ప్రజాశక్తి-వన్‌టౌన్
మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. అఖిలభారత ప్రజాతంత్ర మహళా సంఘం (ఐద్వా) పశ్చిమ సిటీ ద్వితీయ మహాసభ ఆదివారం సితార సెంటర్‌లోని లేబర్ కాలనీలో గల రాయల్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగింది. తొలుతగా ఐద్వా జెండాను ఐద్వా పశ్చిమ సిటీ గౌరవాధ్యక్షురాలు కుండనల శేషుమణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి, ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి కె. శ్రీదేవి, సిఐటియు అంగన్‌వాడీల నాయకురాలు సుప్రజలు హాజరయ్యారు. మహాసభ సందర్భంగా ఇటీవల మరణించిన ఐద్వా రాష్ట్ర నాయకురాళ్లు మల్లు స్వరాజ్యం, బిక్షవతి, సామ్రాజ్యం, టి. ఆదిలక్ష్మీ చిత్రపటాలకు పూలమాలవువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నేడు మహిళలు పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లు తెలిపారు. మహిళలు లేనిదే సమాజం మనుగడ లేదన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి మాట్లాడుతూ నేడు మహిళలకు రక్షణ కరవైందన్నారు. దేశంలో, రాష్ట్రంలో మహిళల పట్ల అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ఉన్న చట్టాల అమలు చేయడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాపోయారు. ఐద్వా ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి కె. శ్రీదేవి మాట్లాడుతూ మహిళల పట్ల వివక్ష చూపకుండా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఐద్వాకు సేవలు అందించిన కీ.శే. మల్లు స్వరాజ్యం, భిక్షవతి, సామ్రాజ్యం, టి. ఆదిలక్ష్మి వారిని స్ఫూర్తిగా తీసుకుని మహిళలు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు విక్రం లక్ష్మీ, స్వప్న, పద్మ, మహిళలు పాల్గొన్నారు.
ఐద్వా పశ్చిమ సిటీ నూతన కమిటీ :
ఐద్వా పశ్చిమ సిటీకి నూతన కమిటీ నియామకం జరిగింది. అధ్యక్షురాలుగా కుండనాల శేషుమణి, కార్యదర్శి గాదే ఆదిలక్ష్మీ, సహాయ కార్యదర్శులుగా స్వప్న, వరలక్ష్మీ, వెంకటరత్నం, జయలక్ష్మి, ఉపాధ్యక్షురాలుగా విక్రం లక్ష్మీతో పాటు మరో ఎనిమిదిమంది సభ్యులను ఎన్నుకున్నారు.










