలాగా వేళకి తినాలనుకోవు. ఆకలైనా, కాకపోయినా కళ్ల ముందర ఆహారం ఉంటే మనం తినేస్తాం. కష్టాలు కొని తెచ్చుకొంటాం' అని బదులిచ్చాడు. మంత్రి మాటలు యువరాజును ఆలోచనలో పడేశాయి.
    మరికొద్ది దూరం వెళ్లాక ఆవులు అవిశాకు చెట్టు ఆకుల్ని తినడం చూసిన యువరాజు, మంత్రితో 'అవిశాకు చేదు కదా! ఆవులు ఆవురావురుమని తింటున్నాయి. ఇదేమిటి?' అంటూ అడిగాడు. 'మనకి చేదు అనేది నోటి నాలిక వరకే రాజా, కడుపులోకి పోయాక తీపి అయినా, చేదు అయినా మనం తెలుసుకోలేము. చాలా చేదు చెట్లలో ఎన్నో ఔషధగుణాలూ ఉంటాయి. జంతువులు మంచి ఆహారమేదో వాటినే తింటాయి. మనలాగా రుచి ఉన్న ఆహారాన్ని కోరుకోవు' అని బదులిచ్చాడు మంత్రి.
     కాసేపు మామిడిచెట్ల కింద విశ్రాంతి తీసుకుని, తిరిగి ప్రయాణం మొదలెెట్టారు. దారిలో జింకలు, ఏనుగులు నీరు తాగుతూ ఒక చెలమ దగ్గర కనిపించాయి. ఆ అందమైన దృశ్యాన్ని చూడాలని దగ్గరకు వెళ్లారు. మనుషుల అలికిడి గమనించిన జింకలు సర్రుసర్రున పరుగులు తీశాయి. ఏనుగులేమో కదలలేక కదుల్తూ వెళ్లిపోయాయి. వాటిని చూపిస్తూ మంత్రి 'రాజా! బరువు తక్కువగా ఉండటం వల్ల శరీరం తేలికగా ఉండే జింకలు పరుగులు తీశాయి. అదే ఏనుగులు ఎక్కువ బరువు ఉన్నందు వల్ల జింకలంత వేగంగా పరుగులు తీయలేకపోయాయి. ఇది మీరు గమనించే ఉంటారు. తేలికైన శరీరం సుఖాన్ని ఇస్తుంది. బరువైన శరీరం బాధ పెడుతుంది' అని సవినయంగా చెప్పాడు.
మంత్రి మాటల ద్వారా మితమైన శరీర బరువు మంచిదని యువరాజుకు అర్థమైంది.
'తిండి తినకపోతే శక్తి ఎలా వస్తుంది?' అని యువరాజు ప్రశ్నించాడు.
'అరవై శాతం శక్తి మనకి ప్రకృతిలోని గాలి, నీరు, సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. మిగతా నలభై శాతం ఆహారాన్ని మనం వేళాపాళా లేకుండా, అవసరానికి మించి, తింటూ ఆరోగ్యాన్ని మనమే చేతులారా చెడగొట్టుకొంటున్నాము' అని వివరించాడు మంత్రి.
'కడుపు నిండా తిని, పడుకొంటే మజాగా ఉంటుంది కదా!' అన్నాడు యువరాజు.
'అది తాత్కాలికమే రాజా, తగినంత శారీరక శ్రమ లేకపోతే తిన్న ఆహారమే శరీరానికి విషమౌతుంది. కత్తిని ఎక్కువకాలం ఉపయోగించకపోతే చిలుము పట్టే విషయము మీకు తెలిసినదే కదా! మనం జీవించడానికి తినాలి తప్పా, తినడానికే జీవించడం తప్పని పెద్దలు చెప్పినారు రాజా!' అని చెప్పాడు మంత్రి.
'ఇన్నాళ్లూ అందరూ నన్ను బాగా తిను, బలం వస్తుంది అని చెప్పిన వాళ్లేగానీ, ఆహారం గురించి మంచి చెడ్డలు కళ్ళకు కట్టినట్లుగా వివరించిన వారు లేరు!' అన్నాడు యువరాజు.
అప్పటి నుంచి మితాహారం తీసుకుంటూ, ఆరోగ్య జాగ్రత్తలు ఎన్నో తీసుకోవడం మొదలెట్టాడు. యువరాజులోని మార్పునకు రాజు, రాణి సంతోషించారు. తాము విశ్రాంతి తీసుకొంటున్నామని చెప్పి యువరాజుకు పట్టాభిషేకం చేశారు.
 

ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు
939366 62821