Feb 07,2022 07:48
  • బడ్జెట్‌ కసరత్తులో ప్రస్తావనే లేదు
  • రొటీన్‌గా విపత్తు నిధి, బీమా ప్రతిపాదనలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : తామర తెగులుతో మిర్చి పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి శాఖల వారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై జరుగుతున్న కసరత్తులో మిర్చి రైతుల పరిహారం విషయం లేదని సమాచారం. అటు విపత్తు సహాయం కింద ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) ఇటు పంటల బీమా రెండు ప్రతిపాదనలలోనూ మిర్చి రైతుల అంశం చర్చల్లో లేదు. బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధుల ప్రతిపాదనలు చేయకుండా రైతులకు పరిహారం ఇవ్వడం వీలు పడదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిమిత్తం వివిధ ప్రభుత్వ విభాగాల పద్దుల కూర్పుపై సమాలోచనలు సాగుతున్నాయి. వ్యవసాయశాఖ చేసిన ప్రతిపాదనలు యథాలాపంగా (రొటీన్‌) ఉన్నాయి తప్ప ప్రత్యేక పరిస్థితులను ప్రతిబింబించలేదు. ఈ తడవ ఖరీఫ్‌లో మిర్చి రైతులకు అసాధారణ పరిస్థితులు ఎదురయ్యాయి. ఇటీవలికాలంలో ఎన్నడూ లేని విధంగా 4.64 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు కాగా అంతుబట్టని తెగుళ్లు దాడి చేసి దాదాపు సగభాగం ఆసాంతం తుడిచిపెట్టాయి. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, అనంతపురంలో ఎక్కువగా మిర్చి వేశారు. పంటను మధ్యలోనే రైతులు తొలగించాల్సి వచ్చింది. ఎకరాకు రెండు మూడు క్వింటాళ్ల దిగుబడి కనాకష్టమైంది. కోత కూలి ఖర్చులూ గిట్టవని చేలల్లోనే పంటను వదిలేశారు. ట్రాక్టర్లతో దున్నేశారు. కొన్ని చోట్ల పంటను నిలుపుకునేందుకు అదనంగా పురుగుమందులకు డబ్బులు వెచ్చించి నష్టపోయారు. స్వంత భూమిదారుడైతే ఎకరాకు రూ.లక్ష, కౌలు రైతులైతే లక్షన్నర వరకు పెట్టుబడి నష్ట పోయారు. తమకు పెట్టుబడి మందం పరిహారం ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నారు.
 

                                                                 ఇన్‌పుట్‌ సంగతి

ఎపితో పాటు పొరుగు రాష్ట్ల్రాల్లో సైతం తామర తెగులు విజృంభించిన దరిమిలా జాతీయ విపత్తుగా ప్రకటించి, నిబంధనలతో నిమిత్తం లేకుండా ప్రత్యేక కేసుగా పరిగణించి రైతులను ఆదుకోవాలనే అంశంపై కేంద్రంలో స్పందన లేదు. రాష్ట్రం సైతం కేంద్రానికి బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలపై లేఖలు రాసి ఊరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర బడ్జెట్‌ కసరత్తులో మిర్చి రైతుల అంశంపై చర్చే లేదు. 2021 ఖరీఫ్‌లో విపత్తుల వలన పంటలు నష్టపోయిన రైతులకు ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుండి పరిహారం ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు అడిగారు. నవంబర్‌ వర్షాలకే 13 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలకు మిర్చికి జరిగిన నష్టం నామమాత్రమని ఇప్పటికే ఎన్యూమరేషన్‌లో తేలింది. ప్రకృతి విపత్తుల నిధి నుండి మిర్చి రైతులకు ఇచ్చేది స్వల్పం. ఇచ్చినా ఎకరాకు రూ.8 వేలు అందుతాయి.
 

                                                               బీమా తంతు

ఇక పంటల బీమా కేటాయింపుల్లోనూ మిర్చి అంశం ప్రత్యేకంగా లేదు. దీనికీ రూ.2,015 కోట్లు కావాలన్నారు. ప్రతిపాదిత ప్రాంతాల్లో ప్రతిపాదిత పంటకు అదీ యూనిట్‌ వారీగా ఇన్సూరెన్స్‌ ఉంటుంది. కేంద్రంతో సంబంధం లేకుండా ఇ-క్రాప్‌ ప్రామాణికంగా వాతావరణ, దిగుబడి ఆధారిత పథకాలను రాష్ట్రమే అమలు చేస్తున్నందున పూర్తి నిదులు రాష్ట్రమే భరించాలి. మిర్చికి నిబంధనలు వర్తిస్తాయో లేదో స్పష్టత లేదు. బడ్జెట్‌లో ప్రతిపాదనలు లేవు. మిర్చి రైతులకు హీనపక్షం రూ.2-3 వేల కోట్ల నష్టం వాటిల్లగా బడ్జెట్‌లో వీసమెత్తు పెట్టలేదు.