Jan 21,2023 20:37

నిరసన తెలుపుతున్న ఐద్వా నాయకులు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : భారత దేశంలో మహిళలకు రక్షణ లేదని, లైంగిక వేధింపులను అరికట్టలేని ప్రభుత్వాలు గద్దెదిగాలని ఐద్వా పట్టణ కార్యదర్శి భాగ్యమ్మ డిమాండ్‌ చేశారు. డిల్లీలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక విజయనగర్‌ కాలనీలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన సంఘటన దేశానికే మాయనిమచ్చని, కేంద్ర మంత్రి ఆధ్వర్యంలోని అక్కడి పోలీసులు, కేంద్ర ప్రభుత్వం మహిళలను ఎలా రక్షిస్తుందని ప్రశ్నించారు. మహిళా రెజ్లర్లపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఆపాలని కోరారు. సిఐటియు జిల్లా నాయకులు హరిశర్మ మాట్లాడుతూ దేశం తరుపున అనేక క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లు రోడ్డుపై ధర్నా చేస్తున్నారంటే మహిళల రక్షణ పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి తెలిసిపోతుందన్నారు. బిజెపి ఎంపీ బృజ్బూషణ్‌ ఆగడాలను అరికట్టాలని, వెంటనే అయన్ను అరెస్టు చేయాలని కోరారు. పతకాలు సాధించి మనదేశ గౌరవాన్ని నిలబెట్టిన మహిళల కు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఢిల్లీ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతిపై జరిగిన దాడిని ఖండించారు. దోషులను వెంటనే శిక్షించకపోతే ఆందోళన ఉదృతంచేస్తామన్నారు. ఈ నిరసనలో విజయనగర్‌ ఐద్వా నాయకులు రెడ్డిప్రసన్న, కృష్ణప్రియ, తెహరున్నిసా, సరస్వతి మహిళలు పాల్లొన్నారు.