Dec 21,2021 06:59

    మారు మిరప పండించిన రైతాంగం కష్టాల సుడిగుండంలో చిక్కుబడింది. మునుపెన్నడూ ఇంతటి దారుణ పరిస్థితిని రైతులు ఎరిగుండరు. కల్తీ విత్తనాలు, నకిలీ నారు, అంతుబట్టని తెగుళ్లు, అధిక వర్షాలు, వరదలు, మధ్య మధ్య వర్షాభావం కట్టకట్టుకొని ముప్పేట దాడి చేశాయి. రైతులకు భారీ నష్టాలు మిగిల్చాయి. అచేతనావస్థలో పడ్డ లక్షలాది మంది రైతులు తమకు ప్రభుత్వమే దిక్కని వాపోతున్నారు. రాష్ట్రంలో సాగయ్యే వాణిజ్య పంటల్లో పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో వేసేది మిర్చినే. తతిమ్మా కమర్షియల్‌ క్రాప్స్‌ మాదిరిగానే మిర్చి సాగు సైతం జూదాన్ని తలపిస్తోంది. చాన్స్‌ తగిలితే కాసిన్ని డబ్బులు మిగులుతాయి. లేదంటే మొత్తం ఊడ్చుకుపోతుంది. రెండేళ్లలో మిర్చికి అప్పుడో ఇప్పుడో కాస్త ధర రావడంతో మెట్ట ప్రాంత రైతులు ఈ తడవ మిర్చి కేసి మళ్లారు. కొన్ని చోట్ల పత్తి స్థానంలో మిర్చి సాగు చేశారు. దాంతో సాధారణ విస్తీర్ణం కంటే దాదాపు లక్ష ఎకరాల్లో సాగు పెరిగింది. ఖరీఫ్‌లో 3.72 లక్షల ఎకరాల్లో మిర్చి సాగును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నార్మల్‌ మాత్రం 3.45 లక్షల ఎకరాలే. కాగా నార్మల్‌, టార్గెట్‌ రెంటినీ దాటుకొని ఏకంగా 4.60 లక్షల ఎకరాల్లో ఈ ఏట సాగైంది. తీరా చూస్తే మొక్కలొచ్చాయి తప్ప పూత, పిందె లేదు. అంతుబట్టని పురుగు వ్యాపించి కాండం సైతం తొలిచేశాయి. గత్యంతరం లేక రైతులు లక్షల ఎకరాల్లో పైరు తొలగించేస్తున్నారు. కన్నబిడ్డను చంపుకున్నంత వేదన వారిది.
     మిర్చి రైతు కంట కన్నీటికి వాతావరణాన్నే కారణంగా చూపితే పాక్షికత్వమే అవుతుంది. కిలో విత్తనాలను లక్షల రూపాయలకు విక్రయించే బేహారులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. కల్తీ, నకిలీలను సహించేదే లేదన్న ప్రభుత్వ పాలనలో వాటిని అమ్ముకొని రైతులను నిలువునా మోసం చేసిన కంపెనీలపై ఒక్క చర్య కూడా లేదు. కల్తీ మిర్చి నారు అమ్మిన నర్సరీలపై, డీలర్లపై కేసుల్లేవు. కంపెనీల నుండి నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు రోడ్డెక్కితే పోలీస్‌ దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. కంపెనీలు, నర్సరీల నుండి పరిహారం ఇప్పించే బాధ్యత నుండి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒక ఎకరాలో మిర్చి సాగుకు కనీసం రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. అదే కౌలు రైతులకైతే ఇంకా అదనం. రెండు లక్షల ఎకరాల్లో పైరు పూర్తిగా పోయిందంటున్నారు. ఎకరాకు రూ.లక్ష వేసుకున్నా తక్కువలో తక్కువ రూ.2 వేల కోట్ల పెట్టుబడి నష్టం. ఉత్పత్తి నష్టాన్ని అంచనా వేస్తే రైతులకు జరిగిన నష్టం కొన్ని రెట్లు ఎక్కువ. మిర్చిని అధికంగా సాగు చేసిన గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, అనంతపురం జిల్లాల రైతులు ఈ నష్టాల్లో సింహభాగం భరిస్తున్నారు.
    మిర్చి రైతులు లబోదిబోమంటుండగా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. బాధిత రైతుల ఆందోళనల నేపథ్యంలో ఎప్పటికో వ్యవసాయశాఖ మంత్రి స్పందించారు. తెగుళ్లపై అధ్యయనానికి ఉద్యానవన వర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని వేశామన్నారు. ముఖ్యమంత్రి ఆదుకుంటారంటూ మరి కొంత మంది మంత్రులు రైతులను చల్లబర్చేయత్నం చేశారు. నకిలీ, కల్తీ విత్తనాలు, నారు అమ్మిన వారిపై చర్యల విషయంలో ఇప్పటికీ ప్రభుత్వానిది మౌనమే. కంపెనీలు, డీలర్ల మెడలు వంచి రైతులకు పరిహారం ఇప్పించాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కిస్తే తప్పు చేసిన నేరస్తులకు అధికారికంగా లైసెన్స్‌ ఇచ్చినట్లే. నకిలీ కంపెనీలు స్వైర విహారం చేస్తున్నా ఊరూరా నెలకొల్పిన సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, పోలీసులు, విజిలెన్స్‌్‌, ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నాయో తెలీదు. నల్ల తామర పురుగు ఎ.పి తో పాటు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర లోనూ వ్యాపించిందని చెబుతున్నారు. నాలుగు రాష్ట్రాల్లో వ్యాపించినందున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంది. ఐతే ఆ పేరుతో రాష్ట్రం కాలయాపన చేయడం ఆమోదయోగ్యం కాదు. కేంద్రం స్పందించే వరకు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం, బీమా చెల్లించాలి. నకిలీ, కల్తీ విత్తనాలమ్ముతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలి. మిగిలిన పంటకైనా గిట్టుబాటు ధర కల్పించి మిర్చి రైతులను ఆదుకోవాలి.