Mar 20,2023 21:32

ఫొటో : నిరసన చేపడుతున్న కార్మికులు

ప్రజాశక్తి-మర్రిపాడు : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర, జిల్లా కమిటీల మేరకు సిఐటియు నాయకులు మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం ఎంఇఒ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం సిఐటియు మండల కార్యదర్శి బత్తల రత్నయ్య పాల్గొని మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని 20 ఏళ్ల నుండి నిర్వహిస్తున్నా ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. ప్రతి కార్మికురాలికి నెలకు రూ.26వేలు వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మెనూ ఛార్జీలు పెంచాలని ప్రతి విద్యార్థికి రూ.15 చొప్పున ఇవ్వాలని, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. అలాగే కార్మికులకు రెండు జతల యూనిఫారం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి గోరుముద్ద మెనూ ఛార్జీలను పెంచి, కార్మికులపై రాజకీయ నాయకుల ఒత్తిడి లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. వారికి ప్రతినెలా జీతాలు, బిల్లులు సకాలంలో ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. విద్యార్థులకు రాగిజావ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే నిత్యావసర వస్తువులు, గ్యాస్‌ ధరలు పెరిగడంతో మెనూఛార్జీలు పెంచి వాటిని నెలనెలా తమ ఖాతాలలో నగదు జమచేస్తేనే రాగిజావ పెడతామని లేనియెడల కష్టంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రహంతుల్లా, భోజన కార్మికులు పాల్గొన్నారు.